Bharadwaja Rangavajhala………. అంబడిపూడి ….. ఈ పేరు డెబ్బైల్లో చాలా పాపులర్ . టీవీలు రాని రోజులవి. ఇంట్లో ఉంటే రేడియో ప్లస్ పుస్తకాలు … బయటకు వెళ్తే కేవలం పుస్తకాలే అప్పుడు. బస్సుల్లోనూ రైళ్లలోనూ లాంగ్ జర్నీ చేసే వాళ్లందరూ ఓ నవల పట్టుకుని ఎక్కేసేవాళ్లు. నేను చదివిన చాలా నవలలు అలా దారి ఖర్చుగా నమిలినవే.
ముఖ్యంగా బస్టాండుల్లో పుస్తకాల షాపుల దగ్గర సేల్స్ చాలా బాగుండేది. మధుబాబు, కొమ్మూరి సాంబశివరావుల డిటెక్టివ్ నవలలకు సూపర్ గిరాకీ. అలాంటి పరిస్థితుల్లో విజయవాడ సత్యనారాయణపురం రైల్వే గేటు సమీపంలో ఉండే వారు అంబడిపూడి. అది ఇంటిపేరు. దాంతోనే ఆయన పాపులర్. జంధ్యాల లాగా.
సొసైటీలో ఏ కొత్త అంశం జనం దృష్టిని ఆకర్షించినా దాని మీద ఓ నలభై పేజీలకు మించకుండా రాసి పుస్తకం వేసి బస్టాండుల్లో పెట్టేసేవారు అంబడిపూడి. బ్రూస్లీ ఎంటర్ ది డ్రాగన్ రిలీజైన వెంటనే కరాటే కుంగ్ ఫూ అంటూ ఓ పుస్తకం వేసి లక్షల ప్రతులు అమ్మారు. ఎమర్జన్సీ ముగిసి 1977 ఎన్నికల సంరంభంలో సంజయ్ గాంధీ రాసలీలలు అంటూ ఓ పుస్తకం వేసి జనతా పార్టీ సభలు జరిగిన ప్రతి చోటా అమ్మారు. అవి కూడా లక్షల్లో జనం కొనేశారు.
Ads
ఆ తర్వాత సంజయ్ మరణ రహస్యం అంటూ ఓ పుస్తకం. ఇప్పుడు న్యూస్ ఛానళ్లలో ఓ కరెంట్ టాపిక్ మీద అరగంట స్టోరీ వేస్తున్నారు కదా… దాదాపు అంబడిపూడిది ఇదే స్టైలు. ఆయన భాష కూడా చాలా క్యాచీగా ఉండేది. వారంలో రెండు పుస్తకాలు ఆయన నుంచి మార్కెట్ కు చేరేవి. స్కైలాబు మీద ఆయన రాసిన పుస్తకమే జనాలకు అప్పట్లో జ్ఞానం పంచింది.
ఇది అది అని లేదు. జనంలో క్యూరియాసిటీ ఉందనిపించిన ప్రతి సబ్జెక్టూ ఆయన నుంచి పుస్తకంగా వచ్చేసేది. హిప్నాటిజం ఎవరైనా చేయచ్చు. రచనలు చేయాలంటే ఏం చేయాలి ? ఇలా … రాజకీయాల నుంచీ సంభోగ సమస్యల దాకా సాహిత్యం, కళలు ఇలా అంబడిపూడికి కాదేదీ అసాధ్యం.
దేని గురించైనా నలభై పేజీల ఒన్ ఎయిత్ డెమ్మీ సైజులో పుస్తకం బస్టాండులో రడీగా ఉండేది. ప్రాధమిక సమాచారం అందులో దొరికేసేది. ఇలా అంబడిపూడి … క్రియేట్ చేసిన చదువరులను ఆధారం చేసుకునే ఆ తర్వాత రోజుల్లో మరింత అడ్వాన్స్ డ్ లాంగ్వేజ్ తో (బూతులతో సహా పామర భాషను వాడిన అని నా అర్ధం) ఎన్ కౌంటర్ పత్రిక వచ్చింది.
పొలిటికల్ గాసిప్స్ ప్లస్ సినిమా గాసిప్స్ కి అప్పట్లో ఉన్న గిరాకీని బుక్ సెల్లర్ గా అంబడిపూడి పట్టుకుంటే … పత్రికగా ఎన్ కౌంటర్ కు స్పేసునిచ్చాయి. ఎన్ కౌంటర్ పత్రిక జనంలో చదవాలనే క్యూరియాసిటీని పెంచడం అనేది వ్యూహాత్మకంగా చేసినా … కొంత సీరియస్ కంటెంట్ అందించే ప్రయత్నం చేసేది. ఈ క్రమంలోనే దాని ఎడిటర్ పోలీసులతో సహా చాలా వర్గాలకు శత్రువయ్యాడు. అతన్ని చంపకపోతే బతకడం కష్టం అని కొందరు అనుకున్నారంటేనే తన పెన్ను ఎంత బలమైనదో అర్ధం అవుతుంది.
ఇలా ఎన్ కౌంటరు పత్రిక … అంబడిపూడి పుస్తకాలు జనాలకు జ్ఞాన ప్రసరణ చేస్తున్న సమయంలోనే హైద్రాబాద్ నుంచి డిఎన్ఎఫ్ హనుమంతరావు గారు నేటి రాజకీయం అని పత్రిక ప్రారంభించారు. ఇది కూడా ఎన్ కౌంటర్ లాంటి పత్రికే అని మర్యాదస్తులం అని చెప్పుకునే మధ్యతరగతి ఉద్యోగ వర్గాల పాఠకులు దాని జోలికి పోలేదు. ఇందులో భాష ఎన్ కౌంటర్ లా లేదని ఎన్ కౌంటర్ తరహా పత్రికలతో తృప్తిని పొందే పాఠకులు పెదవి విరిచారు. దీంతో హనుమంతరావుగారి పత్రిక చాలా కొద్దికాలం నడచి ఆగిపోయింది.
ఆ మధ్య శ్రీనివాస్ కస్తూరి అనే కుర్రాడు … చాలా కాలం తర్వాత అంబడిపూడి పేరు వాడుతూ ఓ పోస్టు పెట్టాడు. దానికి స్పందిస్తూ ఒకావిడ అంబడిపూడా హు ఈజ్ హీ అనేశారు. దీంతో నా బెజవాడ మనసు గాయం పడింది. ఒక్కసారి డెబ్బై ఆరు ప్రాంతాల బెజవాడ సత్యనారాయణపురం రైల్వే గేటు పరిసరాలకు వెళ్లింది. అదీ కథ…
Share this Article