.
తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్ అంటాడు చంద్రబాబు… ఈమధ్యకాలంలో విన్న భయానకమైన, బీభత్సమైన జోక్ ఇది… ఎప్పటి నుంచో హైదరాబాద్ నేనే కట్టాను అంటున్నాడు, ఇది దానికి పరాకాష్ట… పైగా దీంతో అమరావతిని పోలుస్తాడు… దేని కథ దానిదే… అమరావతి బిల్లు పార్లమెంటులో పాస్ కావడంతో రాయలసీమ వాసుల కళ్లల్లో ఆనందం అంటూ మరో ట్వీట్… బాబోయ్…
హైదరాబాద్ చరిత్రకు వందల ఏళ్లు… ఇక్కడ లైఫ్ ఉంది, జనం ఉన్నారు, తెలంగాణ మాత్రమే కాదు, దేశంలోని… కాదు, ప్రపంచంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన జనాన్ని ఈ నగరం అక్కున చేర్చుకుంది, అన్నం పెట్టింది, ఆదరించింది… ఇది ‘ప్యూర్’ మెట్రోపాలిటన్ గ్లోబల్ సిటీ… రాత్రికిరాత్రి అబ్రకదబ్ర అనగానే… పాతాళభైరవి సినిమాలోలాగా భవనాలు, నగరాలు నిర్మాణం కావు…
Ads
వేల ఎకరాల భూసేకరణ, కొన్ని భవనాల (ఆ నిర్మాణవ్యయాలు, అక్రమాల ఆరోపణలు వదిలేస్తే) నిర్మాణంతో హైదరాబాద్ వంటి రాజధాని రాదు… ఏబీఎన్ రాధాకృష్ణ శుష్క కవరింగులాగా వచ్చేతరం అనుభవిస్తుంది అనడానికి కూడా లేదు… పాత ల్యాండ్ పూలింగ్ సమస్యలే ఎక్కడివక్కడ ఏడుస్తున్నాయి, కొత్త పూలింగ్ అంటేనే ఆ రైతులు భయపడుతున్నారు… ఇది రియాలిటీ… పైగా గ్రీన్ ఫీల్డ్ రాజధాని అనేది కాన్సెప్టుపరంగానే లోపభూయిష్టం…
- నేనిక్కడ జగన్ ప్రతిపాదించిన మావిగన్ అనే మరో భారీ, బీభత్సమైన జోక్, పరిణతిరాహిత్యం, మీమ్స్ సరుకు గురించి ప్రస్తావించడం లేదు… సరే, ఓ ఉదాహరణలోకి వెళ్దాం…
రాజధాని అంటే కేవలం ఆకాశహర్మ్యాలు, అద్దాల మేడలు, అద్భుతమైన రోడ్లు మాత్రమే కాదు… అక్కడ నివసించే ప్రాణమున్న జనం… ఈ చేదుె సత్యాన్ని ఛత్తీస్‌గఢ్ రాజధాని ‘నవరాయ్‌పూర్ అటల్ నగర్’ నేడు ప్రపంచానికి చాటిచెబుతోంది…
రెండు దశాబ్దాల నిరీక్షణ… వెలవెలబోతున్న నగరం … 2006లో శ్రీకారం చుట్టిన నవరాయ్‌పూర్ ప్రాజెక్టుకు రెండు దశాబ్దాలు దాటినా, అది నేటికీ ఒక జీవం లేని నగరంగానే మిగిలిపోయింది… సుమారు 9 వేల కోట్లు ఖర్చు చేసి, 19,800 ఎకరాల్లో సకల హంగులతో సెక్రటేరియట్, అసెంబ్లీ, విల్లాలు, ఐటి పార్కులు నిర్మించినా అక్కడ జనం ఉండటానికి ఇష్టపడటం లేదు… 7,100 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా, వారంతా పాత రాయ్‌పూర్ నుంచే రాకపోకలు సాగిస్తున్నారు తప్ప, అక్కడ కాపురం ఉండటం లేదు… సాయంత్రం ఐదు దాటితే ఆ నగరం ఒక ‘ఘోస్ట్ టౌన్’ను (నిర్మానుష్య నగరం) తలపిస్తోంది…
అమరావతికి నేర్పే పాఠాలేమిటి? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలోనూ ఇదే తరహా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి… చంద్రబాబు నాయుడు అమరావతిని హైదరాబాద్‌తో పోలుస్తూ కాబోయే ‘విశ్వనగరం’ అని పిలుస్తుంటాడు… కానీ హైదరాబాద్ వందల ఏళ్ల చరిత్ర, సంస్కృతి, సహజ సిద్ధమైన వాణిజ్యంతో ఎదిగిన నగరం… కేవలం భవనాలు కడితే నగరం రాదు అనడానికి నవరాయ్‌పూర్ ఒక సజీవ ఉదాహరణ…
బర్మా రాజధాని ‘నేపిడో’ లాగే… నవరాయ్‌పూర్ కూడా ప్లాన్డ్ సిటీగా పేరొందినా, సామాన్యుడికి చేరువ కాలేకపోయింది… ఎంత ఖరీదైన విల్లాలు కట్టినా, ఎన్ని వేల కోట్లు కుమ్మరించినా ప్రజల జీవనశైలికి, వారి అవసరాలకు అనుగుణంగా నగరం లేకపోతే అది కేవలం ఒక ‘షో పీస్’గానే మిగిలిపోతుంది… అమరావతి కూడా కేవలం పాలకుల గ్రాఫిక్స్ కాకుండా, మనుషులు నడిచే, నవ్వుకునే, బతికే నగరంగా మారాలి… లేదంటే రాయ్‌పూర్ అనుభవం అమరావతికి ఒక చేదు జ్ఞాపకంగా మిగిలే ప్రమాదం ఉంది… నగరం అంటే నిర్మాణం కాదు… నివాసం…!
