Mutual Consent: చెప్పండి మేడం…మొదట మీరు ప్రపోజ్ చేశారా? సార్ ప్రపోజ్ చేశారా?
నేనే ప్రపోజ్ చేశాను. ఒక సాయంత్రం సార్ మంచి మూడ్ లో ఉన్నప్పుడు “ఫర్ సపోజ్ నేను నీకు విడాకులిస్తే నువ్ ఏం చేస్తావు?” అని డీసెంట్ గా, డిగ్నిఫైడ్ గా, కూల్ గా, ప్లెజెంట్ అట్మాస్ ఫియర్ లో ఫియర్ లేకుండా ప్రపోజ్ చేశాను.
సార్! అప్పుడు మీరు ఎలాంటి అనుభూతికి లోనయ్యారు?
భూతాన్ని ఎలా వదిలించుకోవాలా? అని దిగులు పడుతున్న వేళ…భూతమే వదిలేస్తాలే అని అభయమిచ్చిన అనుభూతితో ఉబ్బి తబ్బిబ్బులయ్యాను. గుండెలో కోటి వీణలు వాటంతటవే కదిలి మోగిన అనుభూతికి లోనయ్యాను. నెత్తిన కొండంత భారం దిగి తేలికపడిన అనుభూతికి లోనయ్యాను. ముక్కోటి దేవుళ్ళు నా మొర ఆలకించినట్లు అనుభూతి చెందాను.
Ads
ఎందుకు సార్? మేడం మిమ్మల్ను కొట్టేవారా? తిట్టేవారా?
లేదు నాయనా! పెళ్లయిన ఈ మూడేళ్లలో మేడం ఏనాడూ నన్ను కొట్టలేదు. తిట్టలేదు. నన్ను తాకనే లేదు. నా వైపు కన్నెత్తి చూడనే లేదు. తాళి కట్టిన తరువాత తొలిరాత్రికి ముందు పని ఉందని మా పనిమనిషికి చెప్పి వెళ్లిన మేడంను నేను మళ్లీ చూడ్డం ఇదే. ఆ తొలిరాత్రి రానే లేదనుకో… అది ఇక్కడ అనవసరం.
మేడం మీరు చెప్పండి. సార్ ఎందుకు మీకు నచ్చలేదు?
సార్ చాలా మంచివాడండి. అందువల్ల నాకు అస్సలు నచ్చలేదు. నేను సిగరెట్టు తాగితే సార్ యాష్ ట్రే పట్టుకు తిరుగుతాడు. నేను మందు తాగి వాంతి చేసుకుంటే సార్ క్లీన్ చేస్తాడు. నేను పబ్బులో గబ్బు పొడి పీల్చి స్పృహదప్పి పడితే సార్ కార్లో ఇంటికి తీసుకొస్తాడు. దాంతో మా ఇద్దరికీ పొత్తు కుదరదని మూడేళ్ల తరువాత నిర్ణయానికి వచ్చాము.
మరి మీ ఎంగేజ్మెంట్, పెళ్లి న భూతో- న భవిష్యతి అన్నట్లు జరిపారు?
అవును. ఇప్పుడు బ్రేకప్ పార్టీ కూడా అదే స్థాయిలో ఉంటుంది. శంకర్ పల్లి ఫార్మ్ హౌస్లో ఒక శని, ఆదివారం ధూమ్ ధామ్ గా జరుపుతున్నాం. తరువాత ఇటలీ మిలాన్ ద్వీపం రిసార్ట్ లో డెస్టినేషన్ బ్రేకప్ నాన్ బ్యాచిలర్స్, డైవోర్స్ అప్లైడ్ బట్ వెయిటింగ్ క్యూట్ కపుల్ పార్టీ ఉంటుంది. దానికి చార్టర్డ్ విమానాలు దొరకగానే డేట్ ఫిక్స్ చేసి… సోషల్ మీడియాలో ప్రకటిస్తాం.
