‘‘ఎవరైనా స్త్రీని 14 సెకండ్లపాటు అలాగే తదేకంగా చూస్తుండిపోతే జైలుశిక్ష ఖాయం’’…. గత ఏప్రిల్‌లో, ఇన్‌స్టాగ్రాంలో తెగ వైరల్ అయిపోయిన ఓ రీల్ పోస్ట్ సారాంశం ఇది… ఎందుకయ్యా అంటే ఐపీసీ 354 -డి సెక్షన్ అదే చెబుతోంది అనేది పోస్టు వివరణ… నవ్వొచ్చిందా మీకు..? ఈ 14 సెకండ్లు అనే కాలవ్యవధికి ప్రాతిపదిక ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు, చాలామంది ఆ పోస్టును ట్రోల్ చేశారు… కానీ 14 సెకండ్లు అనే ప్రస్తావన హాస్యాస్పదమే అయినా సరే, కేసు మాత్రం పెట్టొచ్చు… ఎందుకంటే..? సదరు సెక్షన్ ప్రకారం… స్టాకింగ్… అంటే వెంబడించడం నేరమే… ఒక మహిళను ఫాలో కావడం, ఆమె ఇష్టానికి విరుద్ధంగా పదే పదే కలవడానికి ప్రయత్నించడం, నెట్ ద్వారా, ఇతర కమ్యూనికేషన్ల ద్వారా సతాయించడం నేరంగా పరిగణించబడుతుంది… సరిగ్గా బుక్ చేయాలేగానీ కోర్టులో మొదటిసారి తప్పుకు మూడేళ్లు, రిపీట్ చేస్తే అయిదేళ్ల వరకూ జైలుపాలు చేయవచ్చు… ఇప్పుడిది మళ్లీ చర్చలోకి ఎందుకు వచ్చిందంటే..?
ఈమెను గుర్తుపట్టగలరా..? పార్వతి తిరువొత్తు కొట్టువట్ట అలియాస్ పార్వతి… మలయాళ నటి… అప్పుడప్పుడు తమిళం, కన్నడంలో కూడా నటిస్తుంది… 2006 నుంచి ఫీల్డులో ఉన్నా సరే, ఇంకా మనవాళ్ల కన్ను పడనట్టుంది… ఆమెలో ఫైర్ భయపెట్టి ఉంటుంది బహుశా… ఆమెలో మెరిట్ ఉంది, బాగా పాపులారిటీ కూడా వచ్చింది… ఆమె ఖాతాలో మంచి హిట్లు పడ్డయ్ కొన్ని… ఎంత పెద్ద హీరోలైనా సరే స్త్రీద్వేష డైలాగుల్ని ఎంకరేజ్ చేయకూడదని మొదట గొంతెత్తిన వాళ్లలో ఈమె కూడా ఉంది… ఉదాహరణగా కసబ మూవీలో మమ్ముట్టి డైలాగుల్ని ఉదహరించింది కూడా… దాంతో ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేశారామెను… వేధించారు… టాప్ హీరోల ఫ్యానిజం ఎలా ఉంటుందో తెలిసిందే కదా… ఆమె ఫిర్యాదు మేరకు ఇద్దరు మమ్ముట్టి ఫ్యాన్స్‌ను పోలీసులు అరెస్టు కూడా చేశారు… మలయాళ ఇండస్ట్రీలో స్త్రీల సమస్యలపై పోరాడే Women in Cinema Collective వ్యవస్థాపక సభ్యురాలు ఆమె… అర్జున్‌రెడ్డి, కబీర్‌సింగ్ సినిమాలను కూడా కడిగేసిందామె… ఎప్పుడూ ఏదో అంశం మీద పత్రికల్లో కనిపిస్తూనే ఉంటుంది… ఇదీ ఆమె నేపథ్యం…
Ads
ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే… కొచ్చి, కొజిక్కోడ్లలోని ఆమె ఇళ్లకు తరచూ ఓ ముప్ఫయ్యేళ్లు దాటిన వ్యక్తి వస్తున్నాడు… తనది కొల్లం… నేరుగా ఫుడ్ పార్శిళ్లు తీసుకొని వస్తున్నాడు… కలిస్తే ప్రేమగా ఆమెకు బిర్యానీ తినిపించాలనుకున్నాడేమో… అరేయ్, ఇక్కడి నుంచి వెళ్లిపోరా భయ్ అని సెక్యూరిటీ వాళ్లు తరిమేస్తున్నా వినడం లేదు… ఆమె ఫోన్ నంబర్ ఎలా పట్టాడో తెలియదు గానీ చాలాకాలంగా ఫోన్లలో మెసేజులు పెట్టేవాడు… ఎర్నాకుళంలోని ఆమె ఫ్లాట్‌కూ వెళ్లాడు… ఇక లాభం లేదని ఆమె పోలీసులకు కంప్లయింట్ చేసింది… మరదు పోలీసులు కేసు బుక్ చేశారు… అదే 354-డీ సెక్షన్… రెండేళ్ల క్రితం కిషోర్ అనే ఓ లాయర్ కమ్ ఫిలిమ్ మేకర్ కూడా ఇలాగే ‘వెంబడించి వేధిస్తే’ కేసు పెట్టింది… ఆమెకు ఇవేమీ కొత్త కాదు, ఊరుకోదు… అకారణంగా వెంటబడి, వేధించే మగ పురుష్లను బుక్ చేసే వీలు చట్టంలో ఉంది సుమా అని మహిళలకు, సెలబ్రిటీలకు చెప్పడమే ఈ కథనం ఉద్దేశం అంటారా..? అంతేగా మరి…!!
Share this Article