Muchata.com Telugu Latest News

Muchata.com Provided Telugu Latest News, Political News , Political News, Breaking News in Telugu LIVE ముచ్చట

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మొహం కూడా చూపించుకోలేని రచయిత… మీకర్థమైంది నిజం కాదు…

November 27, 2020 by M S R

ముందుగా వాట్సప్ గ్రూపుల్లో కనిపించిన ఈ సమాచారం చదవండి, తరువాత చెప్పుకుందాం…



తెలుగులో ఇంతదాకా ఫొటో ప్రచురణకి విముఖులైన ఏకైక రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి.

గత ఏభై యేళ్ళుగా వదలకుండా దాదాపు రోజూ రాసే ఏకైక తెలుగు రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి.

రచనల మీద జీవిస్తున్న ఏకైక నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి.

పిల్లల పేర్ల పుస్తకాల్లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకం మల్లాది వెంకట కృష్ణమూర్తి పిల్లల పేర్ల పుస్తకం. 2020కి 2 లక్షలకి పైగా అమ్ముడయ్యాయి.

తెలుగు నవల ఆధారంగా వచ్చిన తొలి హిందీ చిత్రం కుఁవారి బహు. దీనికి మల్లాది రేపటి కొడుకు నవల ఆధారం.

తొలి ప్రైవేట్ ఛానల్ జెమినీ టి.వి.లో సీరియల్ గా వచ్చిన తొలి నవల మేఘమాల. దీనికి మల్లాది మేఘమాల నవల ఆధారం.

మల్లాది వెంకట కృష్ణమూర్తి కథలు రోజుకి ఒకటి చొప్పున చదువుతుంటే లేదా యూ ట్యూబ్ లో వింటూంటే, నేటిదాకా ప్రచురింపబడ్డ కథలన్నీ పూర్తవడానికి పదేళ్ళకి పైనే పడుతుంది. ఈలోగా నిత్యం వాటికి మరికొన్ని కథలు కలుస్తుంటాయి.

50 ఏళ్ళు
600 నెలలు
18,263 రోజులు
4,38,312 గంటలు
2,62,98,720 నిమిషాలు
1,57,79,23,200 క్షణాలు.
సాగిన రచనా వ్యాసంగంలో…
109 పత్రికల్లో
106 నవలలు
3500కి పైగా కథలు
1,200కి పైగా వ్యాసాలు
70 శీర్షికలు
22 సినిమాలు
9 టి.వి.సీరియళ్ళు
4 సంపాదకత్వాలు
యింకా ఎన్నో, మరెన్నో.
మల్లాది వెంకట కృష్ణమూర్తి ఇవన్నీ మనకి చెపితే, మనల్ని జడ్జి సీటులో కూర్చోపెట్టి అతను చేసిన పనులన్నీ సరైనవేనని చెప్పుకున్నట్లు కాదు. తన గొప్పదనం గుర్తించమని కాదు.
తెలుగువాడి గొప్పదనం తెలుగువాడు గుర్తించడు కాబట్టి తెలియజేసుకోవటం. మనలో ఎంతమందికి ఈ విషయాలు తెలుసు?

(ఈ సమాచారమంతా మల్లాది తాజా పుస్తకం “నవల వెనక కథ”లోనిది)



నిజమే… రాయడం ఓ వ్యసనం… ఏదైనా రాయకపోతే తను బతకలేడు… రాస్తూనే ఉండాలి… ఉంటాడు… ఉన్నాడు… గొప్ప గొప్ప రచనలా..? జస్ట్, పాపులర్, కమర్షియల్ రచనలా..? అనేది పక్కన పెడితే… తెలుగులో మల్లాది స్థాయిలో అక్షరసేద్యం చేసిన మరో రైతు కనిపించడు మనకు… రచయిత మొహం, వయస్సు, ప్రాంతం, మతం, కులం, పార్టీ తన రాతల గురించి పాఠకులపై ఏ అభిప్రాయాన్ని కల్పించకూడదు… అదీ ఆయన నమ్మకం… అందుకే ఆయన ఫోటోనే కాదు, తన వ్యక్తిగత వివరాలను సైతం ఇప్పటివరకూ ప్రచురించనివ్వలేదు… తెరపై అసలు కనిపించడు… ఇంటర్వ్యూలు ఇవ్వడు… సోషల్ మీడియాకెక్కి ధర్మోపన్యాసాలు ఇవ్వడు…