ముఖ్యాంశాలు…
– 20 ఏళ్ల తర్వాత కూడా రాజధాని కాదు కదా… కనీసం ఓ పట్టణస్థాయిని కూడా చేరలేదు.
– పొద్దున్న ఆఫీసు సమయానికి రావడం, సాయంత్రానికి మళ్లీ పాత రాయ్‌పూర్ కి పయనమైపోవడం… ఆఫీసు సమయాలు ముగిసిన తర్వాత కనీసం మనుషులు కూడా కనిపించడం కూడా గగనమే…
– మహారాజ కోటను తలపించేలా సచివాలయం… దానికి మహానది పేరు… ఆనుకుని హెచ్‌ఓడీలకు భవనం … దానికి మరో నది ఇంద్రావతి పేరు… చేరువలోనే విధానసభ భవనం కూడా…
ఆర్బీఐ, ఎన్ఐఏ, ఎన్టీపీసీ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి సంస్థల భారీ భవంతులు… దాదాపుగా 26 కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలు… ఐనా సిబ్బంది కూడా వచ్చి, పోవడమే తప్ప నవరాయ్‌పూర్ లో నివశించడానికి మొగ్గు చూపరు…
అత్యంత ఖరీదైన విల్లాలు… సీఎం, మంత్రుల నివాసాలు… సీఎం నివాసం సుమారు 3 ఎకరాల విస్తీర్ణం, ఒక్కో మంత్రికి దాదాపు ఎకరం స్థలంలో విశాలమైన భవనాలు… ఉన్నతాధికారుల నుంచి కింద స్థాయి సిబ్బందికి తగ్గట్టుగా భవనాలు…
అతి పెద్ద మానవ నిర్మిత జంగిల్ సఫారీ… పలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు… ప్రతిష్టాత్మక ఐఐఎం రాయ్‌పూర్, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిఫుల్ ఐటీ)… కళింగ యూనివర్సిటీ, దిల్లీ పబ్లిక్ స్కూల్… కానీ ఏం లాభం..? అందరూ పాత నగరం నుంచి వచ్చీపోయేవాళ్లే…
రెండు జాతీయ రహదారులను ఆనుకుని నగరం… ఎన్‌హెచ్ 43, ఎన్‌హెచ్ 53 కూడా రాజధానికి సమీపాన… రైల్వే లైన్ నిర్మాణం… పాత, కొత్త రాయ్‌పూర్ నగరాల నడుమ ఎయిర్‌పోర్ట్… పక్కా ప్లాన్డ్ సిటీ… అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్స్… ఎక్కడా ఒక్క కేబుల్ లైన్ కూడా బయటకు కనిపించదు…
తెచ్చిన అప్పులు కూడా తీర్చారు, అదిప్పుడు అప్పుల్లేని నగరం… రిసార్ట్స్, గోల్ఫ్‌కోర్స్ కూడా ఉన్నాయి… ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సిద్ధమయ్యింది… ఇటీవల రెండు మ్యాచ్ లు కూడా నిర్వహించారు…. ఇదంతా రియాలిటీ… మన సమీపంలోనే ఉన్న ఉదాహరణ… మళ్లీ చెప్పుకుందాం… లక్షల కోట్లతో రాజధాని రాదు… జనం రావాలి… అది రాత్రికిరాత్రి రాదు… రాదు..!!
Share this Article