నిమజ్జనాలు జరుగుతున్నాయి కదా… కీన్‌గా అబ్జర్వ్ చేస్తుంటే హాశ్చర్యం వేసిన ఓ విషయం ఉంది… నిమజ్జనం ఊరేగింపుల ముందు మగవాళ్లే గాకుండా ఆడవాళ్లు కూడా డీజే గ్రూప్ డాన్సులు చేసే తీరు… ఇందులో విస్తుపోవడానికి ఏముంది అనకండి…
అసలు ఇలాంటి చెత్తా పాటల్ని దేవుడి ఊరేగింపుల ముందు డీజేలో ప్లే చేయవచ్చా అనేది వేరే విషయం… ఆ చర్చ జోలికి పోవడం లేదిక్కడ… మాయదారి మైసమ్మో అనే పాట ప్రతి టెంపుల్ ముందు, ఊరేగింపుల ముందు వినిపిస్తుంది… అదేదో మైసమ్మను కొలిచే పాట అనుకుంటారు… అదే చోద్యం…
సరే, పిల్లల్ని వదిలేయండి… వాళ్లకు నిమజ్జనం ఓ ఉత్సవం, ఓ ఉత్సాహం… తోటి పిల్లలతో కలిసి స్టామినా ఉన్నంతవరకూ ఎగురుతారు… యువతనూ వదిలేద్దాం… స్టామినా ఎక్కువ కాబట్టి కాసేపు డాన్సులు అనబడే డీజే స్టెప్పులు వేస్తారు… వాళ్లకు ఓ తరహా సెలబ్రేషన్… కానీ 40 నుంచి 50 నడుమ ఉండే ఆడ లేడీస్, మగ జెంట్స్ సైతం అవే స్టెప్పులు…
Ads
స్టెప్పులు అంటే తోచినట్టు కాదు… ‘కుర్చీ మడతపెట్టి’ పాట నుంచి మొదలు పెట్టి ‘వోకే అని అంటిమా ఓయోకు రమ్మంటడు’, ‘డీజే టిల్లూ’ పాట మీదుగా మనకు అస్సలు అర్థం గాని భాంగ్రా పాటల దాకా… నడుమ నడుమ హిందీ పాపులర్ సాంగ్స్ డీజే వాడు ఎంత త్వరగా పల్లవులను స్విచోవర్ చేస్తున్నా సరే, ఆ పాటల కంటెంటుకు తగినట్టు వీళ్లు అలవోకగా స్టెప్పులు మార్చేస్తున్నారు…
రీల్స్, షార్ట్స్, షార్ట్ వీడియోలు, యూట్యూబ్ వీడియోలే కాదు… జనం మీద ఈ పాటలు ఎంత ప్రభావం చూపిస్తున్నాయో అంత సూక్ష్మంగా, నాలుగు వాక్యాల్లో చెప్పొచ్చేట్టు లేదు… స్టెప్పులు అలవాటు లేని నడివయస్సు మహిళలు కూడా ఆ కంటెంటుకు తగినట్టు స్టెప్పులు వేయడం, గ్రూపుగా ఎగరడం ఆశ్చర్యం…
ష్… నిజానికి మగవాళ్ల స్టెప్పులోనే ఏ వైవిధ్యమూ ఉండదు… రొడ్డ కొట్టుడు, ఊకదంపుడు స్టెప్పులు… ఒకే టైపు… కొన్ని ఏరియాల్లో భంగు కలిపిన పాన్లు లేదా పానీయం… ఇక చూసుకో, విపరీతమైన స్టామినా కనిపిస్తుంది వాళ్లలో… కాలనీల్లో చవితి ఉత్సవాలు ఓ సోదరభావాన్ని, పరిచయాల్ని, కలిసి పనిచేయడాన్ని పెంచుతాయి… వ్యక్తుల ఆర్గనైజింగ్ సామర్థ్యాలను కూడా పదును పెడతాయి… అదొక పాజిటివిటీ… కానీ..?
చవితి ఉత్సవాల్ని బోలెడు మంది నిర్వహిస్తారు… విగ్రహం పెట్టేయడం, చందాలు వసూలు చేయడం, రోజు పూజలు, తరువాత నిమజ్జనాలు… కానీ కొన్ని కాలనీల్లో… ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తారు… ప్రతి ఇంటి ముందుకు తీసుకుపోతారు… హారతులు, కొబ్బరికాయలు, పల్లకీల ఎదుట బిందెలతో సాక పోయడం… పక్కా ఆధ్యాత్మిక ధోరణి… ప్రతి ఇంటికీ భక్తిభావనను చేరవేయడం… ఇక ఉట్లు కొట్టడం, రకరకాల పోటీలు, ప్రైజులు, అన్నదానాలు అదనం…
చెత్తా పాటలకు ప్రాధాన్యం, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు, ఓ రాత్రి దాకా డీజే మోతలు… నిజానికి ఏ డీజే పాట తీసుకున్నా ఒకే టైపు, తీన్మార్ తరహాలో హార్ట్ బీటు పెంచే ఒకే తరహా బీట్… మధ్యమధ్య ఆ డీజే క్రియేటర్ల పేర్లతో కేకలు… ఇవి మాత్రమే చిరాకు పుట్టించినా… మిగతా అంశాల్లో వోకే..! సోకాల్డ్ అభ్యుదయవాదులకు నచ్చకపోయినా సరే, అర్థం గాకపోయినా సరే…!!
Share this Article