మైలవరపు కృష్ణతేజ… ఐఏఎస్… ఇది నాలుగేళ్ల క్రితం వార్త… ఒక్కసారిగా ఆయన పేరు దేశమంతటా… కాదు, ప్రపంచ స్థాయి సంస్థలు సైతం అభినందనలు చెప్పేంతగా మారుమోగిపోయింది… ఎవరీయన..? ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడే… కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్… స్వస్థలం చిలకలూరిపేట… నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీ (NEC) గుంటూరులో బీటెక్ పూర్తి చేసాడు… 2009లో… తరువాత ఐఏఎస్ మీద కన్నుపడింది… అప్పటికే సోదరుడు నరేంద్రనాథ్ ఐఎఫ్ఎస్ అధికారి, కానీ సివిల్స్ అంత ఈజీ టాస్క్ కాదు కదా… చాలా ఫోకస్‌డ్‌గా చదవాలి… చదువుకు డెడికేట్ అయిపోవాలి కొన్నాళ్లు… లక్ కూడా కలిసిరావాలి…
ఆర్సీరెడ్డి ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో లెక్చరర్‌గా చేరాడు… అందులోనే స్ట్రెస్ తగ్గించుకోవడం, ఆత్మవిశ్వాసం పెంచుకోవడం, కరెంటు టాపిక్స్ అప్‌డేట్ చేసుకోవడం తదితరాంశాల్లో కాన్సంట్రేట్ చేసేవాడు… ఒకటి… పోయింది… రెండు… రాలేదు… మూడు… అదీ ఫెయిలే… నాలుగు… యూపీఎస్సీ తలవంచింది… కృష్ణతేజ పక్కన ఐఏఎస్ వచ్చి చేరింది… వేల మంది ఐఏఎస్ అధికారులున్నారు… మరీ ఇప్పుడైతే ఐఏఎస్ అధికార్లు అంటేనే జనం ఏవగించుకునే పరిస్థితి… అంతగా భ్రష్టుపట్టించారు… మరి కృష్ణతేజ ఎందుకు హైలైట్ అయ్యాడు…?
2018… ఆగస్టు… దక్షిణ రాష్ట్రాల్లో అనేకచోట్ల కుంభవృష్టి… ప్రత్యేకించి కేరళలోని వరద ప్రాంతాల్లో బిక్కుబిక్కుమంటున్నాయి… కృష్ణతేజ అలప్పుజ సబ్ కలెక్టర్… పరిస్థితి చూడబోతే భీకరంగా ఉంది, రేపు ఏమిటో, ఎల్లుండి ఏమిటో అంచనా వేయడం దుర్లభంగా ఉంది… ప్రకృతి విపత్తులకు సంబంధించి అధికార యంత్రాంగం సన్నద్ధత, అప్రమత్తతే ప్రజల ప్రాణాలకు రక్ష… ఆస్తులు కాదు, ప్రాణనష్టాన్ని నివారించాలనేదే ప్రధాన లక్ష్యం… కుట్టనాడ్, చెంగన్నూర్ ప్రాంతాల డ్యాములు నిండిపోయాయి… ఏ రాత్రో నీళ్లు వదలాలి… తప్పదు… నీళ్లు వదిలాక దిగువ ప్రాంతాల ప్రజల్ని అప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించలేం…
Ads
దాంతో అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు… ప్రత్యేకంగా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు… 2.5 లక్షల మందిని యుద్ధప్రాతిపదికన తరలించారు… ఎవరు మొరాయించినా సరే ఊరుకునేది లేదు… ఎహె, మాకేమీ కాదు అనేవాళ్లే అధికం… మంత్రి డాక్టర్ ఇసాక్, మన మైలవరపు కృష్ణతేజ… అందుబాటులో ఉన్న ప్రతి ఉద్యోగి సేవల్ని వాడుకున్నారు… బోట్లు సమకూర్చుకుని, పోలీసులే కాదు, ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలనూ రంగంలోకి దింపారు… 200 బోట్లు ఉపయోగించారు… కుట్టనాడ్ ఏరియాలోని 95 శాతం మందిని రిలీఫ్ క్యాంపుల్లో చేర్చారు…