అది పెద్ద విశేషం కాకపోవచ్చు, కానీ ఇంత పాపులర్ రైటర్ అయి ఉండీ, ఇన్నేళ్లుగా బయటి ప్రపంచానికి మొహం చూపించకుండా, సక్సెస్‌ఫుల్‌గా ఉండగలగడం పెద్ద విశేషమే… ఒక కథ రాస్తేనే దాని గురించి పది పత్రికల్లో విశ్లేషణలు రాయించుకుని, కథ వెనుక కథ తెలుసా అంటూ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చే రోజులివి… పైగా తెలుగువాడు ఎప్పుడూ కీర్తికాంత ప్రియుడు… మల్లాది తన రచనల గురించీ పెద్దగా చెప్పుకోడు, తన గురించి అసలే చెప్పుకోడు… ప్చ్, బొత్తిగా తెలుగుదనం లేదేమిటి మాస్టారూ..?

పడవల్లాంటి కార్లు, పిచ్చి ప్రేమలు, ఉంగరాల జుత్తు హీరోలు, కావ్యనాయికల వంటి హీరోయిన్లు, అపార్థాలు, ఆభిజాత్యాల పైత్యం నుంచి తెలుగు నవలలను బయటికి లాగి… అన్నిరకాల సబ్జెక్టులనూ తీసుకుని, తమదైన శైలిలో, రకరకాల రచన ప్రయోగాలతో పాఠకుల్ని ఉర్రూతలూగించిన ఒక తరం రచయితల్లో బహుశా యండమూరి, మల్లాది అగ్రగణ్యులు కావచ్చు…

క్రైం, సస్పెన్స్, థ్రిల్లర్, హిప్నాటిజం, చేతబడి, సైన్స్, పరిశోధనలు, అంతరిక్షం, రొమాన్స్, టెలిపతి, టైం ట్రావెల్, ఫిలాసఫీ, ఎమోషన్స్… వాట్ నాట్… వాళ్లు టచ్ చేయని అంశాలేమున్నయ్..? అవి చదివే కదా లక్షల మంది పాఠకులు ఆయా సబ్జెక్టులతో పరిచయం పెంచుకున్నది…

యండమూరి నవలలకు సంబంధించి కాపీ అనే ఆరోపణలు చాలా ఉన్నయ్… కానీ మల్లాది రచనలపై ఆ ముద్ర కూడా లేదు… అవిశ్రాంత అక్షరపథికుడికి అభినందనలు… మీ చేయి రాస్తూనే ఉండాలి… ఉంటుంది… మీరు తప్పించుకోలేరు… ఒక తెలుగువాడి గొప్పదనం గురించి ఇంకా ఎక్కువ రాయడం కూడా తెలుగుదనం కాదంటారేమో… అందుకని ఇక సెలవు…

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • ‘‘జగనూ, కేబినెట్‌లో చేరిపోవయ్యా… అబ్బే, ఇప్పుడొద్దులెండి సార్…’’
  • ఓ పెగ్గు వేస్తే తప్ప… అవి అంతుపట్టవు… ఇన్నాళ్లకు వాళ్లకు కనిపించినయ్…
  • ఆలీ పిచ్చికూతలు సరే..! షకీలా ధర్మసందేహం మాత్రం అల్టిమేట్..!
  • అనుకుంటాం గానీ… చాలామంది చంద్రబాబులున్నారు దేశంలో…!!
  • పాకిస్థాన్ ఇజ్జత్ జప్తు… ఇమ్రాన్‌కు ఇంటాబయటా అన్నీ వెక్కిరింపులే…
  • పట్టుచీరె కట్టేనా..? నొసటన బొట్టు పెట్టేనా..? వేళ్లకు మెట్టెల మాటేమిటో..?!
  • ఫ్లెక్సీ లీడర్స్..! వింటారా కలాం చెప్పిన ధావన్ కథ..?
  • ఔను సారూ… మతమేనా..? కులాన్ని తేల్చే డీఎన్ఏ టెస్టులు కూడా ఉన్నయా..?
  • ప్రధాని దాకా కీలక పదవులు… దేశరక్షణకు మాత్రం ముందుకు రారు…
  • చింత బరిగెలు, తొడపాశాలు కావు బ్రో… అసలు కథలు వేరే ఉంటయ్…

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now