Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అడవి సమస్తం శిగమూగే అద్భుత కాంతార ఇది… లక్షల స్త్రీలు దేవతలవుతారు…

October 19, 2022 by M S R

Kandukuri Ramesh Babu………  #కాంతారా #మేడారం #సామాన్యశాస్త్రం  శిగమూగే దేవత…. ‘కాంతారా’ చిత్రం గురించిన అనేక సమీక్షలు చదువుతుంటే ‘మేడారం ఒక దేవత, కనువిప్పు’ పేరిట రాసిన వ్యాసం పంచుకోవాలనిపించింది…. విశ్వాసాల ఆధారంగా దైవత్వం ప్రధానంగా ఒక కళా రూపం నేపథ్యంలో ఆ సినిమా చిత్రించినట్లు చదువుతుంటే ఈ వ్యాసం పంచుకోవాలి అనిపించింది. అలాగే మన దగ్గర కథలను తీసుకుని దర్శకులు అద్భుతమైన సినిమాలు తీయడంలో ఎందుకు విఫలం చెందుతున్నరని కూడా చర్చిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాసం ఎందుకైనా పనికి రావొచ్చు. సినిమా త్వరగా చూడాలి!



మేడారం వైభవం గురించి అర్థం చేసుకోవడానికి రెండు విషయాలు చెప్పుకుంటాం. ఒకటి, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆదివాసీ గిరిజన జాతర అంటాం. రెండవది, భారతదేశంలో కుంభమేళా తర్వాత అంత పెద్ద సంఖ్యలో దాదాపు రెండు కోట్ల మంది భక్తులను ఆకర్శించే జాతరగా చెబుతాం, ‘తెలంగాణ కుంభ మేళా’గానూ అభివర్ణిస్తాం. ఐతే, ప్రతి రెండేళ్లకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఒరిస్సా, మధ్య ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కారణంగా మేడారం జాతర బహు విస్తీర్ణం పెద్దది. అలాగే, సంప్రదాయ దృష్టిలో ‘ఇసుక వేస్తే రాలనంత జనం’ ఉండటం వల్ల కూడా ఈ రెండు విశేషణాలు జాతర వైభవాన్ని చెబుతాయనే ఎవరమైనా అనుకుంటాం. కానీ అవి రెండూ చాలా చిన్న విషయాలు.

అసలు మేడారంలో జరిగే వ్యవహారం ఒక ‘గుట్టు’ వంటిది. అది సాధారణ దృష్టికి చూస్తే కనిపించదు. మామూలు వినికిడికి అందదు. వినిపడదు. చాలా జీవన వ్యాపారం జరుగుతుందక్కడ. అంతుపట్టని ఒక ఆవాహనకు ఆధీనం మేడారం. అందుకు ఇరుసు స్త్రీ. ఆమె దేవత. మేడారాన్ని ఆవహిస్తుంది. కనీసం నాలుగు ఘట్టాలు చూడాలి. అదంతా మహిళావరణం. దాన్ని చూడకుండా, వినకుండా ఎవరూ రావోద్దనే ఈ ఉపోద్ఘాతం, గ్రంధమూ.

Ads

ఒకటి, మేడారం చేరకముందు, కనీసం ఐదారు కిలోమీటర్ల ముందు నుంచే భక్తుల్లో ఒక తాదాత్మ్యత. అది చిన్నగా మొదలై ఆ స్థలానికి చేరుకుంటూ ఉండగా ఒక లోలకం తన చుట్టూ తాను తిరుగుతూ ఎట్లయితే లయాత్మకంగా ఊగుతుందో అలా మహిళలు, వారి ఆత్మలు అమ్మవారు ఆవహిస్తూండగా అలా పరిభ్రమిస్తూ తూలుతాయి. భక్తుల్లో ఆ అలజడి ప్రయాణీకుల స్థాయి నుంచే మొదలవడం ఒక విస్మయం కలిగించే వాస్తవం. ప్రతి ఎడ్లబండి, ట్రాలీ, వ్యాను, ట్రాక్టరూ, బస్సు – ఒక అంతుపట్టని శక్తికి లోబడటం కానవస్తుంది. భక్తులు ఆ ఎర్రమట్టి నేలలో కాలిడక ముందే ఒక అపారమైన చేతనావృతం ఇంతితై పెరుగుతూ అంతకంతకు విస్తీర్ణంగా పరివ్యాప్తం చెందటం చూస్తాం. అది మేడారం మొదటి మెట్టు. దృశ్యం.

