.
న్యాయవ్యవస్థలో అవినీతి అనేది ఇప్పుడు దేశమంతా చర్చనీయాంశం… ఢిల్లీ హైకోర్టు జస్టిస్ వర్మ ఇంట్లో కాలిన కరెన్సీ కట్టలు దొరికిన ఉదంతం అందరికీ తెలిసిందే కదా…
న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలు అన్నీ సుప్రీంకోర్టు కొలీజియం పరిధిలోనివే… చివరకు అవినీతి ఆరోపణలు వస్తే విచారణలు కూడా దాని వంతే… అంతేతప్ప కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు… సంపూర్ణ స్వయంప్రతిపత్తి… ఇదీ ఇప్పుడు చర్చనీయాంశం…
Ads
తనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు… అక్కడి బార్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది… అసలు అవినీతి నిరూపణ జరగకుండా బదిలీ దేనికి..? ఒకవేళ ఏదో జరిగింది, నిగ్గు తేలుద్దాం అనుకుంటే సస్పెన్షన్‌లో పెట్టొచ్చు కదా నిజం ఏదో తేలేవరకు…? ఏ కేసులూ అప్పగించవద్దు అనే ఆదేశాలకు బదులుగా..!! అసలు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఈ కేసును ఎందుకు అప్పగించకూడదు..? సరే, ఈ ప్రశ్నలు ఇప్పట్లో తేలవు గానీ…
న్యాయవ్యవస్థలోని అవినీతి అప్పుడప్పుడూ చర్చనీయాంశం అవుతూనే ఉంది, ఇదేమీ కొత్త కాదు… ఈ సందర్భంగా జస్టిస్ సి.ఎస్.కర్ణన్ ఉదంతం మళ్లీ చర్చల్లోకి వస్తోంది…
జస్టిస్ సి. ఎస్. కర్ణన్.., ఒక హైకోర్టు జడ్జిగా ఉంటూనే తన కోర్టులో కనిపిస్తున్న కులవివక్ష మీద పోరాడాడు… ఆ వివాదాలు పెరిగి, తరువాత కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యాడు… 2017 జనవరిలో ప్రధానికి ఓ బహిరంగ లేఖ రాశాడు… అందులో 20 మంది సిట్టింగ్, రిటైర్డ్ సుప్రీం, హైకోర్టు జడ్జిల పేర్లను పేర్కొంటూ అవినీతి ఆరోపణలు చేశాడు…
అప్పట్లో అది ఓ సంచలనం… న్యాయవ్యవస్థకు ఓ కుదుపు… ఇది ప్రారంభ జాబితా మాత్రమే అన్నాడు ఆయన తన లేఖలో… ఈ ఆరోపణలకు ఆధారాలు లేకపోవడం, ఆయన వ్యవహార శైలి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీస్తుందని సుప్రీం కోర్టు భావించింది…
ఆయనను తన విధుల నుండి తొలగించి, వైద్య పరీక్షలకు హాజరు కావాలని ఆదేశించినప్పుడు, కర్ణన్ ఆ ఆదేశాలను పాటించలేదు… పైగా ఆయన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జె. ఎస్. ఖేహర్‌తో సహా ఏడుగురు న్యాయమూర్తులకు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించాడు…
దీంతో సుప్రీంకోర్టు కోర్టు ధిక్కారం కింద ఆరు నెలలు జైలు శిక్ష విధించింది… ఇది ప్రకటిస్తున్నప్పుడు కర్ణన్ ఇంకా సర్వీసులోనే ఉన్నాడు… తరువాత తన పదవీ విరమణయ్యాక బెంగాల్ పోలీసులు తనను అరెస్టు చేసి కలకత్తా జైలుకు తరలించారు… ఆరు నెలల జైలుశిక్ష అనుభవించాడు ఆయన…
ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కే శిక్ష విధించడం, తన వ్యక్తిగత పోరాటం మాటెలా ఉన్నా… న్యాయ వ్యవస్థలోని అంతర్గత సమస్యలపై, కులవివక్షపై, అవినీతిపై తను దేశవ్యాప్తంగా ఒక చర్చను లేవనెత్తడం నిజం… ప్రస్తుతం జస్టిస్ వర్మ కేసు అందుకే ఆ పాత కర్ణన్ తాలూకు వివాదాల్ని గుర్తుకు తెస్తోంది…
తనకు మానసిక స్థిరత్వం లోపించిందని అప్పట్లో కొందరు విమర్శించారు… తను న్యాయ వ్యవస్థ అంతర్గత సమస్యలు, అవినీతి, కులవివక్షపై పోరాడిన పద్ధతి చాలామందికి నచ్చకపోవచ్చు… కానీ తను లేవనెత్తిన న్యాయవ్యవస్థ అవినీతి ఇప్పటికీ చర్చనీయాంశమే అవుతోంది కదా…
(జైలు శిక్ష అనంతరం బయటికి వస్తున్న జస్టిస్ సీఎస్ కర్ణన్)
Share this Article