ఈ సినిమా ఫలానా ఓటీటీలో చూడండి… ఆ వెబ్ సీరిస్ ఈ ఓటీటీలో చూడండి… ఇప్పుడు ఇలాంటి ప్రచారాలు, ముచ్చట్లు, పోస్టులు ఎక్కువైపోయాయి కదా… ఎన్ని ఓటీటీ చందాలు కట్టగలడు ఒక ప్రేక్షకుడు..? దాదాపు 40 ఓటీటీ ప్లాట్‌ఫారాలు ఉన్నాయి ఇండియాలో… ఓ 30 మనకు అక్కరలేదు అని తీసేసినా, పది ఓటీటీల్లో చూడబుల్ కంటెంట్ ఉంటుందని అనుకున్నా, వాటన్నింటికీ చందాలు కట్టేంత స్థోమత ఉందా సగటు ప్రేక్షకుడి దగ్గర..? అవును గానీ, అసలు ఇండియాలో ఎంత మంది పెయిడ్ చందాదారులున్నారు ఈ ఓటీటీలకు..? ఇంతకీ ఏ ప్లాట్‌ఫారమ్ చాలా ఫేమస్..? అంటే, దేనికి ఎక్కువ మంది చందాదారులున్నారు..? ఏ ఓటీటీ ఆదాయం ఎక్కువ..? ఈ సందేహాలు కలిగాయా ఎప్పుడైనా..? ఇది చదవండి…
డబ్బే డబ్బు… కరోనా కాలంలో, థియేటర్లు మూతపడిన కాలంలో… ఇప్పటికీ థియేటర్ వెళ్లడానికి జనం భయపడుతున్నవేళ, థియేటర్ వెళ్తే జేబులు ఖాళీ అవుతున్నవేళ, వేరే వినోదం ఏమీ దిక్కులేనివేళ, దిక్కుమాలిన టీవీ సీరియళ్లు పిచ్చిరేపుతున్నవేళ… సినిమాలకు దీటుగా, నిజానికి అంతకన్నా క్వాలిటేటివ్ కంటెంట్ అందిస్తున్నయ్ కొన్ని ఓటీటీలు… అసభ్య, అశ్లీల సీన్ల మీద నియంత్రణ కరువైన మాట నిజమే కానీ… బ్రాడ్‌బ్యాండ్ చౌకగా దొరుకుతుండటంతో స్మార్ట్ ఫోన్లలో వీడియో కంటెంట్ చూసే ప్రేక్షకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది… అడ్వర్టయిజర్స్ కూడా బాగా యాడ్స్ ఇస్తున్నారు, డిజిటల్ మీడియాలో ఆదాయం పెరిగింది… దీంతో అనివార్యంగా అందరి దృష్టీ ఓటీటీలపై పడింది… ప్రస్తుతం 190 కోట్ల డాలర్లుగా ఉన్న ఈ రెవిన్యూ అయిదేళ్లలో 450 కోట్ల డాలర్లకు పెరగనుందని అంచనా… చందాల ఆధారిత వీక్షకుల (SVOD) సంఖ్య 10 కోట్లు ఇప్పుడు… ఇది వచ్చే ఐదేళ్లలో 22.4 కోట్లకు పెరుగుతుందని ఓ అంచనా…
ఏ ఓటీటీ ప్లేస్ ఏమిటి..? చందాదారుల సంఖ్యలో డిస్నీ హాట్‌స్టార్ టాప్… ఎంత అంటే… మొత్తం చందాదారుల సంఖ్యలో 50 శాతం మార్కెట్ దానిదే… అంటే ఒక సినిమా గానీ, ఇతర కంటెంట్ గానీ ఎక్కువ మంది చందాదారులకు చేరాలంటే… (టాప్ రీచ్) ఈ ఓటీటీ నయం… (సినిమాల్ని ఏదో ఓ రేటు చూసుకుని అమ్మేసే నిర్మాతలు, దర్శకులు, హీరోలకు తెలియని విషయం ఏమిటంటే..? రేటుతోపాటు రీచ్ కూడా ముఖ్యం… ఎక్కువ మంది చూస్తేనే భవిష్యత్తు డిమాండ్… ఉదాహరణకు జెమిని టీవీలో సినిమా ప్రసారం చేస్తే చూసే వీక్షకుల సంఖ్యకన్నా మాటీవీలో ప్రసారం చేస్తే రెట్టింపు, మూడు రెట్లు ఎక్కువ మంది చూస్తారు…) ఓటీటీ చందాదారుల సంఖ్యలో రెండోస్థానం 19 శాతంతో అమెజాన్ ప్రైమ్… మూడో ప్లేసులో ఉన్న నెట్‌ఫ్లిక్స్ చందాదారులు జస్ట్ 5 శాతం… ఇక జీ5, సోనీలివ్ ఎట్సెట్రా ఓటీటీల గురించి చెప్పుకోవడం అనవసరం…
Ads
నెట్‌ఫ్లిక్స్ తెలివే తెలివి… చందాదారుల సంఖ్యలో నెట్‌ఫ్లిక్స్ 5 శాతంతో మూడో ప్లేసులో ఉన్నా, దాని రెవిన్యూ సంపాదించే తెలివి అపారం… అందుకే ఓటీటీల ఆదాయంలో 29 శాతం దానిదే… సగం మంది చందాదారులున్నా సరే హాట్‌స్టార్ ఆదాయం 25 శాతం మాత్రమే… ప్రైమ్ ఆదాయం 22 శాతం… అంటే ఒకరకంగా హాట్‌స్టార్ రీజనబుల్ ప్లాట్‌ఫారం అన్నమాట… కంటెంట్ ప్రొవైడర్లకు, వీక్షకులకు…! (ఇటీవల జరిగిన ఓ సదస్సులో వెల్లడించబడిన అధికారిక గణాంకాలే ఇవన్నీ…) ఓటీటీల ప్రధాన అడ్వాంటేజ్ సబ్‌టైటిల్స్… దీంతో భాషాభేదం కొట్టుకుపోయింది… రీజనల్ లాంగ్వేజీల సినిమాల్ని, వీడియోల్ని ఇతర భాషా ప్రేక్షకులు కూడా బాగా చూస్తున్నారు… ఓ ఆశ్చర్యకరమైన విషయం తెలుసా..? ప్రపంచవ్యాప్తంగా కొరియన్ కంటెంట్ చూసే వీక్షకులు 400 శాతం, పిల్లల ప్రోగ్రాములకు 100 శాతం, 250 శాతం రియాలిటీ షోలకు పెరిగారు… చెప్పనేలేదు కదూ… గత జూన్ నాటికి 9.6 కోట్ల మంది ఓటీటీ చందాదారులున్నారు..!!
Share this Article