మనుషులు సరే… పశుసంపద మాటలేమిటి..? వాటినీ తరలించారు… దాణా, వైద్యం ఏర్పాట్లు సరేసరి… ఒక మంత్రి, ఒక ఉన్నతాధికారి కలిసి పనిచేస్తే సాధ్యమైంది ఇలా… 48 గంటల్లో 2.5 లక్షల మందిని తరలించి, తరువాత తప్పనిసరై డ్యాముల్లో నుంచి నీళ్లు వదిలారు… అసలు సమస్య ఆ తరువాత… ప్రాణాలు కాపాడారు… పంటలు కొట్టుకుపోయాయి… 41 వేల మంది ఉపాధి, నిత్యావసరాలు, ఇతర సాయం కోసం మళ్లీ అందుబాటులో ఉన్న నిధులన్నీ వాడారు… గివ్ ఇండియా, బెటర్ ఇండియా వంటి ఆర్గనైజేషన్లు సాయపడ్డాయి…
యూనిసెఫ్ వాళ్లు ప్రత్యేకంగా అభినందించారు… WHO ఇచ్చిన మందుల్ని వాడాల్సిన అవసరం లేకుండా, అందుబాటులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ మందుల్నే సమీకరించి, రిలీఫ్ క్యాంపుల్లో వాడారు… తద్వారా వరదల్లో వ్యాప్తి చెందే వ్యాధుల్ని నివారించారు… ఇలాంటి పనుల్లో సంయమనం, సమన్వయం చాలా అవసరం… ఓ ఉన్నతాధికారికి కీలక సమయాల్లో అవి ఎంత ఉపయోగమో, ప్రజలకు ఎలా ఉపయోగకరమో కృష్ణతేజ సబ్ కలెక్టర్‌గా ఉంటూనే చేసిచూపించాడు…
వోకే, అప్పట్లోనే మనవాళ్లు చాలామంది ప్రత్యేక కథనాలు రాశారు, అభినందించారు… గర్వించాం… మళ్లీ ఇదంతా ఎందుకు అంటే..? ఓసారి తన గతం గుర్తుచేసుకుంటే, తన తత్వమేమిటో, విధి నిర్వహణలో తన ధోరణి ఏమిటో అర్థమవుతుంది… ఇప్పుడు కృష్ణతేజ గురించి మళ్లీ చెప్పుకునే సందర్భం వచ్చింది…
పవన్ కల్యాణ్ కావాలని ఈ కృష్ణతేజను ఓఎస్డీగా రప్పించుకుంటున్నాడనే వార్త చదివాక ఈ పాత కథనం గుర్తొచ్చింది… అందుకే మరోసారి నెమరువేత… అసలు ఆ ఫ్లడ్స్ సమయంలోనే కాదు… ఈయన ఖాతాలో మరో స్టోరీ క్రెడిట్ కూడా ఉంది… అదీ చదువుతారా..? రెండేళ్ల క్రితం రాసిందే… అదే అలప్పుజకు అప్పుడు తను కలెక్టర్… ఆ కథేమిటో ఈ కథనంలో చదవండి… ఇదీ లింకు…
ఆ జంట టవర్లలాగే… 54 విల్లాల రిసార్ట్ కూల్చివేత షురూ… ఆ కథ ఇదీ…
ఇప్పుడు త్రిసూర్ కలెక్టర్‌గా ఉన్నాడు కృష్ణతేజ… పవన్ కల్యాణ్ అభీష్టం విన్నవెంటనే చంద్రబాబు తనను ఏపీకి డెప్యుటేషన్ మీద పంపించాలని కేంద్రానికి లేఖ రాశాడు… డీఓపీటీ వోకే అంటే కృష్ణతేజ తన స్వరాష్ట్రానికి వస్తాడు… టెంపరరీగా అయినా సరే… కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 600 మంది పిల్లల బాధ్యతను తీసుకుని, చదువులు ఆగకుండా రక్షణగా నిలవడంతో జాతీయ బాలల రక్షణ కమిషన్ తనను ప్రత్యేకంగా అభినందించింది… డైనమిక్… ఏ పనిచేసినా సరే, హ్యూమన్ టచ్ ఉండేలా చూసుకునే కృష్ణతేజ ఏపీకి వస్తే మంచిదేగా…!!
Share this Article