ఒకప్పుడు దేవుడు లేడు- ఇప్పుడు దేవుడే దిక్కు! డిఎంకె భక్తి మార్గం!
దేవుడి దయ వల్ల నాస్తిక సంఘం మహాసభలు దిగ్విజయంగా జరిగాయి- అన్నట్లుంది తమిళనాడులో డిఎంకె ఎన్నికల ప్రచార సారాంశం. అన్నాదురై, పెరియార్ ఈ.వి. రామస్వామి సిద్ధాంతాలతో దాదాపు ఏడు దశాబ్దాలుగా వెలుగుతున్న ద్రవిడ మున్నేట్ర కజగ గజానికి అర్ధశతాబ్దం కరుణానిధి ఒక్కడే దిక్కు మొక్కు. ఆయన తరువాత ఇప్పుడు స్టాలిన్ ఆ పార్టీ అధినేత. కాబోయే ముఖ్యమంత్రి. నాస్తికత్వానికి డి ఎం కె ఒకప్పుడు పెట్టింది పేరు. నిజానికి వృద్ధాప్యం మీద పడి చక్రాల కుర్చీకే పరిమితమయ్యాక కరుణానిధి కూడా నాస్తికత్వం వదిలి కొంత ఆధ్యాత్మికత వైపు మళ్లినట్లు అనిపిస్తుంది. పుట్టపర్తి సత్యసాయిబాబాను ఇంటికి పిలిచి ఆదరించిననాటికి కరుణానిధి మామూలుగా అందరిలా నడుస్తూనే ఉన్నాడు. అప్పటికే ఆయన నాస్తికత్వం సన్నగిల్లినట్లు అనుకోవచ్చు. ఆ తరువాత సత్యసాయి జీవిత విశేషాల మీద రూపొందిన ఒక తమిళ సీరియల్ కు కరుణానిధి స్వయంగా మాటలు రాశాడు. అందులో భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు సామాన్యులకు అర్థమయ్యేలా ఆయన రాసిన మాటలు అసాధారణం. నిజానికి మాటల రచయితగా కరుణానిధి కలానికి తిరుగు లేదు.
Ads
తమిళనాడులో డిఎంకె లాంటి పార్టీలు యాభై ఏళ్లపాటు నాస్తికత్వాన్ని ఎంతగా ప్రమోట్ చేసినా- శివ, సుబ్రహ్మణ్య, వైష్ణవ భక్తిలో, భక్తి సాహిత్యంలో తమిళనాడు హిమాలయమంత ఎత్తులో ఉంటుంది. మధుర మీనాక్షి, కంచి కామాక్షి, అరుణాచలం, పళని, తిరుచందూరు , చిదంబరం, కుంభకోణం, తిరువారూర్, తిరువాయూర్, వైదీశ్వరన్ కోవెల్, తంజావూర్, శ్రీరంగం, రామేశ్వరం…ఇలా ప్రతి ఊరూ ఒక క్షేత్రమే. ప్రతి కాలువా ఒక తీర్థమే. తిరుప్పావులు, పాశురాలు, నాయనారుల బోధలు, స్కంధ షష్ఠి కవచాలు…తమిళం తెలియకపోయినా ఇతరభాషల వారు కూడా భక్తి పరవశంతో గానం చేస్తున్నారు. సంప్రదాయ సంగీత సరస్వతి తమిళనాట శాశ్వత నివాసం ఏర్పరుచుకోవడంతో మిగతా ప్రాంతాలకు ఆ సంగీతం రావాల్సినంత రాలేదు. దీనికి తమిళులను మనం అభినందించాలే తప్ప- అసూయపడి ప్రయోజనం లేదు.
తమిళనాడు ఎన్నికల్లో డిఎంకె నాస్తికత్వానికి టాటా చెప్పి- ఆస్తికత్వాన్ని అక్కున చేర్చుకుంది అన్నది వార్త. ఇది రాత్రికి రాత్రి జరిగిన పరిణామం కాదు. పదిహేనేళ్లుగా లిబరల్ హిందూ వైఖరి తీసుకుని, ఇప్పుడు పూర్తిగా హిందూ ముద్రలు ధరించింది. స్టాలిన్ భక్తి ప్రవచనాలతో తమిళనాడు ఎన్నికల ప్రచారంలో దేవుళ్లు పులకించిపోతున్నారు. తన భార్య రోజూ ఏయే దేవుళ్లకు పూజలు చేస్తుందో? ప్రతి వారం ఏయే గుళ్లకు వెళుతుందో? స్టాలిన్ సాక్ష్యాధారాలతోపాటు ఓటర్లకు వివరిస్తున్నాడు. తాము అధికారంలోకి రాగానే తమిళనాడు ఆలయాలను, పుణ్యక్షేత్రాలను ఎలా అభివృద్ధి చేస్తామో వివరిస్తూ ఎన్నికల ప్రణాళికలో పేజీలకు పేజీల హామీలు కూడా ఇచ్చాడు.
ఇప్పుడు కొన్ని సామెతలను గుర్తు చేసుకుందాం.
ఈశ్వరుడు ఇవ్వాలి- ఇల్లు నిండాలి.
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి.
దిక్కులేనివారికి దేవుడే దిక్కు.
దేవర చిత్తం – దాసుడి భాగ్యం.
దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
దేవుడు తలిస్తే సంపదలకు కొదవా?
దేవుని పెండ్లికి అందరూ పెద్దలే
… కాబట్టి ఒక్కప్పుడు దేవుళ్లను తిరస్కరించి, ఇప్పుడు నెత్తిన పెట్టుకుంటున్న డిఎంకె పార్టీని, తమిళనాడును ఆ దేవదేవుడు తన అపార కృపా కరుణా కటాక్ష వీక్షణాలతో చల్లగా చూడుగాక!
లోకాస్సమస్తా సుఖినో భవంతు!…………………….. By…… -పమిడికాల్వ మధుసూదన్
Share this Article