అబ్దుల్ కలాం ఎక్కడికి వెళ్లినా విద్యార్థులతో మాట్లాడేవాడు. కారణజన్ముడు కాబట్టి అలా విద్యార్థులతో మాట్లాడుతూ అదే వేదికమీద నిత్య విద్యార్థిగా సాగిన దేహయాత్రకు గొప్ప ముగింపు పలికాడు. నాయకుడికి ఉండాల్సిన లక్షణాల గురించి ఆయన తరచుగా తన అనుభవంలోనుండి ఒక గొప్ప సందర్భాన్ని ఉదహరించేవాడు. సతీష్ ధావన్ జగమెరిగిన అంతరిక్ష శాస్త్రవేత్త. ఆయన పేరే శ్రీహరికోటలో అంతరిక్ష కేంద్రానికి పెట్టారు. ధావన్ నేతృత్వంలో ఒక రాకెట్ తయారీకి శాస్త్రవేత్తలు వందలమంది అహోరాత్రాలు కష్టపడ్డారు. తీరా ఆ రాకెట్ ను ప్రయోగిస్తే తుస్సుమంది. బృందానికి ధైర్యం చెప్పి, ఆ వైఫల్యానికి తనదే బాధ్యత అని ధావన్ బహిరంగంగా ప్రకటించాడు. ఆయన నేతృత్వంలోనే అదే బృందం కొన్నాళ్లకు మళ్లీ శ్రమించి రాకెట్ ను తయారు చేసింది. ఈసారి ప్రయోగం విజయవంతమయ్యింది. బృందంలో ఉన్న అబ్దుల్ కలామ్ ను పిలిచి, మీడియాకు వివరాలు మీరు ప్రకటించండి- అని ధావన్ తెరవెనుక ఉండిపోయాడు. ఇదీ అబ్దుల్ కలాం చెప్పే స్ఫూర్తిదాయక నాయకత్వ లక్షణం. బహుశా యూ ట్యూబ్ లో ఉండే ఉంటుంది. కలాం మాటల్లోనే వింటే ఇది మరింతగా మనసుకు హత్తుకుంటుంది. అపజయాన్ని తాను తీసుకుని, జయాన్ని బృందానికి ఇచ్చినవాడే గొప్ప నాయకుడవుతాడు. ఆ బృందానికి దారి దీపమవుతాడు.
———————–
ఇప్పుడు అబ్దుల్ కలాం చెప్పిన ధావన్ నాయకత్వానికి రివర్స్ లో జరిగే కథనాల్లోకి వెళదాం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన కరోనా వ్యాక్సిన్ వచ్చింది. ఆ వ్యాక్సిన్ సూది పొడిచే చోట తమ పార్టీ నాయకుడి ఫోటో ఎందుకు లేదు? అని ఒక పార్టీ నాయకులు- ఎందుకు ఉండాలి? అని మరో పార్టీ నాయకులు సుహృద్భావ వాతావరణంలో వాదులాడుకున్నారు. తిట్టుకున్నారు. చక్కగా పరస్పరం జుట్లు పట్టుకున్నారు. కొట్టుకుని కూడా ఉండవచ్చు. గాయాలతో ఎవరూ ఆసుపత్రిపాలు కాలేదు. అప్పటికే కట్టి ఉన్న ఫ్లెక్సీలను చించేశారు. వ్యాక్సిన్ చుక్కల్లో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల నిష్పత్తి లెక్కలు తేలాలని డిమాండు చేశారు.
Ads
వెనకటికి అమ్మమ్మలు, నానమ్మలు చంకలో పసిబిడ్డలను ఎత్తుకుని చందమామను చూపిస్తూ…
ఇది చందమామ ముద్ద!
ఇది అమ్మ ముద్ద!
ఇది నాన్న ముద్ద!
ఇది నా ముద్ద!
అని గోరు ముద్దలు తినిపించేవారు. పసిపిల్లలు నిజమనుకుని ఒక్కో ముద్ద తినేవారు. దాంతో తిన్నది ప్రేమామృతమయ్యేది. ఇప్పటి పిల్లలు నమ్మరు. నమ్మినా వారు తినే బర్గర్ పిజ్జా మైదా పాకం ముక్క పీకి నోట్లో పెట్టేలోపు అమ్మమ్మ నానమ్మల పై ప్రాణాలు పైనే పోతాయి.
అలా-
ఇది ప్రధాని చుక్క!
ఇది ముఖ్యమంత్రి చుక్క!
ఇది ఎంపి నీడిల్!
ఇది ఎమ్మెల్యే పొడుపు!
ఇది మేయర్ దూది!
ఇది కౌన్సిలర్ కుర్చీ!
అని కొసరి కొసరి గోరు వ్యాక్సిన్లు వేయవచ్చు.
————————
చేసిన మేలు కాల పరీక్షలో దానికదిగా అంకురించి, మొగ్గతొడిగి, కాయలు కాచి, పండాలి. ప్రతిఫలం రాకపోయినా సేవ సేవగా మిగిలిపోవాలి. మనిషిగా పుట్టినందుకు తీరని రుణమేదో తీర్చుకోవడానికి సేవచేయాలి. చేతనయిన సాయం చేయాలి. ఫ్లెక్సీలు చూసినా, చూడకపోయినా మానవత్వం తొంగి చూడాలి. మనసులు గెలవాలి. మమతలు మిగలాలి. … మహమ్మారి కరోనాలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ- ఎప్పటికీ మిగిలి ఉండేది రాజకీయమే. శవాన్ని ఎత్తడం కూడా ప్రచారానికి పనికొచ్చే శవరాజకీయమే. ఫ్లెక్సీ లీడర్స్! వింటారా? కలాం చెప్పే ధావన్ కథ!…….. By… -పమిడికాల్వ మధుసూదన్
Share this Article