వెంకటేష్‌ను కొన్ని అంశాల్లో మెచ్చుకోవచ్చు…. ఒక ప్రొఫెషనల్ సినిమా ట్రేడర్ కుటుంబసభ్యుడిగా అక్షరాలా అదే స్పూర్తితో వ్యవహరిస్తాడు… కాకపోతే కుటుంబం, వంశం డప్పుల విషయంలో మినహాయింపు లేదు… అయితే… వయస్సు మీద పడ్డాక ఇంకా కుర్ర చేష్టల అమ్మడూ కుమ్ముడూ తరహా స్టెప్పులు, ఓవర్ హీరోయిక్ వేషాల జోలికి పోవడం లేదు… అంతేకాదు… చాలామంది కుర్ర, అనుభవం లేని హీరోల్లాగా మా సినిమాలు థియేటర్లలోనే విడుదల కావాలనే పిచ్చి పట్టింపులు కూడా ఏమీలేవు… అలాంటోళ్ల వల్ల చాలామంది కరోనాకాలంలో మునిగిపోయారు…
కానీ వెంకటేష్ అలా కాదు… కాలాన్ని బట్టి తనను తాను మార్చుకోగల వ్యాపార హీరో తను… రెండు సినిమాల్ని నేరుగా ఓటీటీల్లో విడుదలకు సై అన్నాడు… ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాక ఎఫ్-3 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు… అదీ సందర్భశుద్ధి, సమయశుద్ధి… అరవయ్యేళ్ల వయస్సు తనది… ఆ వయోస్పృహ కూడా ఉంది తనలో… మల్టీస్టారర్లకూ సై… అంతేకాదు, ట్రెండ్‌ను బట్టి వెబ్ సీరిస్‌కు కూడా సై అన్నాడు…
కరోనాకాలంలో షూటింగుల్లేవు… కొత్త సినిమాల్లేవు… సినిమా విడుదలల్లేవు… జనం ఎక్కువగా టీవీలు, ఓటీటీల వైపు వెళ్లిపోతున్నారు… ఇంకా థియేటర్లు అనే కాన్సెప్టునే పట్టుకుని ఏడవడం వేస్ట్ అనే స్పృహకు వచ్చింది ఆ కుటుంబం… దీనికితోడు కొత్త ట్రెండ్స్‌కు అర్జెంటుగా అడాప్ట్ అయిపోయే రానా ఉండనే ఉన్నాడు… అందుకే వెంకటేష్ వెబ్ సీరీస్‌కు కూడా సై అన్నాడు… దాని పేరు రానా నాయుడు… దానికి ప్రధానబలం రానా…
Ads
…. (రే డోనోవాన్ సీరియల్‌లో ఓ సీన్)
రానా పేరు కలిసి రావాలి… రామానాయుడి వారసత్వం పేరు కలిసి రావాలి… మళ్లీ అదో పైత్యం… అది మాత్రం తగ్గదు… సరే, దాన్ని వదిలేస్తే… అది నెట్‌ఫ్లిక్స్‌లో రావల్సి ఉంది… షూటింగ్ పూర్తయ్యింది… నిజానికి ఇదేమీ కొత్త క్రియేటివ్ వర్క్ ఏమీ కాదు… Ray Donovan అనే ఓ అమెరికన్ క్రైమ్ డ్రామా టీవీ సీరిస్‌కు అనుకరణ, అనుసరణ, కాపీ, రీమేక్, సిమిలర్ లైన్స్… ఏ పేరయినా పెట్టుకొండి… ఈ రానా నాయుడి వెబ్ సీరీస్‌కు అది ఒరిజినల్… అనగా మాతృక…
ఆ కథ జోలికి మనం వెళ్లడం లేదు ఇక్కడ… అయితే ‘‘తెలివైన హీరోలు’’… పోనీ, తెలివైన సినిమా వ్యాపారులు ట్రెండ్‌కు అనుగుణంగా తమ ఇగోల్ని చంపుకుని, కొత్త ధోరణులకు ఎలా తలవంచాలో చెబుతున్న వార్త ఇది… ఇదేమిటి..? వెంకటేష్‌తో టీవీల్లో లేదా ఓటీటీల్లో టాక్ షో చేయించాలనీ కరోనా సీజన్‌లో కొందరు ప్రయత్నించారు… టీవీలు, ఓటీటీలు మన హీరోలకు కొత్తేమీ కాదు, నాగార్జున ఎప్పుడో టీవీపైకి వచ్చేశాడు, చిరంజీవి వచ్చాడు గానీ సక్సెస్ కాలేదు… జూనియర్ కూడా వచ్చేశాడు… నాని బిగ్‌బాస్ షో హోస్ట్ చేశాడు…చివరకు బాలయ్య కూడా ఓ టాక్‌షో హోస్ట్ చేశాడు… కాకపోతే తన యాక్టింగ్ ధోరణికి టాక్ షో ఫిట్ కాదని వెంకటేష్ వదిలేశాడు…
ఏమో… రేప్పొద్దున కాలం డిమాండ్ చేస్తే… మళ్లీ చెప్పుకుందాం… కాలం గనుక డిమాండ్ చేస్తే… అనగా, అనివార్యమైతే ఇదే వెంకటేష్ ఏ కార్తీకదీపం తరహాలోనో ఒక శ్రావణ సతీవ్రతం, ఒక భాద్రపద తిమిరం వంటి సీరియళ్లకూ సై చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు… కాకపోతే నారప్ప, దృశ్యం వంటి సినిమాలు తనను ఇంకా లైమ్ లైట్‌లో ఉంచుతున్నయ్… కానీ తను ఏ స్టార్ సినిమాల పోటీలో ఉండడు… వసూళ్ల బరిలో ఉండడు… తన సినిమాలు తనవి… అంతే… పాన్ ఇండియా, పాన్ వరల్డ్ వంటి భ్రమాత్మక భావనల్ని, తన పరిమితుల్ని గుర్తుంచుకుని మసులుకుంటాడు… గుడ్…
Share this Article