ఇప్పుడందరూ కమల్‌హాసన్ విక్రమ్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు కదా… తను 1986లో కూడా ఇదే పేరుతో ఓ సినిమా చేశాడు… అదే పేరుతో, అదే సంవత్సరం నాగార్జున కూడా సినీరంగప్రవేశం చేశాడు… 34 ఏళ్లు గడిచిపోయాయి… మొదట్లో అనేక సినిమాల్లో తనను హీరోగా జనం పెద్దగా యాక్సెప్ట్ చేయలేదు… బోలెడు ఢక్కామొక్కీలు… సొంత స్టూడియో, బలమైన బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి నిలబడగలిగాడు… తరువాత జనం అలవాటుపడిపోయారు… శివతో నిలబడ్డాడు… గీతాంజలితో బెటర్ ఇమేజీ వచ్చింది, తరువాత నిన్నే పెళ్లాడతా, అన్నమయ్యల తరువాత ఇక పాతుకుపోయాడు…
అమెరికాలో చదువుకున్న తనను సినిమాల్లోకి తీసుకురావాలా వద్దా… అదొక డైలమా… రకరకాల కోణాల్లో ఆలోచించి… రామానాయుడు వెంకటేష్‌ను దింపినట్టే నాగార్జుననూ దింపేశారు… వెంకటేష్, నాగార్జున సేమ్ ఏజ్… తను కూడా యూఎస్‌లో చదివి, నాగార్జునలాగే 1986లో కలియుగపాండవులు సినిమాతో లాంచ్ అయ్యాడు… అయితే నాగార్జునను పరిచయం చేయడానికి అక్కినేని స్వయంగా పూనుకున్నాడు… హీరోగా తన కొడుక్కి యాక్సెప్టెన్సీ రావడానికి తన పరిచయ వాక్యాలు ఉపయోగపడతాయని భావించాడు… అభిమానులకు 1985 సెప్టెంబరులో ఓ లేఖ రాశాడు…
Ads
చదవడం కష్టంగా ఉందా..? తను ఏమంటాడంటే..? సూటిగా, సంక్షిప్తంగా… ‘‘42 ఏళ్లుగా నన్ను అభిమానిస్తున్నారు… మెచ్చుకున్నారు, విమర్శించారు, నా నటజీవితాన్ని పరిపుష్టం చేశారు… నేను నటించే చిత్రం సకుటుంబసమేతంగా చూసేలా ఉండాలనేది నా ఉద్దేశం… మీరు బలపరిచారు… మానవ బలహీనతల్ని ప్రకోపింపజేసే చిత్రాలతో సక్సెస్ పొందేవారు ఎంతమంది ఉన్నా, ఆ చిత్రాల వైపు నేను మొగ్గకుండా… చెల్లి, తల్లితోసహా వెళ్లి చూసేలా నా సినిమాలు ఉన్నాయంటే అది మీ అభిరుచి, మీ సంస్కారం… దానికి జోహార్లు…
మా రెండో అబ్బాయి నాగార్జున తనకు నటన మీద ఇంట్రస్టు ఉందని చెబుతూ వస్తున్నాడు… నాకు చదువు లేదు, నువ్వయినా ముందుగా బాగా చదువుకో అని చెబుతూ వచ్చాను నేను… అమెరికాలో బీఎస్, ఎంఎస్ చేశాడు… ఇప్పుడు నటించాలని ఉత్సాహపడుతున్నాడు… నటన, నాట్యం, ఫైటింగుల్లో శ్రమిస్తున్నాడు… మంచి భవిష్యత్తును నేను ఊహిస్తున్నాను…
ఇన్నేళ్లుగా నన్ను అభిమానించినట్టే నాగార్జునను కూడా అభిమానించి, ఆదరించి, ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను… మీ ఆదరాభిమానాలే తనకు బంగారుబాట… తన పుట్టినరోజు ఆగస్టు 29న తన సినిమా రంగప్రవేశం గురించి తెలియజేస్తాం… తను కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియో కొత్తచిత్రం ప్రారంభమవుతుంది… ఇదుగో నాగార్జున ఫోటో, దీంతో జతచేస్తున్నాను… మనసారా ఆశీర్వదించండి…’’ ఇదీ అభిమానులకు రాసిన లేఖ…
సినిమాల్లో బలమైన బ్యాక్ గ్రౌండ్ ఎంట్రీకి మాత్రమే ఉపయోగపడుతుంది… కొన్నాళ్లు నిలబడటానికి సరిపోతుంది… కానీ నిలదొక్కుకోవాలంటే మాత్రం ఎంతోకొంత మెరిట్ సాధించకతప్పదు… కష్టపడక తప్పదు… అది అక్కినేనికీ తెలుసు… ఐనా తన అభిమానుల మద్దతును నాగార్జున వైపు మళ్లించడం ద్వారా ప్రాథమికంగా నాగార్జున పట్ల యాక్సెప్టెన్సీని పెంచాలనుకున్నాడు… మరింత స్ట్రాంగ్ ఫౌండేషన్, స్ట్రెంత్ కోసం మరో సినీ లెజెండ్ రామానాయుడి బిడ్డ లక్ష్మితో పెళ్లి చేశాడు, కానీ అది నిలబడలేదు… అభిమానులకు అక్కినేని రాసిన లేఖ పొందికగా, పద్దతిగా ఉంది… అందుకే ఇలా షేర్ చేసుకోవడం…!!
Share this Article