ఆట అన్నాక ఎవరో ఒకరు గెలుస్తారు… ఒకరు ఓడిపోతారు… కానీ ఇండియా, పాకిస్థాన్ నడుమ ఆట అంటే… అదీ ఓ యుద్ధమే… అంత ఎమోషన్ ఆటకు ముందే ఆవరించిపోతుంది… ప్రత్యేకించి రెండు దేశాల్లోనూ క్రికెట్ అంటే పిచ్చి… మరిక రెండు దేశాల నడుమ మ్యాచ్ అంటే, ప్రతి బంతీ ఓ ఓ క్షిపణి… రెండు దేశాల్లో ఎక్కడా మ్యాచ్ నిర్వహించడానికి కూడా వీలు లేనంతగా దూరం… ఉద్రిక్తతలు ఎప్పుడూ…
ఏదో ఓ తటస్థ వేదిక దొరికినప్పుడు ఇక తప్పదు… పైగా టీ20 ప్రపంచ కప్… లీగ్ పోటీ అయినా సరే, ఆ మ్యాచ్‌కు ఎనలేని ఎమోషన్ తోడయింది… నిన్న పాకిస్థాన్, ఇండియా మ్యాచ్‌లో విజయం నిజంగా ఇండియన్ క్రికెట్ ప్రేమికులకు మరిచిపోలేనిది… అఫ్‌కోర్స్, పూర్తి భిన్నమైన దిశలో పాకిస్థాన్‌కు కూడా..! ఒక ఓడిపోయినట్టే అనుకున్న దశలో కోహ్లీ ఒక్కడే మ్యాచ్‌ను ఇండియా వైపు లాక్కొచ్చాడు.., కొన్నాళ్లుగా ఫామ్‌లో లేక నానా అవమానాల పాలవుతున్న తనను గెలిపించుకున్నాడు… ఇండియాను గెలిపించాడు…
నిజానికి ఈ మ్యాచులో చివరి ఓవర్ చాలాకాలం గుర్తుంటుంది… అదీ మనం చెప్పుకోదలిచింది కూడా… 19వ ఓవర్ చివరి రెండు బంతుల్లో రెండు సిక్సులు బాదిన కోహ్లీ మ్యాచును మునికాళ్లపై నిలబెట్టాడు… ఇక చివరి ఓవర్… అప్పటిదాకా కోహ్లీకి తోడుగా నిలబడి, బలమైన మద్దతునిచ్చిన హార్దిక్ ఔట్… ఒత్తిడిలో రాంగ్ షాట్… తప్పుపట్టలేం… కానీ విలువైన ఆరు బంతుల్లో ఒక బంతి వేస్ట్, పైగా ఓ వికెట్… కుదురుకున్న ఆటగాడు వెళ్తే, కొత్త ఆటగాడు వచ్చి షాట్లు కొట్టడానికి కష్టం… అసలే విపరీతమైన ప్రెజర్…
Ads
దినేష్ కార్తీక్ వచ్చాడు… ఓవర్‌లో రెండో బాల్… ఏదో ఆడాడు… సింగిల్… ఇంకా 15 రన్స్ కావాలి… 4 బాల్స్ ఉన్నయ్… కోహ్లీ స్ట్రయికర్… ఏదో మాయ చేస్తాడని స్టేడియంలో ఉన్న 60 వేల మంది ఇండియన్ క్రికెట్ ప్రేమికుల్లో ఆశ… కానీ ఎలా సాధ్యం..? ఎందుకు సాధ్యం కాదు..? ఇది క్రికెట్ కదా… కానీ ప్చ్, మూడో బాల్‌కు రెండు రన్స్ మాత్రమే వచ్చాయి… అంటే ఇక 3 బాల్స్‌లో 13 రన్స్ చేయాలా… వరుసగా నాలుగు ఫోర్లు కొట్టినా కుదరదు…
