చాలా ఇష్యూల్లో ఇతర మీడియా ధోరణుల గురించి చెప్పుకున్నట్టుగానే, ఈనాడు ప్రమాణాల ఉత్థానపతనాల గురించీ చెప్పుకుంటాం చాలాసార్లు… ప్రత్యేకించి తెలుగు భాషకు ఓ జికా వైరస్‌లాగా అంటించిన దాని అనువాద పైత్యం గురించి కూడా…!! కానీ ఈరోజు ఆ పత్రిక (ఇప్పటికీ పత్రిక అనొచ్చా అనే డౌటొచ్చింది తొలిసారి) ఫస్ట్ పేజీ హాశ్చర్యం వేసింది… దిగ్భ్రాంతి… ప్రమాణాల పతనం ఇంత వేగంగా ఉందా పత్రికలో అనిపించేలా…!! అది ఫస్ట్ పేజీ, ఫస్ట్ లీడ్, ఫస్ట్ ఫోటో…!! సీమను భారీ వర్షాలు కల్లోలపరుస్తున్నయ్ తెలుసుగా… ఎంత మంది గల్లంతయ్యారో కూడా ఎవరూ చెప్పలేని దుస్థితి… రోడ్లు తెగి, పట్టాలు కొట్టుకుపోయి, పశుసంపద ధ్వంసమై, ఇళ్లు కూలి, పంటచేలు దెబ్బతిని… కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని అనేక గ్రామాల్లో కలవరం నెలకొంది… కదిరిలో ఓ ఇల్లు కూలి ఆరుగురు మరణించారు, అందులో ఓ బాలిక… హృదయవిదారక నష్టాల్లో ఇదీ ఒకటి…
అయితే ఈ ఫోటో చాలా డిస్టర్బింగ్‌గా ఉంది… 1) శిథిలాల నడుమ విగతజీవిగా పడి ఉన్న తీరు 2) ఆ ఫోటోను ఎక్కడా బ్లర్ చేయకపోవడంతో, ఆ బాలిక శవం కడుపులో దేవుతున్నట్టుగా ఉంది… ఇక్కడ ఓ ప్రశ్న… శిథిలాల కింద నుంచి బయటికి తీస్తుంటే శవాలు రకరకాలుగా కనిపిస్తాయి… కాళ్లుచేతులు విరిగిపోయి, మొహాలు కొట్టుకుపోయి, బట్టలు పైకి లేచిపోయి, చిరిగిపోయి… వాటిని అలాగే ఫోటోలు తీసి అచ్చేస్తారా..? అది నైతికమేనా..? అది పాత్రికేయమేనా..? ఈ ఫోటోలో ఆ బాలిక నడుం కింద భాగం నుంచి పాదం వరకూ యథాతథంగా కనిపిస్తోంది బట్టల్లేకుండా… ఆ ఫోటోను అలాగే ఇక్కడ పబ్లిష్ చేయడానికి సిగ్గనిపించి, నేను కాస్త ఎరుపు రంగు పులమాల్సి వచ్చింది… ఇప్పుడు చెప్పండి… ఈ పేజీ బయటికి రావడానికి బాధ్యులైన ప్రతి ఒక్కరికీ ఓ ప్రశ్న… బుర్రలు పనిచేస్తున్నాయా..?
Ads
కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఓ ధోరణి జర్నలిస్టు సర్కిళ్లలో బహుళ ప్రచారంలోకి వచ్చింది… తెల్లవారే పత్రికను చేతుల్లోకి తీసుకున్న పాఠకుడిని ఫస్ట్ పేజీ గానీ, ఫోటోలు గానీ డిస్టర్బ్ చేసేలా ఉండకూడదు అనేది ఈ వాదన… నిజం కూడా… దానికి ఉదాహరణను కూడా చాన్నాళ్లుగా చెప్పుకుంటూనే ఉన్నాం… అమెరికాలో జంటటవర్లు ధ్వంసమై, మొత్తం కూలిపోయి అనేకమంది మరణించారు, వేలమందికి గాయాలు… బీభత్సం… అమెరికన్ మీడియా (టీవీ, ప్రింట్) ఒక్క డిస్టర్బింగ్ ఫోటోను, వీడియో బిట్‌ను పబ్లిష్ చేయలేదు, చూపించలేదు… అగ్నిప్రమాదాలు, భూకంపాలు, తుపాన్లు, ప్రమాదాలు, విషయం ఏదైతేనేం..? ప్రపంచవ్యాప్తంగా మీడియా దీన్ని పాటిస్తోంది… ఎటొచ్చీ ఇండియన్ మీడియాకే ఈ స్పిరిట్ అబ్బలేదు, ప్రత్యేకించి తెలుగు మీడియా ప్రమాణాల విషయంలో పాతాళస్థాయి… మన టీవీలు చూస్తేనే అందరికీ అర్థమవుతుంది కదా… దేశంలోని టాప్ టెన్ పత్రికల్లో ఒకటిగా చెప్పుకుని, పాత్రికేయ పాఠాలు-నీతులు బోలెడు చెప్పే ఈనాడుకు ఎందుకు ఈ సోయి లేదు..?!
Share this Article