మొదటిరోజు సుదూర ప్రాంతాల నుంచి సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజు గద్దెలను చేరుకుంటారు. వేర్వేరు చోట్ల నుంచి ఆ ముగ్గురూ మేడారం చేరుకోవడం అన్నది నిదానంగా సద్దుమణిగే దృశ్యం. ఆ మరుసటి రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెల వద్దకు చేరడం అన్నది అసలు గాథ.

ఆదివాసీ పూజారులు ఎర్రటి దుస్తుల్లో కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను చిలకల గుట్ట నుంచి తీసుకు వస్తుంటే కనీసం కిలోమీటరు పొడవునా ఒక ప్రవాహం. నిస్సందేహంగా దారికి అటూ ఇటూ ఒక తాండవం. అది బీకరం. దాన్ని భక్తుల పారవశ్యం అనడం చిన్న మాట. శివాలూగే ఆ జీవశక్తిని కళ్ళారా చూడటం మొత్తం మేడారం జాతరలో అద్వితీయం ఘట్టం. నిజానికి అది ఎదురుకోళ్ళ ఘట్టం. సమ్మక్కను ఎదుర్కొంటూ అడుగడుగునా కోళ్ళు, మేకలు, గొర్రెలు తెగిపడుతుంటే, అడవికి జన సంద్రానికీ మధ్య ఏర్పడే ఆ వంతెనలో మానవ మాత్ర శక్తితో నిలబడటం ఎంతో కష్టం. మనిషి దేవతను ఆవహించుకోవడం లేదా దేవత మనిషిని ఆవహించడం అంటే ఏమిటో చూడటానికి అక్కడ కళ్ళు మాత్రమే కాదు, సమస్త దేహమూ పంచేద్రియాలతో ఆ ఘడియలో అప్రమత్తంగా ఉండవలసిందే.

ప్రతి మహిళా సమ్మక్క అవడం అక్కడి విశేషం. శిగమూగుతూ అమ్మవారిని ఆహ్వానిస్తూ ఉండే ఆ మహిళలు, వారిని పట్టుకోలేక ఆశక్తులవుతూ ఉండే పురుషులు, అంతా ఒక జన సముద్రం ఒక్కపరి పోటెత్తి ఉప్పొంగే ఆ వాతావరణం చూడటానికీ ఎంతటి భీతావహంగా ఉంటుందీ అంటే దుర్భల మనస్కులు చూడక పోవడమే ఉత్తమం.

ఇక మూడవది, జంపన్న వాగు. సమ్మక్క సోదరుడు జంపన్న రక్తం చిందించిన ఆ నేలనే వాగైంది. అక్కడే తల నీలాలు సమర్పిస్తారు. ఇక్కడ పిల్లాజెల్లలతో కుటుంబాలు కుటుంబాలు పవిత్ర స్నానం ఆచరిస్తారని మాత్రం అనుకుంటే పొరబాటు. కాస్త జాగ్రత్తగా చూస్తే, ఇక్కడి జలంలో జీవం పలు ప్రశ్నలై, తగు సమాధానాలై ఎగిసి సద్దుమణుగడం ఒక రంగం. అకస్మాత్తుగా కుటుంబంలోని ఒక మహిళ సమ్మక్క అవుతుంది. మొత్తం సభ్యులందరి మంచి చెడ్డలు విని, విచారించి, పరిష్కరించే దేవతా మూర్తిగా మారుతుంది. కొడుకైనా కోడలైనా, సోదరుడైనా భర్త అయినా, కాళికలా అరుదెంచిన ఆ తల్లి మాట శిరసా వహించవలసిందే. తమలోని ఒకరే తమకు మార్గదర్శకత్వం వహించే స్థితిలో జంపన్న వాగాంత ఒక నూతన అవతారంగా శాసనమై పోటెత్తడం దర్శించవలసిందే తప్ప మాటల్లో వర్ణించలేం. ఒక్క మాటలో జప్నన్న వాగు ఒక మాతృక…

