‘లెఫ్టిస్టులు సంబరాలు చేసుకోవడం ఆపండి.. శ్రీలంక ప్రెసిడెంట్ దిస్సనాయకే జేవీపీ (జనతా విముక్తి పెరమున) పార్టీకి చెందిన వ్యక్తి. అది ఒక కమ్యూనిస్టు పార్టీగా చెప్పుకుంటుంది. కానీ తమిళులు, ముస్లింలను ఏ మాత్రం పట్టించుకోదు. వారి అస్థిత్వ పోరాటాలను జేవీపీ ఏనాడూ గుర్తించలేదు. వాస్తవం చెప్పుకోవాలంటే దిస్సనాయకే ఒక సింహళ చావనిస్టు. మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స, ఆయన సోదరుడు గొటబాయ రాజపక్సలు ఈయన కంటే లైట్ వెర్షనే’ ఇదీ రచయిత్రి, మార్క్సిస్టు, ఫెమినిస్ట్ అయిన కవితా క్రిష్ణన్.. ప్రముఖ జర్నలిస్టు ఆర్కే రాధాక్రిష్ణన్ రాసిన ఒక ఆర్టికల్‌ను మెన్షన్ చేస్తూ పెట్టిన ట్వీట్.
లెఫ్ట్ పత్రికలు ఫస్ట్ పేజీల్లో బ్యానర్లు పరిచాయి… సీపీఎం పొలిట్ బ్యూరో కంగ్రాట్స్ కూడా చెప్పింది… లెఫ్ట్ సోషల్ మీడియా సంబరాలు చేసుకుంది,..
నేను కూడా రాత్రి ఎర్రజెండా ఎగిరింది.. అరుణారుణ వందనాలు అంటూ ఒక పోస్టు రాశాను. దానికి ఒక సోదరుడు.. మిత్రమా అతను లెఫ్టిస్టేమీ కాదు. ప్రతీ ఎర్రజెండా కమ్యూనిస్టు పార్టీ కాదు అని చెప్పాడు. దీంతో నేను కూడా ఎర్ర జెండా ముసుగేసుకున్న దిస్సనాయకే గురించి మరింత తెలుసుకోవాలని అనుకున్నాను. ఆ క్రమంలో ది హిందూలో వచ్చిన ఆర్టికల్ నాకు కొంచెం జ్ఞాన బోధ చేసింది. అయితే 2022లోనే ‘వరల్డ్ సోషలిస్ట్ వెబ్ సైట్ – WSWS’ ఇదే జేవీపీ లీడర్ అనుర కుమార దిస్సనాయకేను సింహళ చావనిస్టుగా పేర్కొన్నది. దాన్ని ఏకంగా ఆర్టికల్‌కు హెడ్‌లైన్‌గా పెట్టింది.
Ads
ఇక ఫ్రంట్‌లైన్‌లో వచ్చిన ఆర్టికల్‌లో ముఖ్యాంశాంలు ఏంటంటే.. 2019లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఇదే దిస్పనాయకేకు కేవలం 3.2 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ తాజాగా జరిగిన ఎన్నికల్లో మొదటి రౌండ్ కౌంటింగ్ ముగిసిన తర్వాత దిస్సనాయకే 42.31 శాతం ఓట్లతో ముందంజలో ఉన్నాడు. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే 50 శాతం ఓట్లు ఉండాలి. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించారు. అప్పడు దిస్సనాయకే 50 శాతం ఓట్లను దాటేశాడు. శ్రీలంక చరిత్రలో రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలిచి, అధ్యక్షుడైన మొదటి వ్యక్తి దిస్సనాయకేనే.
వాస్తవానికి దిస్సనాయక వచ్చిన అవకాశాలను తనకు అనుకూలంగా మలుచుకొని కేవలం ఐదేళ్లలోనే పాపులర్ నాయకుడు అయ్యాడు. 2019 కరోనా తర్వాత శ్రీలంకలో పరిస్థితులు తల్లక్రిందులయ్యాయి. దేశంలో టూరిజం దెబ్బదినడంతో పాటు అప్పటి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పరిస్థితులను సరిగా మేనేజ్ చేయలేక పోయాడు. దీంతో ఎంతో మంది ప్రజలు.. పేదలుగా మారిపోయారు. ఒక్కసారిగా గొటబాయ ప్రభుత్వంపై ప్రజలు కోపం పెంచుకున్నారు.
