మన సినిమా హీరోలు నడుములు వంగిపోయినా, వీపులకు బద్దలు కట్టుకుని స్టెప్పులు వేస్తుంటారు… వెండితెరకు వేలాడుతూ ఉంటారు… మన నాయకులు మరీ ఘోరం… ఆయుష్షు ఉన్నంత కాలం “సేవ” చేస్తుంటారు… మధ్యలో రిటైర్డ్ అని చెప్పుకున్నా సరే… ఇక నా బతుకంతా సినిమా స్టెప్పులకే అంకితం అన్నట్టుగా వ్యవహరిస్తున్నా సరే… తాజాగా ‘‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ రాజకీయం దూరం కాలేదు’’ అంటూ మార్మిక సంభాషణల్ని తాజా సినిమాల్లో జొప్పించి, మళ్లీ వచ్చేస్తాను సుమా అని హెచ్చరికలు జారీ చేస్తుంటారు… డెబ్భయేళ్ల ఒకావిడ ఖమ్మంలో పార్లమెంటు రాజకీయాల్ని వదిలేసి, గుడివాడలో అసెంబ్లీ సమరానికి సై అంటూ రాష్ట్రాలే జంప్ అయిపోతుంటుంది…
అంతెందుకు..? వయస్సు మీదపడిన గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ… పంజాబ్ మాజీ సీఎం అమరేందర్‌సింగ్ పార్టీ బీజేపీలో విలీనం… శంకర్‌సిన్హ్ వాఘేలా కొత్త పార్టీ… ఇక లెఫ్ట్ పార్టీల కీలక పదవుల్లోనైతే మొత్తం వేడి చల్లారిన ముసలి నెత్తురే కదా… వీళ్లే కాదు… అన్నిరంగాల్లోనూ అంతే… బడా బడా క్రికెటర్లు కూడా అంతే కదా… జట్టుకు గబ్బిలాలు…
తెలుగు రాష్ట్రాల్లో రిటైరైన ముసలోళ్లు సలహాదారులుగా ఏళ్ల తరబడీ ఉద్దరిస్తుంటారు… ఏపీ అయితే మరీ అరాచకం… ప్రభువుల వారి చల్లనిచూపు పడిందంటే చాలు, సలహాదారులుగా ఆసీనులవుతారు… ఈ ట్రెండులో ఓ రాజకీయ నాయకురాలు క్రియాశీల రాజకీయాల నుంచి స్వచ్చంద పదవీవిరమణ తీసుకుందనే వార్త, ఫోటో ఆసక్తికరంగా కనిపించాయి…
Ads
ఆమె పేరు సుబ్బులక్ష్మి, భర్త పేరు జగదీశన్… వయస్సు 75… ఆఫ్టరాల్ 75 మాత్రమే కదా… రాజకీయాల్లో అది చురుకైన వయస్సే కదా… స్వాతంత్య్రానికి రెండు నెలల ముందు పుట్టింది… డీఎంకే నాయకురాలు… 1977లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచింది… కేంద్ర మంత్రిగా చేసింది… రాష్ట్రమంత్రిగా చేసింది… ఐననూ స్టాలిన్ తనను రాజ్యసభకు పంపిస్తాడని ఈమధ్య ఆశించింది… జరగలేదు… ఇక ఆశలన్నీ అడుగంటాయి… దాంతో ఇక చాల్లే అనుకుని క్రియాశీల రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్టుగా స్టాలిన్‌నే కలిసి పార్టీ పదవులకు రాజీనామా లేఖను చేతిలో పెట్టి వచ్చింది…
అబ్బే, ఇది పదవి దక్కని తాత్కాలిక వైరాగ్యం… మళ్లీ రేప్పొద్దున నాలుగు రోజులకు చిరంజీవి తరహాలో… ‘‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు’’ అంటూ తెరపైకి వచ్చినా ఆశ్చర్యం లేదు… ఎందుకంటే..? పదవులేమీ దక్కని నిరాశలో ఆమె భర్త కొంతకాలంగా సోషల్ మీడియాలో డీఎంకే ధోరణుల మీద విమర్శల్ని ఎక్కుపెడుతున్నాడు… కొంతకాలం అన్నాడీఎంకేలో కూడా ఉన్నట్టుంది… ఇప్పుడు ఆ పార్టీ స్థితి బాగాలేదు… మరి బీజేపీ ఎందుకు ఆహ్వానించలేదో తెలియదు… బహుశా 75 దాటాను కదా, తనను కూడా అద్వానీ తదితరుల్లాగా మేధోమథన సెల్‌లో పారేస్తారు అని భయపడిందేమో… వెరసి, తన 45 ఏళ్ల సుదీర్ఘ క్రియాశీల రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించింది..!!
Share this Article