.
నీరా ఆర్య...: అజాద్ హింద్ ఫౌజ్ తొలి మహిళా గూఢచారిణి, ధైర్యసాహసాల ప్రతిరూపం
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎందరో వీరులు, వీరవనితలు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. వారిలో కొందరి పేర్లు చరిత్ర పుటల్లో నిలిచిపోగా, మరికొందరు అజ్ఞాతంగానే మిగిలిపోయారు. అలాంటి వారిలో ఒకరు, అజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ) యొక్క తొలి మహిళా గూఢచారిణిగా ప్రసిద్ధి చెందిన నీరా ఆర్య… ఆమె జీవితం ధైర్యానికి, త్యాగానికి, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం…
Ads
నీరా ఆర్య 1902 మార్చి 5న ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పత్ జిల్లా, ఖేక్రానగర్‌లో జన్మించింది… ఆమె తండ్రి సేథ్ ఛజ్జుమల్ ఒక ప్రముఖ వ్యాపారవేత్త… పిల్లలకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వారిని కోల్‌కతాలో చదివించాడు… చిన్నతనం నుంచే నీరాకు దేశభక్తి అపారం… దేశ స్వాతంత్ర్యం పట్ల ఆమెకు బలమైన ఆకాంక్ష ఉండేది…
స్వాతంత్ర్యోద్యమంలో ప్రవేశం
నీరా ఆర్య స్వాతంత్ర్యోద్యమంలోకి చాలా చిన్న వయసులోనే ప్రవేశించింది… ఆమెలోని దేశభక్తి ఆమెను సుభాష్ చంద్రబోస్ స్థాపించిన అజాద్ హింద్ ఫౌజ్‌లోని మహిళా దళం రాణి ఝాన్సీ రెజిమెంట్‌లో చేరేలా చేసింది… ఈ రెజిమెంట్ మహిళా సాధికారతకు, స్వాతంత్ర్య పోరాటంలో వారి ప్రత్యక్ష భాగస్వామ్యానికి ప్రతీకగా నిలిచింది…
వ్యక్తిగత జీవితం – ఒక మలుపు
నీరా ఆర్య తండ్రి ఆమె వివాహం శ్రీకాంత్ జై రంజన్ దాస్‌తో కుదిర్చాడు… శ్రీకాంత్ బ్రిటిష్ ఆర్మీలో సీఐడీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవాడు… దేశభక్తి నిండిన నీరా, బ్రిటిష్ ప్రభుత్వానికి సేవ చేస్తున్న శ్రీకాంత్ మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు పొడసూపాయి… ఈ భిన్నమైన నిబద్ధతలు వారి వైవాహిక జీవితాన్ని విషాదంగా మార్చాయి…
శ్రీకాంత్ తన భార్య నీరాకు సుభాష్ చంద్రబోస్ దళాలతో సంబంధాలు ఉన్నాయని తెలుసుకున్నప్పుడు, బోస్ ఎక్కడ ఉన్నాడో చెప్పమని ఆమెను పదే పదే ప్రశ్నించడం ప్రారంభించాడు. ఒక రోజు నీరా బోస్‌ను చూడటానికి వెళ్ళినప్పుడు, శ్రీకాంత్ ఆమెను వెంబడించాడు…
కోపంతో బోస్ కారు డ్రైవర్‌పైనా కాల్పులు జరిపాడు. బోస్ ప్రాణానికి ముప్పు పొంచి ఉందని గ్రహించిన నీరా, అత్యంత క్లిష్టమైన ఆ పరిస్థితుల్లో అప్పుడేం చేయాలి..? బాస్ ప్రాణాలా..? భర్తా..? ఆమె తన భర్త శ్రీకాంత్‌ను అంతమొందించింది… ఈ సాహసోపేతమైన చర్యతో ఆమె బోస్‌ను తక్షణ ప్రమాదం నుండి కాపాడింది… ఆమె జీవితంలో ఇది ఒక పెద్ద మలుపు…
జైలు జీవితం – మొక్కవోని దేశభక్తి
తన చర్యలకు గాను నీరా ఆర్యను బ్రిటిష్ వలస ప్రభుత్వం అరెస్టు చేసి జైలులో పెట్టింది… ఆమెను ప్రసిద్ధ అండమాన్ నికోబార్ జైలుకు తరలించారు… ఈ జైలు క్రూరమైన, అమానవీయమైన చిత్రహింసలకు పెట్టింది పేరు… అక్కడ ఆమె తీవ్రమైన శారీరక, మానసిక చిత్రహింసలను ఎదుర్కొంది… బ్రిటిష్ అధికారులు ఆమె ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి… దేశం పట్ల ఆమెకున్న విధేయత చెక్కుచెదరలేదు…
స్వాతంత్ర్య సమరయోధుల గురించి, ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ గురించి వివరాలు వెల్లడిస్తే బెయిల్ ఇస్తామని బ్రిటిష్ అధికారులు ఆమెకు ప్రతిపాదించారు… కానీ నీరా తన సహచరులను ద్రోహం చేయడానికి నిరాకరించింది… మౌనంగానే ఉండి, భారత స్వాతంత్ర్యం కోసం అంతులేని కష్టాలను అనుభవించింది…
తొలి మహిళా గూఢచారిణిగా పాత్ర
నీరా ఆర్య ధైర్యాన్ని, బలాన్ని, అచంచలమైన అంకితభావాన్ని గుర్తించిన సుభాష్ చంద్రబోస్ ఆమెకు అజాద్ హింద్ ఫౌజ్ యొక్క తొలి మహిళా గూఢచారిణి అనే బిరుదును, గౌరవాన్ని ప్రదానం చేశాడు… గూఢచారిణిగా ఆమె చేపట్టిన కార్యకలాపాలు గూఢచార సమాచార సేకరణలో, ఇండియన్ నేషనల్ ఆర్మీ కార్యకలాపాలకు సహాయం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆమె ఒక మార్గదర్శకురాలిగా నిలిచింది…
చివరి జీవితం – వారసత్వం
నీరా ఆర్య దేశం కోసం చేసిన సేవలు చాలా కాలం పాటు గుర్తించబడలేదు. ఆమె తన చివరి రోజులను వెలుగులోకి రాకుండానే గడిపింది. 1998 జూలై 26న హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రిలో ఆమె కన్నుమూసింది ఓ అనామకురాలిగా…
మన పాఠ్యపుస్తకాల్లో ఈ పుట కనిపించిందా..? ఆమె ఈ దేశవాసుల్లో ఎందరికి తెలుసు..? ఆలోచించండి..!!
Share this Article