… నలుగురు కూడిన చోట ఎవరి గురించైనా చెడ్డగా మాట్లాడుకుంటూ ఉంటే ‘లోకులు పలు కాకులు’ అంటాం! పాపం కాకులు ఏమి చేశాయి? కావ్.. కావ్ అని అనడం తప్ప! కొన్నిసార్లు కొందరు కళాకారులు కూడా అలా కాకులవుతారు. ఆ కాకులకంటే దారుణంగా అరుస్తుంటారు. తమ అసలు నలుపు తెలియక తమ అరుపుల్ని సమర్థించుకుంటూ ఉంటారు.
… కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉన్న కళామండలం కళాకారులకు పుణ్యధామం. 1930లో వి.నారాయణ మీనన్ ఆ సంస్థను ప్రారంభించారు. అక్కడ కేరళ సంప్రదాయ నృత్య రీతులైన కథాకళి, మోహినీయాట్టం, కుడియాట్టం, తుళ్లల్‌తోపాటు కూచిపూడి, భరతనాట్యం కూడా నేర్పిస్తారు. 2007లో భారత ప్రభుత్వం ‘కళామండలం’ సంస్థను డీమ్డ్ యూనివర్సిటీగా ప్రకటించింది. శిక్షణలో సంప్రదాయ రీతినే నేటికీ అనుసరిస్తున్న కళామండలం కొన్నిసార్లు నూతన ఒరవడినీ ఆహ్వానించింది. తరతరాల నుంచి పురుషులకే పరిమితమైన కథాకళి నృత్యశిక్షణను 2022లో తొలిసారి మహిళలకూ అందేలా సంచలన నిర్ణయం తీసుకుంది. కళామండలం గోపి, కల్యాణి కుట్టీ, కృష్ణన్ నాయర్, సత్యభామ (సీనియర్) వంటి ఎందరో మహానుభావులు ఆ సంస్థ నుంచి వచ్చినవారే!
… అక్కడి నుంచి వచ్చిన మొహినీయాట్టం కళాకారిణి సత్యభామ (జూనియర్). పేరుతో అయోమయపడొద్దు. సీనియర్ సత్యభామ మరణించారు. ఇప్పుడు మాట్లాడేది జూనియర్ సత్యభామ గారి గురించి. చక్కటి ప్రతిభతో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారామె. ఎంతోమంది విద్యార్థులకు విద్య నేర్పారు. కానీ అహంకారం ఎంతటివారినైనా అథఃపాతాళానికి తోసేస్తుంది అనేందుకు ఉదాహరణగా నిలిచారు. ఇటీవల ఓ మలయాళ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ “మోహినీయాట్టం అనేది మోహినీ అవతారం నుంచి వచ్చింది. మోహినీ అంటే అందంగా, ఆకర్షణీయంగా ఉండాలి. అంతేకానీ నల్లగా, వంకరటింకర కాళ్లేసుకొన్న మగవాళ్లు మోహినీయాట్టం చేస్తే అస్సలు బాగుండదు. ఆ మగవాళ్లు కాకుల్లా ఉంటారు, వాళ్ల అమ్మలు కూడా వాళ్ల ముఖాలు చూడలేరు” అని అన్నారు. అంతే! కేరళ సమాజం భగ్గుమంది.
Ads
… సత్యభామ చేసిన ఆ కామెంట్లు గాలికి పోయే నీటిబుడగలు కాదు. ఆమె ఎవర్ని ఉద్దేశించి ఆ మాటలందో అందరికీ తెలుసు! ప్రముఖ నటుడు దివంగత కళాభవన్ మణి అన్నయ్య ఆర్.ఎల్.వి.రామకృష్ణన్ మీదే! ఆయనది దళిత కుటుంబం. 66 ఏళ్ల వయసు ఆయనకు. ప్రసిద్ధ మోహినీయాట్టం కళాకారుడు. ఆ కళలో ఎంతో నైపుణ్యం సాధించి పీహెచ్డీ పొందిన వ్యక్తి. కానీ ‘పురుషులు మోహినీయాట్టం చేయడం ఏమిటి? అందునా నల్లగా ఉండే ఇతను చేయడం ఏమిటి?’ అనే మాటల్ని ఎన్నోమార్లు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు మరోసారి, మరో రకంగా!
… మోహినీయాట్టం ఎన్నో ఏళ్లుగా స్త్రీలకే పరిమితమై ఉంది. ఆ తర్వాత మెల్లగా అందులో పురుషులు ప్రవేశించి తమ సత్తా చాటుతున్నారు. కానీ ఇలాంటి మాటలు వారిని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నాయి. తన మాటల పట్ల సత్యభామ పశ్చాత్తాపం ప్రకటించలేదు సరికదా, తాను నాట్యశాస్త్రంలోని అంశాలకు తగ్గట్టే మాట్లాడాలని, అది తన అభిప్రాయం అని తేల్చారు. నాట్యంలో ప్రావీణ్యంతోపాటు అందం కూడా అవసరం అన్నారు. తన వ్యాఖ్యల మీద ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధం అని తెలిపారు. అభిప్రాయం ఉండటం మంచిదే, కానీ అది ఇతరులను కించపరిచి, అవమానించేలా ఉండొద్దు కదా!
… ఆమె వ్యాఖ్యలపై కేరళ సమాజం తీవ్రస్థాయిలో స్పందించింది. ఎల్డీఎఫ్, కాంగ్రెస్, భాజపా తదితర పార్టీలన్నీ రామకృష్ణన్‌కు మద్దతుగా నిలిచాయి. సత్యభామ మీద కేసు నమోదు చేయాలని కేరళ మానవ హక్కుల కమిషన్ సూచించింది. ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కేరళలోని అనేక కళాకారుల సమాజాలు, సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
… గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 2020లో కేరళ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ నృత్య కార్యక్రమంలో మోహినీయాట్టం ప్రదర్శన కోసం రామకృష్ణన్ దరఖాస్తు చేసుకోగా, అకాడమీ దాన్ని నిరాకరించింది. ఆ బాధతో ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు. అప్పటికి అకాడమీ అధ్యక్షురాలిగా నటి కె.పి.ఎ.సి.లలిత ఉన్నారు. దళితుడైన కారణంగానే రామకృష్ణన్‌ను స్టేజీ ఎక్కనివ్వలేదని కేరళలోని ఎస్సి, ఎస్టీ సంఘాలు అధికార ఎల్డీఎఫ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఇప్పుడు మరోసారి ఇలా!
… నిజంగా సత్యభామ చెప్పినట్టు నాట్యకళకు అందం అవసరమా? కాదని అంటున్నారు నాట్యనిపుణులు. నాట్య శాస్త్రంలో చెప్పిన అందం అనేది ఆహార్యం, అభినయం, ముద్రల గురించే తప్ప ఒంటి రంగు గురించి కాదని వివరిస్తున్నారు. నాట్యకళకు రంగు, కులం, మతంతో సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు.
… తన వ్యాఖ్యల్ని సత్యభామ సమర్థించుకున్న అనంతరం ఆర్.ఎల్.వి.రామకృష్ణన్ స్పందిస్తూ “కేరళలోని ప్రతి మూలా మోహినీయాట్టం ప్రదర్శనలు ఇవ్వాలని ఉంది. తద్వారా ఆ వర్ణవివక్షకు వ్యతిరేకంగా నా నిరసన తెలపాలని ఉంది” అన్నారు. కాకులు నిత్యం అరుస్తూనే ఉంటాయి. కోకిలకు తెలియదా తానెప్పుడు గొంతు విప్పాలో! – విశీ (వి.సాయివంశీ)
Share this Article