పార్ధసారధి పోట్లూరి ….. Adani Vs Hindenburg- గౌతమ్ ఆదాని Vs హిండెన్బర్గ్. పార్ట్ -01….. గత వారం రోజులుగా ఎలెక్ట్రానిక్,ప్రింట్ మీడియా తో పాటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న వార్త .. ఆదాని తన గ్రూపు షేర్ల ని కృత్రిమంగా పెంచుకుంటూ పోతున్నాడు అని!
ఒక చిన్న సంస్థ అయిన హిండెన్బర్గ్ అనే పేరుతో అంతర్జాతీయంగా ఆర్ధిక పరమయిన అవకతవకలని బయటపెడతాను అంటూ తమ సంస్థ రీసెర్చ్ [Forensic Financial Research] చేసి గౌతమ్ ఆదానీ గ్రూపు కృత్రిమంగా తన షేర్ల ని పెంచుకుంటూ అవకతవకలకి పాల్పడుతున్నది అని పేర్కొంది ! Hindenburg రిపోర్ట్ ని ఆధారం చేసుకొని మొత్తం ఆదాని గ్రూపు షేర్ల ధరలు 20% పడిపోయాయి.
హిండెన్బర్గ్ .. ఈ పేరు ఏమిటి ?
Ads
1937 లో నాజీ జర్మని హైడ్రోజన్ ఆధారిత ఎయిర్ షిప్ ప్రమాదానికి గురయి అందులో ప్రయాణిస్తున్న 36 మంది ప్రయాణీకులతో పాటు దానిలో పనిచేస్తున్న సిబ్బంది మొత్తం మరణించారు. నాజీ జర్మనీ తన టెక్నాలజీ గురించి ప్రచారం చేసుకునే నిమిత్తం హైడ్రోజన్ ఎయిర్ షిప్ లని నిర్మించింది. మొదటి ప్రమాదం వలన ఎయిర్ షిప్ లో ఉన్న హైడ్రోజన్ ఇంధనం ఒక్కసారిగా మండిపోయి అందరూ మరణించారు కానీ దానిని నుండి ఎలాంటి పాఠాలు నేర్చుకోకుండా అదే టెక్నాలజీని వాడడం వలన మళ్ళీ మళ్ళీ ప్రమాదాలు జరగడం ప్రయాణీకులు మరణించడం జరిగింది.
ఈ ప్రమాదాల మీద రీసెర్చ్ చేయడానికి అప్పట్లో Hindneburg అనే సంస్థని ఏర్పాటు చేశారు. హిండెన్బర్గ్ తరువాతి కాలంలో హైడ్రోజెన్ ఎయిర్ షిప్ లో వాడుతున్న హైడ్రోజెన్ ఇంధన టాంక్ నుండి హైడ్రోజెన్ బయటికి లీక్ అయి ఆక్సిజెన్ తో కలిసి అగ్నిప్రమాదానికి కారణం అయ్యింది అని తేల్చారు. అగ్ని రాజుకోవడానికి కారణం Static Electricy [స్థిర విద్యుత్ ]. స్టాటిక్ ఎలెక్ట్రిసిటీ కి కారణం అవుతున్న మెటీరీయల్ ని గుర్తించి దానిని తీసివేసిన తరువాత ప్రమాదాలు జరగలేదు కానీ అప్పటికే హైడ్రోజెన్ ఎయిర్ షిప్ శకం ముగిసిపోవడంతో Hindenburg రీసెర్చ్ సంస్థ అవసరం లేకపోయింది.
అదే హిండెన్బర్గ్ సంస్థ పేరుతో రీసెర్చ్ అనే పేరుని జత చేసి 2017 లో నాధన్ ఆండర్సన్ [Nathan Anderson] అనే అతను ఫైనాన్షియల్ మోసాలు అరికట్టడానికి ఈ సంస్థ ఏర్పాటు అన్నాడు. 2020 నాటి వెబ్సైట్ లో పేర్కొన్న ప్రకారం కేవలం 5 గురు మాత్రమే హిండెన్బర్గ్ రీసెర్చ్ లో పనిచేస్తున్నారు. కానీ హిండెన్బర్గ్ అనేది రీసర్చ్ సంస్థ అని చెప్పుకుంటున్నది కానీ అసలు నిజం అదికాదు.
