వయస్సు పాతికేళ్ల నుంచి ముప్ఫయిలోపు… కాస్త పొట్టిగా, బక్కపలుచగా… అందంగా ఉన్న ఓ అమ్మాయి… ప్రతి కదలికలో అంతులేని ఆత్మవిశ్వాసం, నిబ్బరం, మొహంలో కళ… ప్రత్యేకించి ఆ కళ్లు… మనస్సుల లోతుల్లోకి తీక్షణంగా చూస్తున్నట్టుగా…! ది ఫేమస్ ఇండియన్ ఐడల్ షో వేదిక మీదకు వచ్చింది… కంటెస్టెంట్లకు ప్లస్ యాంకర్‌కు తలా ఓ కాగితం, పెన్ను ఇప్పించింది… ఓసారి అలా చూసి, మీ మనస్సులో బొమ్మ గీయండి అని చెప్పింది… ముగ్గురు జడ్జిలు… ఒకరు అందరికీ తెలిసిన అనూ మాలిక్, రెండో వ్యక్తి గాయకుడు ప్లస్ సంగీత దర్శకుడు హిమేష్ రేషమియ్యా, మూడో వ్యక్తి గాయని సోనూ కక్కర్… మీ మనస్సుల్లో ఏదైనా ఒక విషయం గట్టిగా అనుకొండి అనడిగింది… సీన్ కట్ చేస్తే…
అనుమాలిక్ మనస్సులో ఏమనుకున్నాడో ఆ అమ్మాయి చెప్పేసింది… ఆమె చెప్పినట్టే ఏప్రిల్ 23 అనే తేదీ గురించి గట్టిగా మనసులో అనుకున్నానని అంగీకరించాడు తను… వెళ్లి ఆమె కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించాడు ఎమోషన్‌తో… సోనూ కక్కర్ తను సెలవు రోజు మాల్దీవుల పర్యటన ప్లాన్ చేసుకోవాలని అనుకున్నాననీ, ఆ అమ్మాయి కరెక్టే చెప్పింది అని విస్మయంతో తెలిపింది… ఆ అమ్మాయిని మిస్ లీడ్ చేయడానికి హిమేష్ చాలాప్రయత్నించి, చివరకు ఓడిపోయి, తను ఓ పాత పాటను మనస్సులో హమ్ చేశాననీ, ఆ అమ్మాయి కరెక్టుగా చెప్పిందని అన్నాడు… సీన్ కట్ చేస్తే…
Ads
పవన్ దీప్ రాజన్ అనే మెయిన్ కంటెస్టెంట్ మినహా యాంకర్, ఇతర కంటెస్టెంట్లు అందరూ ఒకరికి తెలియకుండా ఒకరు… అందరూ చెట్టు బొమ్మనే గీశారు… పవన్ మాత్రం సూర్యుడి బొమ్మ గీశాడు, ఆమె ‘పర్లేదు రాజన్, నేను అనుకున్నదే గీశావు తెలుసా’ అని నవ్వుతూ తన వీపు మీద, డ్రెస్సు మీద అదే సూర్యుడి బొమ్మను చూపించింది అందరికీ… అక్కడ ఉన్నవాళ్లంతా షాక్… ఆమెకు ఏమైనా అతీంద్రియ శక్తులున్నాయా..? మంత్రగత్తెనా..? మాయలాడియా..? ఎవరామె అనే ఆశ్చర్యం… ఇదంతా ఫిక్షన్ కాదు, రాజమౌళి సినిమా కాదు… టీవీలో ప్రసారమై కోట్ల మంది చూసిందే…
ఆమెకు ఏ అతీంద్రియ శక్తులూ లేవు… ఆమె మంత్రగత్తె కూడా కాదు… మెజిషియన్… అంటే ఇంద్రజాలం… అంతే… మేజిక్స్ బయటికి తెలిస్తే ఇంతేనా అనుకుంటాం, సాధన ముఖ్యం, ఆ రహస్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం… మెజిషియన్ మాత్రమే కాదు, ఆమె హిప్నాటిస్ట్, మాస్ హిప్నాటిస్ట్, మైండ్ రీడర్, ఇల్యూషనిస్ట్… వెరసి మెంటలిస్ట్… కార్పొరేట్ ట్రెయినీ… పేరు సుహానీ షా… బడి చదువు, కాలేజీ చదువు గట్రా ఏమీ లేవు ఆమెకు… లైఫ్ మొత్తం ఇదే… కానీ మాట్లాడుతుంటే మొత్తం అక్కడున్న సమూహమంతా ఆమె గ్రిప్‌లోకి వెళ్లిపోతుంది… ఆమె గురించి నిజంగా చదవాలి ఓసారి…