నాలుగో బాల్… ఇదే చాన్నాళ్లపాటు గుర్తుండేది… కోహ్లీ దాన్ని సిక్స్‌గా మలిచాడు… నవాజ్ నడుం ఎత్తుకు వేసిన ఈ బాల్‌ను అంపైర్ నో బాల్ అన్నాడు… పాకిస్థానీ కెప్టెన్‌లో బాబర్‌లో అసహనం… అంపైర్లతో సుదీర్ఘ వాదన… ఇప్పుడు ఈక్వేషన్ మారిపోయింది… ఫ్రీహిట్ చాన్స్… క్రీజులో కోహ్లీ భీకరమైన ఫామ్‌లో… కానీ వెంటనే ఓ వైడ్ బాల్… వేస్ట్ అయిపోయింది… కానీ ఆ ఫ్రీహిట్ చాన్స్ అలాగే ఉండిపోయిందిగా… ఆ బాల్‌కు కోహ్లీ క్లీన్ బౌల్డ్… కానీ ఆ బాల్ స్టంపులకు తగిలి దూరంగా వెళ్తుండటంతో వెంటనే కోహ్లీ అలర్టయ్యాడు… రన్స్ స్టార్ట్ చేశాడు… 3 రన్స్ చేశాడు…
ఇదీ వివాదానికి దారితీసింది… రెండు దేశాల్లోనూ ఒకటే చర్చ… ఫ్రీహిట్ బాల్ అయినా సరే, ఒకసారి స్టంప్స్‌కు తాకిందంటే అదిక డెడ్ బాల్ అవుతుంది… మరిక ఆ 3 రన్స్‌కు చెల్లుబాటు లేదు, సో, లెక్కలోకి కలపొద్దు అంటాడు పాకిస్థానీ కెప్టెన్… కామెంటరీల్లో ఇదే డిస్కషన్… ఓ రచ్చ చాలాసేపు… నిజానికి అంత సీనియర్ ప్లేయర్ కోహ్లీకి తెలియదా… చివరకు ఆ మూడు పరుగులు ఇండియా స్కోర్‌లో కలిశాయి… ఈక్వేషన్ ఇండియా వైపు మొగ్గింది…
ఆ మూడు రన్స్ ఎలా వేలీడ్ అవుతాయో కొన్ని ఇంగ్లిషు పత్రికలు రాసుకొచ్చాయి… మ్యాచ్ జరుగుతున్న మెల్‌బోర్న్ క్రికెట్ చట్టాల ప్రకారం… ఒక బాల్ వికెట్ కీపర్ లేదా బౌలర్ చేతిలోకి చేరిన తరువాతే డెడ్ బాల్ అవుతుంది… లేదా బౌండరీ దాటిపోతే…! ఇక్కడ ఫ్రీ హిట్ బాల్ కాబట్టి రనౌట్ అయితే తప్ప ఇక ఏరకంగానూ బ్యాటర్ ఔటయ్యే చాన్స్ లేదు… సో, స్టంప్స్‌కు బాల్ తగిలింది, కానీ ఫ్రీహిట్ కాబట్టి కోహ్లీ ఔట్ కాదు, అయితే స్టంప్స్‌కు దూరంగా వెళ్తున్న ఆ బాల్ తిరిగి వికెట్ కీపర్ చేతికి వచ్చేలోపు మూడు రన్స్ చేసేశారు… సో, వాటికి వేలిడిటీ ఉన్నట్టే…
తరువాత బాల్‌కు మరో వికెట్… దినేష్ కార్తీక్ ఔట్… చివరకు చేయాల్సిన ఆ రెండు రన్స్ పైనా ఉత్కంఠే… కొత్తగా వచ్చిన రవిచంద్ర అశ్విన్ ఒక రన్ చేస్తే స్కోర్ సమం… ఈ స్థితిలో వైడ్ బాల్ రావడంతో వదిలేశాడు… కష్టపడి ఆడకపోయినా సరే, రన్ వచ్చేస్తుంది కదా… దీంతో స్కోర్లు సేమ్… ఆ తరువాతి బాల్‌కు రన్ తీశాడు… ఇండియా గెలిచింది… ఇదీ ఆ చివరి ఓవర్ కథ… ప్రతి బాలూ ఓ మ్యాచ్‌తో ఈక్వల్… మొమెరబుల్ ఓవర్… చాలా ఏళ్ల తరువాత…!!
Share this Article