మొన్నటి నుంచి ఓ పాజిటివ్ స్టోరీ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది… కొన్ని తమిళ పత్రికల్లో, టీవీల్లో కూడా… తమిళనాడులోని తిరుత్తురైపూండీ అనే నియోజకవర్గం నుంచి ఓ కోటీశ్వరుడైనా అన్నాడీఎంకే అభ్యర్థి సురేష్కుమార్పై మారిముత్తు అనే నిరుపేద సీపీఐ అభ్యర్థి సాధించిన విజయం గురించిన పోస్టు అది… ఒక గుడిసె, ఆ గుడిసె ముందు మారిముత్తు ఫోటో… బాగా వైరల్ అవుతోంది… బెంగాల్లో ఓ పనిమనిషి గెలుపు మీద కూడా ఇలాగే చెప్పుకున్నాం కదా… ఈ నిరుపేదలు కూడా చట్టసభల్లోకి వెళ్లే అవకాశం రావడం మన ప్రజాస్వామిక స్పూర్తికి తార్కాణం అని కూడా చప్పట్లు కొడుతున్నాం కదా… అయితే ఈ మారిముత్తు స్టోరీ చదువుతుంటే ఓ వాక్యం దగ్గర చూపు, కర్సర్, ఆలోచన స్తంభించాయి… అదేమిటంటే..? వాళ్లింట్లో ఇప్పటికీ కట్టెల పొయ్యి వాడుతుంటారు, గ్యాస్ రీఫిల్ కొనడానికి డబ్బుల్లేవు కాబట్టి అనేది ఆ వాక్యసారాంశం…
చూశారు కదా, ఆకులు-కొమ్మలతో కప్పిన గుడిసె పైకప్పు, అదీ వర్షపునీటిని ఆపడం లేదు కాబట్టి కొంత భాగానికి ప్లాస్టిక్ షీటు… అదే తన ఆస్తి… ఎక్కడెక్కడో జనం సమస్యల మీద, పార్టీ పనుల మీద తిరిగి, ఎప్పుడో ఇల్లు చేరితే తలదాచుకునేందుకు ఉన్న షెల్టర్ ఇదే… ఇది కడువకుడి గ్రామంలో ఉంది… రాజకీయాల్లో ఉండి, నిజాయితీగా జనం కోసం పనిచేస్తూ, నిరుపేదలుగానే ఉండిపోయిన లీడర్లు చాలామంది ఉన్నారు… ఫ్యూడల్, కుటుంబ, అవినీతి పార్టీల్లోని లీడర్ల సంగతి, వాళ్ల వ్యక్తిత్వాల సంగతి పక్కన పెడితే… లెఫ్ట్, రైట్ పార్టీల్లో చాలామంది సిన్సియర్లు కనిపిస్తారు… లెఫ్ట్ పార్టీల్లో ఎన్నికల్లో నిలబడటాన్ని కూడా పార్టీ పనిగానే పరిగణిస్తారు, పార్టీ ఫుల్ టైమర్లయితే పార్టీ ఇచ్చే అరకొర మెయింటెనెన్స్తోనే సర్దుకోవాలి… (అఫ్ కోర్స్, ఈమధ్య కొందరు లీడర్లు ఫ్యూడల్ పార్టీలకు దీటుగా కథలుపడుతున్నారు, అది వేరే సంగతి)…
Ads
