వరల్డ్ ఇడ్లీ డే… 30 మార్చి… అసలు ఎవరు స్టార్ట్ చేశారు దీన్ని..? పేరు ఎనియావన్… కోయంబత్తూరుకు చెందిన ఈయన ఎనిమిదో తరగతి డ్రాపవుట్… పూర్ ఫ్యామిలీ… కుటుంబం గడవటానికి మొదట్లో టీ షాపుతో పనిచేసేవాడు… తరువాత ఆటో నడిపించుకునేవాడు… ఓరోజు చంద్ర అనే మహిళ కలిసింది… ఆమె రోజూ 250 ఇడ్లీలను హోటళ్లకు సరఫరా చేసేది… ఈ ఇడ్లీల చేరవేత ద్వారా ఎనియావన్‌కు ఓ పని చూపించింది ఆమె…
రెండు… రెండే రెండు ఇడ్లీ కుక్కింగ్ బాక్సులతో చెన్నై వచ్చాడు ఎనియావన్ 1997లో… చెన్నై హోటళ్లకు, కేటరర్స్‌కి ఇడ్లీలు సప్లయ్ చేసేవాడు… (ఔట్ సోర్సింగ్ పని)… అంతా సజావుగా సాగిపోతే ఎలా మరి..? ఓరోజు పొద్దున లేవగానే తన ఇడ్లీ పిండి వర్షపునీటిలో తేలుతూ బయటికి పారుతోంది… దాంతో ఆరోజు ఇడ్లీలు సప్లయ్ చేయలేకపోయాడు… పని బంద్, కంట్రాక్టు బంద్…
కడుపులో ఎలుకలు, చేతిలో పనిలేదు, తినడానికి తిండి కరువు… 20 రాత్రిళ్లు ప్లాట్‌ఫాం మీదే పడుకుని ఏం చేయాలా అని ఆలోచించేవాడు… మెల్లిగా ఒక కేటరర్ దొరికాడు, మళ్లీ ఇడ్లీల సప్లయ్ మొదలుపెట్టాడు… వేర్వేరే కేటరర్స్ దొరికారు, పని పెరిగేకొద్దీ తన కిచెన్ విస్తరిస్తూ పోయాడు… వేల ఇడ్లీలు… ఓరోజు హఠాత్తుగా ఓ ఆలోచన స్పురించింది…
Ads
ఇడ్లీలు గుండ్రంగానే ఎందుకు ఉండాలి..? డిఫరెంట్ సైజుల్లో, డిఫరెంట్ రూపాల్లో ఉంటే తప్పేమిటి..? తినేవాళ్లకు కొత్తకొత్తగా ఉంటుంది కదా… ఎప్పుడూ ఒకేరకం ఇడ్లీ తినీతినీ విసుగు రాదా..? ఇలా ఆలోచించి డిఫరెంట్ రూపాల్లో ఇడ్లీలు చేయడం మొదలుపెట్టాడు… తరువాత ఫ్లేవర్స్ మార్చాడు, ఇంగ్రెడియంట్స్ మార్చాడు… రాగి ఇడ్లీ, రసం ఇడ్లీ, కేకుల్లాంటి ఇడ్లీ… ఇలా కొత్త కొత్త ప్రయోగాలు స్టార్ట్ చేశాడు… మొత్తం ఎన్నిరకాల ఇడ్లీలు చేశాడో తెలుసా..? అక్షరాలా 2547 రకాల ఇడ్లీలు రుచికరంగా వండి చూపించాడు… వావ్ కదా…
ఇడ్లిని మనసారా స్మరించుకుని, సెలబ్రేట్ చేసుకోవడానికి మార్చి 30వ తేదీ ఎంపిక చేసుకుని, ఏటా ఇడ్లీ డే నిర్వహించసాగాడు… అదే క్రమేపీ వరల్డ్ ఇడ్లీ డే అయిపోయింది… పేరుకు ఇది సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్… కానీ మన జనంతోపాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది… చెన్నైలో ఓ ప్రముఖ ఇడ్లీ రెస్టారెంట్ తన అడ్డా… అక్కడ 50 నుంచి 60 మంది పనిచేస్తుంటారు… పూర్ ఫ్యామిలీ నేపథ్యం నుంచి వచ్చినవారికి గంటలవారీ ఉపాధిని కూడా చూపించేవాడు…
తన ఇడ్లీ జర్నీలో కనీసం 150 అవార్డులు కొట్టేశాడు… ఎప్పుడూ అదే ధ్యాస… కొత్తరకం ఇడ్లీ ఇంకేం చేయాలి..? 124.8 కిలోల భారీ ఇడ్లీ తయారు చేసి గిన్నీస్ బుక్‌లోకి కూడా ఎక్కాడు… బాగుంది కదా ఇడ్లీ మ్యాన్ జర్నీ… ప్రస్తుతం తన వయస్సు ఇంకా 49 ఏళ్లు మాత్రమే… సో, ఇంకొన్నిరకాల ఇడ్లీలు కూడా తన రెస్టారెంటులో చూడబోతున్నామన్నమాట… అవునూ, ఆయన తయారీ రకాల్లో పొట్టెక్కలు, గ్లాస్ ఇడ్లీలు, ప్లేట్ ఇడ్లీలు గట్రా ఉన్నాయో లేదో… ఓసారి మన ఆంధ్రా, మన్యం ప్రాంతాల్లో తిరిగితే… ఈజీగా తన కస్టమర్లకు ఇంకొన్ని కొత్త రుచులు చూపించగలడు కదా…!!
Share this Article