Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రిటైర్ కాగానే బయటికొచ్చేసి… ఓ లోకల్ రైలు ఎక్కి ఇంటికెళ్లిపోయాడు…

December 22, 2020 by M S R

Bhandaru Srinivas Rao…….  ఒక జడ్జి పదవీ విరమణ – కొత్తగా చెప్పుకోవాల్సిన ఓ పాత కథ…


జస్టిస్ చంద్రు చెన్నై హైకోర్టులో చాలాకాలం జడ్జిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన్ని గురించిన నాలుగు మంచి మాటలు చెప్పుకునే ముందు మరో విషయం ప్రస్తావించడం అసందర్భం ఏమీ కాబోదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ వి.వి.రావు ఒక సంచలన వ్యాఖ్య చేశారు. దేశవ్యాప్తంగా న్యాయస్తానాలలో మూడు కోట్లకు పైగా కేసులు పరిష్కారానికి నోచుకోకుండా పేరుకుపోయివున్నాయనీ, ఇవన్నీ ఓ కొలిక్కి రావాలంటే 300 సంవత్సరాలకు పైగా పడుతుందనీ జస్టిస్ రావు చెప్పారు. ఆయన చెప్పింది అక్షరసత్యమే కావచ్చు కాని, జస్టిస్ చంద్రు వంటి న్యాయమూర్తులు మరికొందరు వుండి వుంటే, బహుశా కేసుల పరిష్కారానికి అంత సమయం అవసరం పడేది కాదేమో! ఎందుకంటే కేసుల పరిష్కారం విషయంలో జస్టిస్ చంద్రు నెలకొల్పిన రికార్డు అలాటిది మరి. న్యాయమూర్తిగా ఆయన అక్షరాలా యాభై నాలుగు వేల కేసులను పరిష్కరించారు. భారత న్యాయస్తానాల చరిత్రలో ఇదొక అరుదయిన రికార్డు.

సరే! విషయానికి వద్దాం. ఏదయినా ఉద్యోగంలో వున్న వ్యక్తి యెంతటి సమర్ధుడైనా సరే, ఏదో ఒకనాడు పదవీ విరమణ చేయక తప్పదు. జస్టిస్ చంద్రుకు కూడా ఆ రోజు వచ్చింది. మామూలుగా ఇలాటి సందర్భాలలో కొన్ని సంప్రదాయాలు వుంటాయి. న్యాయమూర్తి ఎవరయినా రిటైర్ అవుతున్నప్పుడు కోర్టులోనే అధికారికంగా ఒక వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేస్తారు. ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ వగైరా హాజరవుతారు. వీడుకోలు ప్రసంగాలు చేస్తారు. పుష్పగుచ్చాలు అందచేస్తారు. తేనీటి విందు జరుగుతుంది. అందరూ కలసి ఫోటో దిగుతారు. వీలునుబట్టి, ఆ సాయంత్రం ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వీడ్కోలు విందు ఏర్పాటుచేస్తారు.

కానీ జస్టిస్ చంద్రు తరహానే వేరు. అందువల్ల ఆయన పదవీ విరమణ ఆయన పద్దతిలోనే జరిగింది. ఏడేళ్ళపాటు జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యేముందు ఆయన ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయవద్దని అందులో ముందుగానే అభ్యర్ధించారు.

ఒక జడ్జి నిరాడంబరంగా పదవీ విరమణ చేయడం ఎన్నడూ జరగలేదా అంటే జరిగింది. కానీ ఎప్పుడూ? మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు 1929లో జరిగింది. ఆరోజుల్లో జస్టిస్ జాక్సన్ నాటి అడ్వొకేట్ జనరల్ తో చెప్పారు. ‘నా రిటైర్ మెంటు విషయంలో అనవసరమైన హడావిడి ఏమీ చేయవద్దు. నా విధులు నేను నిర్వర్తించాను. వీడ్కోలు ఇవ్వాల్సిన అవసరం ఏమి వుంది?’ మళ్ళీ ఎనభై రెండేళ్ళ తరువాత జస్టిస్ చంద్రు అలాటి నిర్ణయం తీసుకోగలిగారు.

2013, మార్చి ఎనిమిది, శుక్రవారం.

జస్టిస్ చంద్రు రోజుమాదిరిగానే కోర్టుకు వచ్చారు. తన ఆస్తిపాస్తుల వివరాలను స్వచ్చందంగా తెలియచేస్తూ ఒక డాక్యుమెంటును ప్రధాన న్యాయమూర్తికి అందచేసారు. తరువాత తన చాంబర్స్ కు వచ్చి అవసరమైన కొన్ని పత్రాలపై సంతకాలు చేశారు. మీడియా మిత్రులతో కూర్చుని తేనీరు సేవిస్తూ కొద్దిసేపు ముచ్చటించారు. రిటైర్ అయినరోజున కూడా ఆయన అధికారిక వాహనాన్ని వాడుకోలేదు. అన్నిసంవత్సరాలుగా వెన్నంటివున్న డఫేదారునూ వెంట తీసుకోపోలేదు.

