తరతరాలుగా మన తెలుగు సినిమాల్లో హీరో ఫైట్ ఎలా ఉంటుంది..? ముందుగా విలన్ మన హీరోను ఎగిరెగిరి తంతాడు… హీరో ఎక్కడికో వెళ్లి పడతాడు… ముక్కు నుంచో, మూతి నుంచో రెండోమూడో రక్తపు చుక్కలు కారతాయి… వాటిని ఖచ్చితంగా వేళ్లకు అంటించుకుని, హీరో తదేకంగా ఓసారి చూస్తాడు… నరాలు పొంగుతాయి, ముక్కుపుటాలు ఉబ్బుతాయి, కళ్లల్లో ఒకింత ఎర్రజీర మెరుస్తుంది… విలన్ మీద పడి ఉతికేస్తాడు… విలన్ బొక్కబోర్లా పడి మట్టికరుస్తాడు……….. ఇండియాకు మరో ఒలింపిక్ పతకాన్ని ఖాయం చేసిన రవి దహియా సేమ్ అదే టైపు… ఎంత వెనుకబడిపోయినా సరే, ఎక్కడా తన స్థయిర్యాన్ని కోల్పోడు… చివరి క్షణాల్లోనూ ఆటను తన చేతుల్లోకి తెచ్చేసుకుని, ప్రత్యర్థి షాక్ నుంచి తేరుకోకముందే ఆట ముగిస్తాడు… ఇప్పుడూ అంతే, కజకిస్థాన్ ప్లేయర్ సనయెవ్ మీద అలాగే గెలిచాడు… మొదట్లో 2-9తో వెనకబడిపోయాడు… తరువాత విజృంభించాడు… ఫైనల్స్‌లోకి ఎంటరయ్యాడు… (9 ఏళ్లుగా ఏ భారతీయ క్రీడాకారుడూ వ్యక్తిగత ఒలింపిక్స్ పతకాన్ని సాధించలేదు… ఇప్పుడు వస్తున్నది మళ్లీ…)
తను ఏ దశలోనూ తన స్టామినాను, మెంటల్ బ్యాలెన్స్‌ను కోల్పోడు అని చెప్పడానికి తన కోచ్ ఓ ఉదాహరణ చెబుతాడు… ఓసారి యూరోపియన్ చాంపియన్ అర్సెన్‌తో జరిగిన పోటీలో రవి ఒక దశలో 0-6 స్కోర్‌తో వెనకబడ్డాడు… తరువాత పుంజుకుని, వరుసగా 17 పాయింట్లు కొట్టాడు… ప్రత్యర్థికి ఊపిరి పీల్చుకునే స్కోప్ కూడా ఇవ్వడు… రవి గురించి మరో ఆసక్తికర అంశం ఉంది… ఈ ఒలింపిక్స్‌కు అర్హత సాధించినప్పటి సీన్స్ ఇవి… కజకిస్థాన్‌లో జరిగిన అర్హత పోటీల్లో చాలామంది గ్లోబల్ స్టార్స్‌ను ఓడించాడు, చివరకు జపానీ రెజ్లర్ యుకి తకహాషి మీద గెలిచాడు… జడ్జి తన చేయిని పట్టుకుని పైకెత్తాడు విజేతగా పరిగణిస్తూ… ఆ స్థితిలో ఎవరున్నా, ఒలింపిక్స్‌లోకి వెళ్తున్నందుకు ఎమోషన్‌కు గురవుతారు, నవ్వుతారు, నేల మీద పడిపోయి తమలోని ఆనందాన్ని వ్యక్తీకరిస్తారు… కానీ మన హీరో రవి మొహంలో చిరునవ్వు కనిపించలేదు సరికదా, తను ఓడిపోయినట్టుగా మొహం పెట్టాడు…
Ads
ఆ తరువాత కామ్‌గా ఓ ట్రెయినింగ్ ఎరీనాలో కూర్చుని కోచులతో ఏదో కాజువల్ టాక్స్‌లో మునిగిపోయాడు.., అరె, కాస్త నవ్వండి బాబూ, తమరు ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యారు తెలుసా..? అని ఎవరో అడిగితే… సింపుల్‌గా “అవును, అదేగా జరిగింది” అని సమాధానమిచ్చాడు… పర్ఫెక్ట్ జీరో ఎమోషన్… రోబో..!! ఫోటో కోసమైనా కాస్త నవ్వవయ్యా బాబూ అనడిగితే అప్పుడు నవ్వాడట… చిన్నగా..! కనీ కనిపించకుండా…! తన మీద విమర్శలొచ్చినా, వార్తలొచ్చినా సరే వాటిని అస్సలు దేకేది లేదు… పిచ్చ లైట్… ఇదేకాదు, ఢిల్లీలోని ఛాత్రశాల స్టేడియం నుంచి సుశీల్ కుమార్, యోగశ్వర్ దత్ వంటి క్రీడాకారుల్ని అందించింది కదా… రవి దహియా కూడా అక్కడి ప్రొడక్టే… మహాబలిగా పేరొందిన సత్పాల్‌సింగ్ తన గురువు… ఓసారి ఎవరో జర్నలిస్టు అడిగితే… ‘‘నేను ఏం సాధించానని ఏం చెప్పుకోవాలి..? ఒలింపిక్ స్థాయి క్రీడాకారుల్ని పెంచిన స్టేడియం ఇది… అసలు నేను చిన్నప్పటి నుంచీ ఇంతే… చేసేది చేస్తూ పోవడం, అంతే…’’ అన్నాడు… హర్యానాలోని నహరి వాళ్ల సొంతూరు… పదీపన్నెండేళ్ల వయస్సు నుంచే ఈ స్టేడియంలో శిక్షణ… తండ్రి రాకేష్ దహియా ఓ మోస్తరు కౌలు రైతు… కొడుకు స్టామినా కోసం 40 కిలోమీటర్లు వెళ్లి పాలు, పళ్లు ఇచ్చి వచ్చేవాడు అనేకసార్లు… ఇప్పుడు బంగారమో, వెండో… ఒక పతకం మాత్రం ఖాయమైంది… అందరికన్నా అధికంగా ఆ కౌలు రైతు గుండె ఆనందంగా ఎగిసిపడుతోంది… కొడుకును చూస్తూ…! అందరినీ పిలిచి ఇంట్లో టీవీ ముందు కూర్చోబెట్టి, కొడుకు ఆట చూపిస్తూ హడావిడి చేశాడు ఊర్లో…! కానీ తనూ అంతే… కడుపులో సంబరం అంబరమైనా సరే, కొడుకులాగే పెద్దగా బయటపడడుట…!! సేమ్ నెత్తురు కదా…!!! (స్టోరీ నచ్చితే ముచ్చటను సపోర్ట్ చేయండి))
Share this Article