అప్పుడే జేవీపీ లీడర్ దిస్సనాయకే తనను తాను ప్రజల నాయకుడిగా చెప్పుకున్నాడు. వారి భాష మాట్లాడగలగడం.. వారితో కలిసిపోవడం.. ఆయనకు ఉన్న బలం. దీంతో వారి బాధలను దిస్సనాయకేతో షేర్ చేసకునేవాళ్లు. వారికి ఓదార్పు మాటలు చెప్పేవాడు దిస్సనాయకే. 2022లో దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు ప్రజాగ్రహం పెల్లుబికింది. ప్రజల్లోంచి వచ్చిన ఆగ్రహాన్ని దిస్సనాయకే ఆపడానికి ప్రయత్నించలేదు. అంతే కాకుండా ఆ ఉద్యమాన్ని నడిపించాలని కూడా అనుకోలేదు. కానీ ఆ ఉద్యమానికి కావల్సిన దిశానిర్దేశనం మాత్రం దిస్సనాయకే చేశాడు. 2022 నుంచి 2024 మధ్య ప్రజలను ఆకర్షించడంలో నిమగ్నమయ్యాడు. నేను బయటి వ్యక్తిని (రాజకీయాలకు).. నేను మీ జీవితాల్లో గొప్ప మార్పు తీసుకొని రాగలను అంటూ ఉపన్యాసాలు దంచికొట్టాడు.
అమెరికాలో ట్రంప్ ఎలాగైతే అవినీతిని అంతం చేస్తా (Drain the Swamp), ఇండియాలో మోడీ ఎలాగైతే నల్ల ధనాన్ని రూపుమాపుతా, పది లక్షలు పంచుతా అంటూ ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చారో.. అచ్చం అలాగే దిస్సనాయకే కూడా వాగ్దానాలు చేశాడు. అంతే కాదు.. ఆయన పీఆర్ స్టంట్లు కూడా అచ్చం మోడీలాగే ఉండేవట. తల్లిని ఆటోలో పోలింగ్ బూత్‌కు పంపడం.. తాను మాత్రం లగ్జరీ కార్లలో తిరగడం వంటి డ్రామాలు చేశాడట. దిస్సనాయకే తీరును ది యునైటెడ్ నేషనల్ పార్టీ కూడా ట్రోల్ చేసింది.
తాను రాజకీయ నాయకుడిని కాదని.. బయటి వాడినని చెప్పుకున్న దిస్సనాయకే.. వాస్తవానికి 2001లోనే ఎంపీ అయ్యాడు. 2004-05లో అప్పటి ప్రెసిడెంట్ చంద్రిక కుమారతుంగ కేబినెట్‌లో వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పని చేశాడు. కానీ అప్పట్లో లోప్రొఫైల్‌లో ఉండి.. పెద్దగా పాపులర్ కాలేదు. కానీ ఇప్పుడు తాను బయటి వాడినని.. నీతిమంతుడినని చెప్పుకొని ఓట్లు దండుకున్నాడు.
దిస్పనాయకేకు శ్రీలంకలోని ఏ తమిళ్ పార్టీ కూడా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే చంద్రిక కేబినెట్‌లో ఉన్న సమయంలో ఆయన తమిళ ఈలం (ఎల్టీటీఈ)తో కలిసి పని చేయాలని రూపొందించిన ఫార్ములాను వ్యతిరేకించాడు. అంతే కాదు.. సునామీ వచ్చి పోయిన తర్వాత.. ఘోరంగా దెబ్బతిన్న శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాల్లోని తమిళులకు సహాయం చేయడాన్ని వ్యతిరేకించాడు. ఇతను మొదటి నుంచి తమిళులు, ముస్లింలు, ఇతర మైనార్టీ వర్గాలకు పూర్తి వ్యతిరేకంగా పని చేశాడు.
1987లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం శ్రీలంకలో శాంతిని నెలకొల్పడానికి తమ వంతు సాయం చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. ఇతను మొదటి నుంచి ఇండియా వ్యతిరేకి. ముఖ్యంగా తమిళలు అంటే విపరీతమైన ద్వేషం నింపుకున్నాడు. అందుకే తమిళులు ఎక్కువగా ఉండే నార్త్‌లో, తమిళుల ప్రభావం ఉండే ఈస్ట్‌లో దిస్సనాయకేకు ఎక్కువ ఓట్లు పడలేదు. కేవలం సింహళ మెజార్టీ ప్రాంతాల్లోనే దిస్సనాయకేకు భారీగా ఓట్లు పడ్డాయి.
మరోవైపు ఇతను ప్రో చైనా ఐడియాలజీ కలిగి ఉన్నాడు. కాబట్టి.. లెఫ్ట్ ఐడియాలజీ ముసుగులో శ్రీలంక ప్రెసిడెంట్ అయిన సింహళీ చావనిస్ట్ విజయాన్ని నిజంగానే సెలబ్రెట్ చేసుకోకూడదు. PS: పాత పోస్టు డిలీట్ చేశాను….. ( #భాయ్‌జాన్ జాన్ కోరా)
Share this Article