తరువాత హై కోర్టు బయటకు వచ్చి నడుచుకుంటూ సుభాష్ చంద్రబోస్ రోడ్డు దాటి అక్కడవున్న సంగీత రెస్టారెంటులో మిత్రులతో కాఫీ తాగుతూ ముచ్చట్లు చెబుతూ గడిపారు. ఆ పిదప, బీచ్ రోడ్డు స్టేషన్ కు వెళ్ళి వేలాచెర్రి వెళ్ళే ఎం.ఆర్.టీ.ఎస్. లోకల్ ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయారు.

న్యాయమూర్తిగా వున్నప్పుడు కూడా జస్టిస్ చంద్రు ఉద్యోగంతోపాటు వచ్చే హంగులు ఆర్భాటాలకు దూరంగానే వుంటూ వచ్చారు. సాధారణంగా న్యాయమూర్తులు తమ చాంబర్ నుంచి కోర్టు హాలుకు వెళ్ళేటప్పుడు యూనిఫారం ధరించిన బిళ్ళ బంట్రోతు దండం ధరించి ముందు నడుస్తూ వెళ్లడం ఆనవాయితీ. జస్టిస్ చంద్రు దీనికి స్వస్తి చెప్పారు. తన అధికారిక వాహనానికి యెర్ర దీపం ఏర్పాటు తీసేయించారు. సెక్యూరిటీ సిబ్బందిని అవసరంలేదని చెప్పి వాపసు పంపేసారు. ఇంటివద్ద పనులకోసం బంట్రోతులను వాడుకోలేదు.

చెన్నై హైకోర్టులో జస్టిస్ చంద్రు చాంబర్ ముందు ఒక బోర్డు మీద ఇలా రాసివుండేది.

“పూలు,బొకేలు పట్రాకండి – నేనేమీ రాజకీయ నాయకుడిని కాను

ఆకలితో లేను – కాబట్టి పళ్ళూ మిఠాయిలు తేకండి

చలితో గడగడలాడిపోవడం లేదు – శాలువల అవసరం ఏమీ లేదు

అలా అని మీనుంచి నేనేమీ ఆశించడంలేదనుకోకండి.

లోపలకు వచ్చేటప్పుడు శుభాశీస్సులు పట్టుకురావడం మాత్రం మరచిపోకండి.”

బహుశా ఇప్పుడాబోర్డు అక్కడ వుండి వుండదు. దాని అవసరం కూడా వుండకపోవచ్చు.

(09-04-2013)

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘మా ముసలాయన చెప్పినట్టు వినడం లేదు… కాస్త గట్టిగా బెదిరించండి ఆయన్ని…’’
  • ఈ ఐదు తాజా పాజిటివ్ ట్రెండ్స్… ఓ కొత్త భారతాన్ని చూపిస్తున్నయ్…
  • ఛిఛీ… ఓ సమాజ ఉద్దారకుడిని లోకం అర్థం చేసుకునే తీరు ఇదేనా..?!
  • విధేయత..! రాజకీయాల్లో ఏమాత్రం అర్థం లేని ఓ డొల్లపదం అది..!!
  • హమ్మయ్య… RRR చూశాక ఆ చింత కూడా తీరిపోయింది… చదవాల్సిన రివ్యూ…
  • ఖర్మ కాలడం అంటే ఇదే… జైలులో సిద్ధూ సెల్‌మేట్ ఎవరో తెలుసా..?!
  • దీన్నే ‘డర్టీ జర్నలిజం’ అంటారా..? ఆంధ్రజ్యోతి ‘పె-ద్ద-లు’ చెప్పాలి…!!
  • కామెడీ షోయా..? డాన్స్ షోయా..? మ్యూజిక్ షోయా..? ఎవడుర భయ్ ప్లానర్..!!
  • సెట్లు లేవ్… మేకప్పుల్లేవ్… విగ్గుల్లేవ్… పాటల్లేవ్… బీజీఎంలో మూడే వాయిద్యాలు…
  • ఓహో… బీసీ కృష్ణయ్య ఎంపిక వెనుక అంత రహస్య ప్రణాళిక ఉందా..?!

Archives

Copyright © 2022 · Muchata.com · Technology Support by CultNerds IT Solutions