ఒక్కో కుటుంబం నుంచి ఒకరు అలా ప్రతినిధిగా మారడం అంటే ప్రతి వంశ వృక్షం నుంచి ఒక మాతృక అవతరించడమే. మాతృకగా మారిన యావత్తు యావత్తూ ఏండ్లుగా తమను పట్టి వేధిస్తున్న సమస్యలన్నిటినీ ఏకరువు పెట్టే శాసన సభ అవడం, ఒక పరిష్కార కేంద్రంగా మారడం, అదొక ప్రకటిత శాసన సభగా నిలవడం నాలుగు రోజుల మేడారం జాతరలో నిశ్శబ్దంగా సాగే విప్లవం. అసామాన్య శక్తితో శిగమూగే ఆ సమ్మక్క తల్లి కుటుంబ సభ్యుల సమస్త సమస్యలకు పరిష్కారం చెప్పడం గనుక శ్రద్దగా వింటే, ఇంట్లోని గుట్టంతా అక్కడ బహిర్గతమై ఒకానొక మార్గదర్శకత్వంతో తిరిగి సద్దుమణుగడం గమనిస్తాం. నేడు పిత్రుస్వామికంగా మారిన లోకమంతా అక్కడ, ఆ వాగులో అనివార్యంగా మాతృస్వామికంగా మారిపోవడం, సమ్మక్క మాట జవదాటని కట్టడిలోకి మారడం నేటి ఆధునిక మానవుడి అనాది వైచిత్రి. మేడారంలోనే కానవచ్చే మహిమ.

ఈ ఘట్టం సద్దుమణిగాక జంపన్న వాగు నుంచి ముడుపులు, మొక్కులు చెల్లించేందుకు నెత్తిమీద బెల్లంతో కుబుంబాలన్నీ గద్దెల వద్దకు కదులుతాయి, అటు తర్వాత మరో నాలుగో ఘట్టం. అది నిజానికి ప్రతి డేరాలో కనిపిస్తుంది. ముఖ్యంగా చీకటి పడుతుంటే ఎడతెగకుండా వినవస్తుంది. దాన్ని పంచుకునే ముందు మరో సంగతి అర్థం చేసుకోవాలి.

నిజానికి మేడారం జాతర మొత్తంగా స్త్రీ కేంద్రకం అనాలి. ప్రతి మహిళా ఇక్కడ సమ్మక్క సారలమ్మ అవడం విశేషం. పురుషులు కేవలం నిమిత్త మాత్రులే. ఒక రకంగా తెలంగాణలో బతుకమ్మ, బోనాల పండుగల్లో ఎట్లయితే మగవాళ్ళు స్త్రీలకు సహకారంగా ఉంటారో ఇక్కడా అటువంటిదే కనిపిస్తుంది. ఒక్క మాటలో మనలోని అజ్ఞాత సమ్మక్క సారలమ్మలు పూనడం, అక్కడికి వచ్చి ఊరేగడమే ఈ మేడారం జాతర విశేషం అనాలి. అంతా ఒక దివ్యానుభవం.

ఇక, చెప్పవలసిన నాలుగో విశేషానికి వద్దాం. మేడారం జాతర సాగే నాలుగు రోజులూ ఒక గొడగొడ దుఖం మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది. అవును. ప్రతి బిడారంలో వదినా యారాళ్ళు, అత్తా కోడళ్ళు, ఆడబిడ్డలు – ఒకరిని ఒకరు పట్టుకొని, అది శిగాలూగడం కూడా కాదు, అది ఎట్లా ఉంటుందీ అంటే, తమలోని గూడు కట్టుకున్న వేదనను హత్తుకుని వారంతట వారే మెల్లగా ఎగదోసుకునేలా ఉంటుంది. ఉండబట్టలేక తోసుకువచ్చే దుఖం ఎల్లలు లేకుండా వ్యక్తమయ్యేలా ఉంటుంది.
KANTARA
ఒక శాఖను ఇంకో శాఖ అల్లుకుని, అట్లా శాఖోపశాఖలుగా స్త్రీ దేహం అపరిమిత దుఖంతో ఒదార్చుకోవడం కానవస్తుంది. బెంగటిల్లిన తనమంతా తనవితీరా, ‘పురాత’ పంచుకునేలా సాగుతుంది. అంతు తెలియని దుఖం, రంది, నిద్రపట్టనీయని బాధ అంతా సుదీర్ఘంగా రోదిస్తున్నట్టు ఉంటుంది. మనిషిని మనిషి పట్టుకుని, అలిమిచ్చుకుని తనవితీరా ఏడ్వటమే కదా అనిపిస్తుంది గానీ వారంతా అలా చీకటి పడుతుంటే మొదలై రాత్రంతా రోదిస్తూ ఉండటం అన్నది ఒక థెరపి. ఎన్నో రకాలుగా తల్లడిల్లే ఆ కుటుంబ వృక్షం మెల్లగా దుఖసాగారమై తేటపడటం ఈ నాలుగు రోజుల విశేషం అని చెప్పాలి.