(ఆమధ్య ఏదో సినిమాలో నాగార్జున పాత్ర ఇదే)… ఇవన్నీ శాస్త్రానికి నిలబడ్డ విద్యలే… మరి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ఎన్టీయార్ భార్య లక్ష్మిపార్వతి మొన్న ఆయన సమాధి దగ్గర మాట్లాడుతూ… ఆత్మల గురించి ఏవేవో మాట్లాడేస్తూ… తాను చెన్నైలోని కుముద్విని అనే అమ్మాయి వద్దకు వెళ్లాననీ, జీవిత తీసుకెళ్లిందని, ఎన్టీయార్ ఆత్మ ఆ పిల్లను ఆవహించి తనతో చాలా విషయాలు మాట్లాడినట్టు లక్ష్మిపార్వతి చెప్పింది…
నిజానికి అంతా అబ్సర్డ్… ఎందుకో మనం ఇంతకుముందు ఓ కథనంలో చెప్పుకున్నాం… ఇదుగో లింక్… https://muchata.com/oh-ntr-ghost-must-have-guided-chandrababu-also/ ఈ అమ్మాయి సుహానీ షా గనుక తనకు ఏవో శక్తులున్నాయంటూ దందా స్టార్ట్ చేస్తే బోలెడు సంపాదించేదేమో… కానీ ఆమె రూట్ వేరు… ఉదయ్‌పూర్‌కు చెందిన ఈ అమ్మాయి ఏడేళ్ల వయస్సులోనే బడి మానేసింది… మేజిక్ మీద ప్రేమ పెంచుకుంది… ఇప్పటివరకు ఆమె వివిధ దేశాలు, ప్రాంతాలు కలిపి 5 వేల షోలు ఇచ్చింది… అంటే అర్థమైంది కదా ఆమె మెరిట్…
ఆమె అహ్మదాబాద్‌లో ఉంటున్నప్పుడు అక్కడికి దగ్గరలో ఉండే కలోల్ అనే ఊరికి వెళ్లింది… అది మెజీషియన్ల ఊరు… 9 నెలలపాటు వాళ్ల దగ్గర బోలెడంత నేర్చుకుంది… యంగెస్ట్ పవర్ ఫుల్ లేడీ మెజిషియన్ ఆఫ్ ఇండియా… అంతేకాదు, హిప్నోథెరపిస్ట్… యంగెస్ట్ మెజిషియన్‌గా గిన్నీస్ బుక్‌లో చోటు… మేజిక్ అనగానే పావురాలు తీయడం, వస్తువులు మాయం చేయడం వంటి చిన్న చిన్న భ్రమాత్మక ఫీట్లు కాదు… ఆమె మేజిక్‌కు ఓ కొత్త దిశను, నడకను చూపిస్తోంది…
నెట్‌లో ఆమెవి బోలెడు వీడియోలు… సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోయర్స్… ఆశ్చర్యమేస్తుంది ఆ అమ్మాయి కథ చదువుతూ ఉంటే… సో, చెప్పుకునేది ఏమిటంటే… నమ్మాల్సింది కుముద్విని టైపు ‘ఆత్మల కల్పిత మాధ్యమాల’ గురించి కాదు… లక్ష్మిపార్వతి చెప్పనివ్వండి, జీవిత చెప్పనివ్వండి… నమ్మండి మేజిక్‌ను… కానీ బ్లాక్ మేజిక్‌ను కాదు… రెండింటి నడుమ ఓ బలమైన గీత ఉంది… అది వేరు, ఇది వేరు… అది చెప్పడం కోసమే ఈ సుహానీ షా గురించి ఈ కథనం… మీకు ఇంట్రస్ట్ ఉంటే ఆమె వీడియోలు ఓసారి చూడండి, చదవండి… ఆల్ ఇండియా మెజిషియన్స్ అసోసియేషన్ ఆమెను ‘జాదూ పరి’ అని పిలుస్తుంది… ఇదీ సుహానీ షా కథ…
Share this Article