విషయం ఏమిటంటే..? గత 28 ఏళ్లుగా మారిముత్తు పార్టీలో ఉన్నాడు, లోకల్ కొత్తూరు యూనిట్‌కు కార్యదర్శి తను… 1970 నుంచీ తిరువూరు జిల్లాలోని ఈ నియోజకవర్గం సీపీఐకి బలమైన స్థానం… మరీ ఆ శాఖ కార్యదర్శి కనీసం గ్యాస్ రీఫిల్ కూడా కొనే స్థితి లేకపోతే ఎలా..? ఇంకాస్త కంఫర్టబుల్ పొజిషన్లో ఉంచాల్సింది అతన్ని…!! తనెంత మంచి వాడంటే..? రెండుమూడేళ్ల క్రితం గాజా తుఫాన్, భారీ వరదలకు చాలామంది గుడిసెలు కూలిపోయాయి… అందులో మారిముత్తు కొంప కూడా కొట్టుకుపోయింది… ఒక ఎన్జీవో తలా 50 వేల సాయం చేయడానికి ముందుకొచ్చింది… కానీ ఒకాయనకు సొంత పట్టా లేక, తన పేరిట ‘ఇల్లు’ లేకపోవడం వల్ల సాయం దక్కలేదు… మన మారిముత్తు తనకొచ్చిన సాయాన్ని కూడా ఆ పేదకిచ్చేశాడు… అందరూ పేదలే, చాలామంది కౌలు రైతులు, కూలీలు… వాళ్లల్లో నేనూ ఒకడిని అనుకున్నాడు… తన గుడిసె రిపేరుకు మాత్రం జేబులో రూపాయి ఉండదు… ఐనాసరే, పార్టీ ఆదేశించే ప్రతి ఆందోళనల్లో ముందుంటాడు… జనంలో ఉంటాడు…
ఈయన ఏవేవో పార్టీ పనుల మీద తిరుగుతాడు… భార్య జయసుధ, తల్లి కూలీ పనులకు వెళ్తారు… చూశారుగా ఫోటో… మట్టి పొయ్యి, రెండు ప్లాస్టిక్ బిందెలు… మరో పక్క కూలిపోతున్న గోడ… ఎన్నికల అఫిడవిట్ ప్రకారం… మారిముత్తు ఆస్తులేమిటయ్యా అంటే… భార్య జయసుధ పేరిట 75 సెంట్ల భూమి, బ్యాంకులో కొంత సొమ్ము, 3 గ్రాముల బంగారం… మరి మారిముత్తు ప్రత్యర్థి ఎవరో తెలుసా..? సురేష్‌కుమార్… ఒక లాయర్, తండ్రి ఓ రిటైర్డ్ జడ్జి… తల్లి ఓ టీచర్… భార్య హిందూ ధార్మికసంస్థల జాయింట్ కమిషనర్… దాదాపు 20 కోట్ల దాకా ఆస్తి ఉన్నట్టు అంచనా… ఫుల్ పలుకుబడి, సర్కిల్… అధికార పార్టీ సపోర్ట్… అడగ్గానే టికెట్టు… అయితే డీఎంకే లేదంటే అన్నాడీఎంకే… రెండు పార్టీలకూ కావల్సినవాడే… ఆ బలమైన కొండను ఢీకొని మారిముత్తు విజయం సాధించాడు… (డీఎంకే కూటమి తరఫున…) ఇక చివరగా…. 1971 నుంచీ సీపీఐ అక్కడ బలంగా ఉంది కదా… అనేక ప్రభుత్వ పథకాలు ప్రవేశపెడుతూనే ఉన్నారు కదా… అక్కడ పేదల్ని వాటిల్లో చేర్పించడానికి, వాళ్ల జీవనప్రమాణాలను పెంచడానికి సాగిన కృషి ఏమిటి..? సాక్షాత్తూ ఓ పార్టీ యూనిట్ కార్యదర్శి, ఇప్పుడు ఎమ్మెల్యే జీవితమే ఇలా ఉంటే, మరి అక్కడ పేదలు, పార్టీ కార్యకర్తల జీవన ప్రమాణాల రేంజ్ ఏమిటి..? పోరాటాల ప్రాధాన్యం ఏమిటి..? తనను చూడటానికి వస్తూపోయే మారిముత్తు సోదరి 500, 1000 బ్రదర్ జేబులో పెట్టి పోతుంది ఇప్పటికీ… అర్థమైంది కదా… పార్టీ కేడర్ నిర్వహణలో ఏదో తేడా కొడుతున్నట్టు…!!
Share this Article