మీరు ఎక్కడ పడుకున్నా చెవొగ్గి వింటే లీలగా నిద్రలేపే ఆ సామూహిక అంతరంగ రోదన ఒకటి ప్రతి గుడారం నుంచి లేచి మొత్తం మేడారం అంతటా పరివ్యాప్తమై, సమస్త పంచభూతాలలో లుప్తమవుతుంది. ఇది కదా అసలైన స్వాంతన అని తెలుకోవడంతో మనం దర్శనం ముగుస్తుంది.

నిజానికి మేడారం లోవెలుపలా ఒక సముద్రంగా మారుతుంది. అందులో బడబాగ్ని ఒకటి జ్వలించి సద్దుమణుగుతుంది. అది శాంతించేదాకా వదిలిపోదు. సరిగ్గా ఈ నాలుగు రోజులు ప్రతి స్త్రీ మరో స్త్రీని కడుపారా కావలించుకుని ఏడుస్తారు. నవ్వుతారు. ఆ నవ్వులో ఒక వర్ణించలేని శోభ, సొందర్యం ఉంటుంది. ఎవడూ నిలపలేని ఒక వికట్టహాసమూ ఉంటుంది. ఎదిరింపూ, ధిక్కారం ఉంటుంది.

గొప్ప ఆత్మగౌరవం కానవస్తుంది. మనిషి ప్రకృతిగా, దేవతగా మారి జూలు విదిల్చడం, తిరిగి శాంతించే మహోగ్ర రూపకం ఒకటి అక్కడ చూస్తుండగానే పురుడు పోసుకుని లేచి తీవ్ర స్థాయిలోకి చేరి పిమ్మట మెలమెల్లగా అదృశ్యమవడం ఈ జాతర విశేషం. నిజానికి ఏ ఆధునిక వైద్యం, మానసిక చికిత్సా ఇవ్వని స్వాంతన ఎదో, మన ఇంగితానికి అందని థెరపి ఏదో ఈ ఆదివాసీ గిరిజన జాతర ఇస్తున్నాదా అనిపించక మానదు. తినడం, తాగడం అన్నది పైన చెప్పినట్టు, నిలువెల్లా వ్యక్తమయ్యే యాతనకు కాస్త ఉపశమనం తప్ప మరేమీ కాదు.

చెట్టుపుట్టల నుంచి చీమలబారులు నడిచొచ్చినట్టు మేడారం రెండేళ్లకొకసారి జనవనం అవుతుంది. నాలుగు రోజుల అనంతరం తిరిగి దేవతలు వనప్రవేశం చేయడంతో సమస్త మానవ బలగాలు ఆదిమ వాసులుగా తిరిగి సజీవమై తిరుగుముఖం పడుతారు. ఇదంతా ఒక ఆవాహన. ఆధునికత, అభివృద్ధి అన్న నాణానికి మరో పక్కన రూపుగట్టే బొమ్మ. చిత్తు వెనకాలి బొత్తు. జీవితకాలం మరచిపోలేని ఒక అపురూప అర్చన, క్రతువు. టూరిజం కానే కాదు. అందుకే దీన్ని చూడటానికి కళ్ళు సరిపోవు. అందుకే కను విప్పాలి అనడం. ఈ నాలుగు ఘట్టాలను దర్శించాలీ అనడం.

మొదటే అన్నట్టు, నలు దిక్కులా భయమూ భక్తీ, శ్రద్దా విశ్వాసం తప్పా మరేమీ లేని ఈ జాతర వైభవం చెప్పుకోవడంకోసం ఇది దేశంలో అతి పెద్ద ఆదివాసీ జాతర అనడం లేదా తెలంగాణ కుంభమేళా అనడం వృధా. ఈ జాతర రెండేళ్లకు ఒక మారు జరిగే ఒక జీవిత కాలపు మహా విస్పోటనం. రౌద్ర జీవన్నాటకం. అనంతర శాంతి. ఆ అనుభవం తనవితీరా దర్శించవలసిందే. (2020లో అందజ్యోతి ఎడిట్ పేజీలో ప్రచురితం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions