.
( రమణ కొంటికర్ల
) ….. ఆమె ఉద్యోగకాల మౌనం.. పదవీ విరమణకు ఓ నెల ముందు ఒక్కసారిగా బద్ధలైంది. సోషల్ మీడియా వేదికగా గళం విప్పింది. అత్యున్నత పదవిలో ఉండి కూడా తానెలాంటి వర్ణ, లింగ వివక్ష ఎదుర్కొందో తన ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఈ మధ్యే అత్యున్నత పదవి నుంచి రిటైర్డ్ అయిన కేరళ ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేసిన శారద ఆవేదన.
శారదా మురళీధరన్ 1990వ బ్యాచ్ కేడర్ కేరళ ఐఏఎస్ అధికారిణి. పదవీ విరమణకు నెల రోజుల ముందు సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్ ఓ పోస్ట్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. 35 ఏళ్ల తన ప్రజాసేవ తర్వాత రిటైర్డ్మెంట్ ప్రకటించే సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలవరం సృష్టిస్తున్నాయి.
Ads
పదవిలో ఉన్నప్పుడు కూడా తాను లింగవివక్ష, వర్ణ వివక్షకు ఎలా గురైందీ.. ఆ అనుభవం ఎంత అసౌకర్యంగా అనిపించేదో ఆమె చెప్పుకొచ్చింది. సరిగ్గా ఆమె పదవీ విరమణకు ముందు మార్చ్ నెలలో సోషల్ మీడియాలో తానెదుర్కొన్న చేదు అనుభవాల్ని పోస్ట్ చేసింది శారద. తన భర్త రంగుతో పోలుస్తూ.. తాను నల్లగా ఉన్నానని ఎలా మాట్లాడుకునేవారో తెలియజెప్పింది.
ఇదంతా సమాజంలో చర్చకు రావాలని.. ఇంకా ఇలాంటి ధోరణులేంటనే పెయిన్ ఆమె పోస్ట్ లో కనిపించింది. ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఐఏఎస్ అధికారికే ఈ లింగ వివక్ష, జాతి వివక్ష, వర్ణ వివక్ష వంటివి తప్పకపోతే.. ఇక సామాన్యుల పరిస్థితేంటన్న ఆవేదన ఆమె మాటల్లో కనిపించింది.
తాను చీఫ్ సెక్రటరీగా పనిచేసిన చివరి ఏడు నెలల కాలంలో పలుమార్లు తన భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సి వచ్చిందట. నల్లగా ఉందంటూ ముద్ర వేయడం ఓ సిగ్గుమాలిన చర్య అంటూ తన ఆక్రోషాన్ని వెళ్లగక్కింది సివిల్ సర్వెంట్ శారద.
నలుపు నల్లగా ఉండకుంటే.. ఇంకెలా ఉంటుందంటూ ప్రశ్నించింది. నలుపును అశుభాలకు సంకేతంగా, నిరంకుశత్వానికి ప్రతీకగా, హృదయం లేనివారిగా చిత్రణ చేస్తూ ఎలా తన వెనుక మాట్లాడుకునేవారో తన పోస్టులో వెల్లడించింది శారదా మురళీధరన్.
నల్లగా ఉన్నవారి పట్ల వర్ణవివక్షను చూపించేవారికి.. నలుపు గురించి వివరించే యత్నమూ చేసింది శారద. నలుపును అసలెందుకు అవమానించాలి..? దేన్నైనా సంగ్రహించగల్గే శక్తి నలుపుకున్నందుకా…? కళ్లకు చలువ చేసే కాటుక రంగు సంతరించుకున్నందుకా..? కారుమబ్బులు కమ్ముకుంటేనేగా వర్షం వచ్చేది..? అసలెందుకు నలుపుపై తక్కువ చూపో చెప్పాలంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించింది.
తన పోస్ట్ పై చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, బ్యూరోక్రాట్స్ నుంచీ అనూహ్యమైన స్పందన వచ్చిందనీ.. అయితే, అదే సమయంలో తనపై ప్రకటించిన సానుభూతిలోనూ ఆమె వర్ణ వివక్షను చూశానంటోంది.
మీరు నల్లగా ఉన్నప్పటికీ, వర్ణవివక్ష ఎదుర్కొంటున్నప్పటికీ.. మీరు మాత్రం గట్టిగా పోరాటం చేస్తున్నారంటూ ఇంకాస్త వెటకారాన్ని దట్టిస్తూ పోస్ట్ చేసినవారు కొందరైతే… అనవసరమైన జాలి కనబర్చినవారు మరికొందరని పేర్కొంది శారద. ఏస్ నల్లగా ఉన్నాను.. అందులోనూ మహిళను.. అయితే ఏంటంటూ ప్రశ్నిస్తోంది తన పోస్ట్ ద్వారా శారదా మురళీధరన్.
తాను ఎవరి వల్ల అవమానానికి గురయ్యానన్నది రివీల్ చేయదల్చుకోవడం తన ఉద్ధేశం కాదని.. సమాజంలో ఇలాంటి అంశాలపై ఒక చర్చ జరగడమే తన మోటో అంటోంది శారద. చాలామంది బ్యూరోక్రాట్స్ చాలా చిన్న విషయంగా కొట్టిపారేసేవారని.. కానీ, వాళ్లెవ్వరూ ఇలాంటివాటి పరిష్కారం పట్ల చొరవ చూపేందుకు ఆసక్తి కనబర్చలేదంటోంది.
ఎవరీ శారదా మురళీధరన్..?
2006 నుంచి 2012 మధ్య ఆరేళ్ల పాటు కుటుంబశ్రీ మిషన్ కు నాయకత్వం వహించి కేరళ ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందిన అధికారిణి. పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖలోనూ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ మిషన్ లోనూ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గానూ, నిఫ్ట్ లో డైరెక్టర్ జనరల్ గానూ పనిచేసిన అనుభవం శారదా మురళీధర్ ది.
తన భర్త వి. వేణు రిటైర్డయ్యాక ఆయన స్థానంలో 2024 ఆగస్టులో కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించింది శారద. ఈ ఏడాది ఏప్రిల్ లో పదవీ విరమణ చేశారామె. ఆ పదవీ విరమణకు ముందు మార్చ్ నెలలో ఈ పోస్ట్ చేయగా.. ఇప్పటికీ ఆమె చేసిన పోస్ట్ తాలూకు చర్చ ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది.
కేరళలోని టాప్ మోస్ట్ సివిల్ సర్వెంట్స్ లో ఒకరిగా గుర్తింపు పొందిన శారద.. ఏనాడూ తాను పౌరసేవల్లోకి వచ్చి ఓ ఐఏఎస్ అధికారిగా కీలక పాత్ర పోషిస్తానని చిన్ననాట అనుకోలేదంటోంది. ఫిజికల్ యాక్టివిటీస్ కు కాస్త దూరందూరంగానే గడిచిన తన బాల్యంలో తానెక్కువగా మౌనంగా, రిజర్వుడ్ గా ఉండేదాన్నని.. కాకపోతే కళల పట్ల మాత్రం తనకు మక్కువ ఎక్కువుండేదంటారామె.
ముఖ్యంగా సాహిత్యమంటే ఎక్కువగా ఇష్టపడ్డ శారదా మురళీధరన్.. బ్రూరోక్రాట్ గా విధుల్లోకి వచ్చిన కొత్తలో తనకు ఆ ఉద్యోగం చేయాలనిపించలేదనీ కుండబద్ధలు కొట్టింది. కానీ, కొందరు తనలాంటివారు కూడా ఇంకా ఏదో నేర్చుకోవచ్చనే తపనతో తన ఫీల్డ్ లో కనిపించడం తనకు స్ఫూర్తినిచ్చిందని.. అందుకే, అలాంటి భావాల్ని పక్కనబెట్టి రాజీనామాను ఉపసంహరించుకున్నానంటోంది.
ముఖ్యమంత్రి విజయన్ పని తీరుపై ప్రశంసలు!
రాష్ట్రంలో వివిధ ముఖ్యమంత్రులతో దగ్గరగా పనిచేసిన తనకు.. ప్రస్తుత ముఖ్యమంత్రి పినరయి విజయన్ అంటే అభిమానంటున్నారు శారద. ఎందుకంటే, తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పనిచేయడం విజయన్ ప్రత్యేకత. అలాగే, సంక్షోభ సమయాల్లో ఎలా వ్యవహరించాలో తెలిసిన రాజనీతిజ్ఞుడంటోంది ఈ ఐఏఎస్.
అలాగే, పగలూ, రాత్రన్న తేడా లేకుండా బయటకు వెళ్లి ప్రజానీకంతో మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ కనెక్ట్ అయ్యేవారని.. రాత్రి 11 గంటల సమయంలోనూ సాధారణ ప్రయాణీకులతో కలిసి ఆయన రైలు ప్రయాణాలు చేసేవారంటోంది. వందలాది పిటిషన్లు స్వీకరించడం, ప్రతీదాన్నీ పరిశీలిస్తూ నోట్స్ రాసుకోవడం తాను ఓ అధికారిగా కళ్లతో చూశానంటోంది.
ఇక అంతకుముందున్న వీ.ఎస్. అచ్యుతానందన్ కాస్త కఠినంగా ఉండేవారని.. తానేం చేసినా అందరికీ జవాబుదారీగా ఉండాలనే సంకల్పంతో పనిచేసేవారంటోంది శారదా అనే బ్యూరోక్రాట్. కేరళ అధికార యంత్రాగమంతా రాజకీయ నాయకులకు బాగా సాన్నిహిత్యంగా ఉండటానికి గల కారణం.. కేరళలో ఉండే ప్రత్యేక రాజకీయ పరిస్థితులేనంటోంది.
సివిల్ సర్వెంట్స్ గా పదవీ, బాధ్యతలు చేపట్టినప్పుడుండే బిరుసు అనేది.. రానురాను తగ్గిపోతుందని.. నాయకుల పట్ల ప్రారంభంలో ఉన్న ఉదాసీనతంతా వారికున్న ప్రజాదరణతో దూరమైపోతుందంటుంది ఈ బ్యూరోక్రాట్.
ఇప్పుుడ రిటైర్డ్మెంట్ తర్వాత తన జీవితాన్ని బోర్ కాకుండా.. బోలెడన్ని పుస్తకాలను చదివే పని పెట్టుకున్నానంటోంది. పదవీ విరమణనంతర జీవితాన్ని కూడా పదవిలో ఉన్నప్పటికంటే థ్రిల్ గా ఎలా మార్చుకోవాలో యోచిస్తున్నానంటోంది శారదా మురళీధరన్…
Share this Article