సార్…మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి?
మేడం గ్రహణం వదలడమే ఒక శుభ సూచకం. నా పూర్వ జన్మ సుకృతం వల్ల మాకు పిల్లలు పుట్టలేదు. బతికి ఉంటే బలుసాకు తింటూ...శేష జీవితం గడిపేయాలని అనుకుంటున్నాను. మూడేళ్ళుగా నిద్రాహారాలకు మొహం వాచి ఉన్నాను. కనీసం మూడు నెలలు రాత్రిళ్ళు పడుకుని… పగలు సూర్యుడిని చూడాలనుకుంటున్నాను. ఇంకా ఇలాంటివే చాలా చాలా పెద్ద పెద్ద ప్రణాళికలు ఉన్నాయి.
మేడం…మీ ప్రణాళికలేమిటి?
నేను రెండేళ్లుగా వేరే అతడితో లివ్ -ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి మీకు తెలిసిందే. అయితే ఆయన వన్ ఇయర్ గా వేరే ఆమెతో లివ్-అవుట్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు. అది క్లారిటీ తీసుకోమన్నాను. ఆ క్లారిటీ వస్తే నాక్కూడా క్లారిటీ వస్తుంది. ఒకవేళ రాకపోయినా వితవుట్ క్లారిటీతో లివ్ ఇన్ అండ్ లివ్ అవుట్- ఆన్ అండ్ ఆఫ్- మ్యూచువల్లీ నాన్ కమిటల్ రిలేషన్ షిప్ లో ఉండాలని అనుకుంటున్నాం. ఇట్ డిపెండ్స్. యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు థింక్ టూ మచ్ అబౌట్ దీస్ సిల్లీ థింగ్స్. మై మేనేజర్ విల్ లుక్ ఇన్ టు ఆల్ దోస్ పెట్టీ ఇష్యూస్.
మేడం…మీ మేనేజర్ నంబర్, మెయిల్ ఐ డి ఇస్తారా?
ఇదిగోండి నంబర్. ప్రస్తుతం ఆయన బేగంపేట మహిళా పోలీసు స్టేషన్లో అరెస్ట్ అయి ఉన్నాడు. భార్యను బాటిల్ తో కొట్టాడట. పెట్టీ కేసే. మీరు ఫోన్ చేయండి. ఏది కావాలన్నా చెప్తాడు. ఏది కావాలన్నా చేస్తాడు. హీ ఈజ్ ఎ డిపెండబుల్ పర్సన్. ప్లీజ్ పర్డన్ మీ… హ్యావ్ టు క్యాచ్ గోవా ఫ్లయిట్… యూ కెన్ అస్క్ హిమ్. హీ ఈజ్ ఫ్రీ. హీ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. మోరోవర్ హీ స్పీక్స్ వెరీ గుడ్ టెల్గు. దో మై మదర్ ఈజ్ ఫ్రమ్ చీపురుపల్లి అండ్ మై ఫాదర్ ఈజ్ ఫ్రమ్ ఆముదాలవలస… యామ్ నాట్ కంఫర్టబుల్ విత్ టెల్గు…. బట్ ఐ లవ్ టెల్గు. ఐ యూజ్ టు సింగ్ అన్నమయ్య పద్యమ్స్ అండ్ వేమన కీర్తనాస్ ఇన్ మై చైల్డ్ హుడ్…
వద్దులేండి మేడం. పాపం. ఆయనకు ఇప్పుడే మోక్షం కలుగుతోంది. మళ్లీ మా ప్రశ్నల బంధనాలు ఎందుకు? మా ఇన్నేళ్ల కెరీర్లో ఇంత పారదర్శకంగా సుహృద్భావ వాతావరణంలో జరిగిన ప్రెస్ మీట్ ఇదే మేడం. ఈ జన్మకిది చాలు మేడం! చాలు!!
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article