.
సరిగ్గా 30 ఏళ్ల క్రితం… ల్యాండ్ ఫోన్లకు కూడా ఎంపీల సిఫారసులు, కోటాలు అమలవుతున్న కాలం… ఏవో కొన్ని ప్రాంతాలకే టెలిఫోన్ నెట్‌వర్క్… లైటెనింగ్ కాల్స్, ట్రంక్ కాల్స్, గంటల తరబడీ వెయిటింగ్, లో వాయిస్, నాయిస్, వాయిస్ బ్రేకులు…
31, జూలై, 1995 … అప్పటి కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి సుఖరాం… అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసుకు ఇండియాలో మొదటి మొబైల్ కాల్ చేశాడు… అదే ఇండియాలో టెలికామ్ దశను తిప్పిన అడుగు… అప్పట్లో నిమిషానికి 8 రూపాయలు టారిఫ్, పీకవర్స్‌లో అయితే మొదట్లో 16 రూపాయలు… ఇన్‌కమింగ్ కాల్స్‌కు కూడా చార్జీలు పడేవి…
Ads
ఇప్పుడు ఇన్‌కమింగ్ ఫ్రీ మాత్రమే కాదు, ఒక జీబీ డేటా 4 రూపాయలకు కూడా దొరుకుతోంది… సగటున… అప్పట్లో గుర్తుందా..? మిస్‌డ్ కాల్స్ అనేవి అప్పుడే ప్రారంభం… మిస్‌డ్ కాల్ నంబర్ చూసుకోవడం, ఏదో ల్యాండ్ ఫోనో, పబ్లిక్ ఫోనో చూసుకుని తిరిగి కాల్స్ చేయడం… అప్పుడు సుఖరాం వాడిన మొబైల్ నోకియా 350 లేదా నోకియా 2080 కావచ్చు… ఆయన బెంగాల్ ముఖ్యమంత్రికే మొదటి కాల్ చేశాడో తెలియదు గానీ… ఈ 30 ఏళ్లలో మొబైల్ ఫోన్ ఓ విప్లవం…
ఇప్పుడు అది లేనిదే జీవితం లేదు… 5 జీ వరకెు వచ్చేశాం, శాటిలైట్ ఫోన్లు, ఏక్‌సేఏక్ స్మార్ట్ ఫోన్లు… అదొక మినీ కంప్యూటర్… 1995 లో కేంద్ర మంత్రి కాల్ చేసిన సర్వీస్ ప్రొవైడర్ modi-telstra… (ఇది బీకే మోడీ, ఆస్ట్రేలియాకు చెందిన టెల్‌స్ట్రా జాయింట్ వెంచర్)… తరువాత స్పయిస్‌గా మారినట్టుంది… అప్పట్లో ఆ నోకియా మోడల్ ధర దాదాపు 40 వేలు… ఇప్పటి ధరలను బట్టి లెక్కేస్తే 2 లక్షలు…
ప్రైవేటు కంపెనీల నడుమ పోటీ, టారిఫ్‌ల తగ్గింపు, ఇబ్బడిముబ్బడిగా పెరిగిన కస్టమర్లు, వినియోగదారుల అఫర్డబులిటీ అన్నీ కలిసి… ఇప్పుడు చీప్ ప్యాకేజీలు… 4, 5 వేలకు కూడా ఓ మాదిరి స్మార్ట్ ఫోన్ దొరుకుతోంది… ప్రస్తుతం 45 కోట్ల ఫీచర్ ఫోన్స్, 40 కోట్ల స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారని అంచనా… మొదట్లో 3 లైన్ల మెసేజ్‌కు చాన్స్ ఉండేది… అందుకే దాన్ని ఎస్ఎంఎస్ (షార్ట్ మెసేజ్ సర్వీస్) అన్నారు… అదే స్థిరపడిపోయింది పేరు…
ఇదీ మన దేశ మొబైల్ ప్రస్థానం…
1995: ఫస్ట్ మొబైల్ కాల్…
1996–1999: ముఖ్య నగరాలన్నింటికీ విస్తరణ…
2000–2003: బడా కంపెనీల నడుమ పోటీ, టారిఫ్ వార్…
2004–2008: ఫీచర్ ఫోన్ల బూమ్.,. ప్రిపెయిడ్ ప్లాన్లు, గ్రామీణ ప్రాంతాలకూ వ్యాప్తి, 20 కోట్లకు పెరిగిన మొబైల్ వినియోగదారుల సంఖ్య…
2008: 3 జీ రంగప్రవేశం… హైస్పీడ్ ఇంటర్‌నెట్ అందుబాటులోకి వచ్చింది…
2010–2012: 4 జీ ట్రయల్స్, స్మార్ట్ ఫోన్ల రంగప్రవేశం…
2014: డిజిటల్ ఇండియా లాంచ్… టెలికామ్ మౌలిక వసతులకు ప్రభుత్వం పెద్దపీట…
2015–2016: మొబైల్ ఇంటర్‌నెట్ విప్లవం షురూ… చీప్ డేటా అప్పుడప్పుడే స్టార్టయింది…
2017–2019: మొబైళ్ల ద్వారా వాల్యూ యాడెడ్ సర్వీసులు షురూ, గ్రామీణ ప్రాంతాల్లోకి వేగంగా విస్తరణ…
2020: COVID-19 … ప్రతి అవసరానికీ తప్పనిసరై మొబైల్ వాడకం…
2022: 5 జీ వచ్చేసింది…
ఇప్పుడు… 85 శాతం జనాభాకు, 99 శాతం జిల్లాలకు 5 జీ కవరేజీ అందుబాటులో ఉంది… 85 శాతం ఇళ్లకు మొబైల్స్… అనేక అంశాలకూ మొబైల్ ఓ తప్పనిసరి అవసరంగా మారిపోయింది…
చివరగా… మొదటి మొబైల్ కాల్ చేసిన సదరు కేంద్రమంత్రి సుఖరాంకు తరువాత కొన్నాళ్లకే… ఓ భారీ టెలికాం స్కాంలో నిందితుడిగా జైలు శిక్ష పడింది..!!
Share this Article