నిజానికి Hindenburg అనేది రీసర్చ్ గ్రూపు కానే కాదు ! అదొక స్టాక్ మార్కెట్ బ్రోకరింగ్ సంస్థ. షార్ట్ సెల్లింగ్ బిజెనెస్ చేస్తుంటుంది ! మొత్తం ఉద్యోగుల సంఖ్య 10 లోపే [ప్రస్తుతం ] ఉంటుంది ! అలాంటిది ఈ సంస్థ లక్షల కోట్ల రూపాయలతో నిండి ఉన్న ఆదానీ గ్రూపు కి సంబంధించి కీలక డాక్యుమెంట్లు ఎలా సంపాదించగలిగింది ? కేవలం 10 మంది లోపే ఉన్న హిండెన్బర్గ్ అక్కడ కుంభకోణం జరిగింది అని ఎలా తెలుసుకున్నది ? షార్ట్ సెల్లింగ్ బిజినెస్ సంస్థ రీసెర్చ్ సంస్థ ఎలా అయ్యింది ? ఇలా చాల ప్రశ్నలు ఉన్నాయి కానీ సమాధానాలు లేవు…
****************************
నాథన్ ఆండర్సన్ స్వయంగా తానే చెప్పుకున్నాడు మేము షార్ట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తున్నాము అని! అసలు ఈ షార్ట్ సెల్లింగ్ అంటే ఏమిటి ?
సాధారణంగా మనం స్టాక్ మార్కెట్ లో షేర్లు కొంటాము, ధర పెరిగిన తరువాత లాభానికి అమ్ముతాము. కానీ షార్ట్ సెల్లింగ్ పద్ధతిలో దీనికి వ్యతిరేకంగా అంటే రివర్స్ లో జరుగుతుంది. ఉదా : ఒక కంపెనీ షేర్ ధర 100 రూపాయలు ఉంది అనుకుందాము. షార్ట్ సెల్లింగ్ పద్ధతిలో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వాళ్ళు 100 రూపాయాలకి పెట్టుబడి పెట్టి అది 80 రూపాయలకి పడిపోయినప్పుడు కొంటారు.
దీనిని మరింత విపులంగా చెప్పుకుందాం !
షార్ట్ సెల్లింగ్ లో ఎవరయినా షేర్ మార్కెట్లో లావాదేవీలు చేయాలి అంటే ‘MIS’ అకౌంటు కలిగి ఉండాలి. MIS అంటే ‘మార్జిన్ ఇంట్రాడే సెటిలిమెంట్ ‘[Margin Intraday Settelement ]. ఈ పద్ధతిలో షేర్లు కొంటారు అమ్ముతారు. Abc షేర్ ధర 100 ఉన్నప్పుడు కొంటారు అదే abc షేర్ ధర 120 అయినప్పుడు 20 రూపాయల నష్టానికి అమ్మేస్తారు. అదే abc షేర్ ధర 80 అయినప్పుడు మళ్ళీ కొంటారు. సింపుల్ గా దీనిని షార్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు స్టాక్ మార్కెట్లో.
అయితే ఇదంతా ఇంట్రా డే సెషన్ లో జరుగుతూ ఉంటుంది. స్టాక్ మార్కెట్ లావాదేవీలు మొదలయ్యేది ఉదయం 9. 15 కి అయితే ఆ రోజు లావాదేవీలు ముగిసేది మధ్యాహ్నం 3.30 గంటలకి ! అయితే ఇలాంటి షార్ట్ సెల్లింగ్ అనేది ఆయా స్టాక్ బ్రోకర్ ని బట్టి సమయం మారుతూ ఉంటుంది స్క్వేర్ చేయడానికి. చాలా మంది స్టాక్ బ్రోకర్లు ఆటో స్క్వేర్ ఆఫ్ ని సెట్ చేస్తారు 3.10 గంటలకి అంటే స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి 20 నిముషాల ముందు ఆఫ్ చేస్తారు.
*************************************
షార్ట్ సెల్లింగ్ అంటే ఇంట్రా డే సెషన్ లో (ఒకేరోజు లావాదేవీలు) షేర్ ధర కొన్నదానికంటే తగ్గినప్పుడు మాత్రమే లాభాలు వస్తాయి. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది కదూ ? నిజానికి షార్ట్ సెల్లింగ్ చేసేవాడి దగ్గర షేర్లు అంటూ ఏమీ ఉండవు. ఉదయం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మొదలవగానే స్టాక్ బ్రోకర్ దగ్గర షేర్లు అప్పుగా తీసుకొని, వాటిని తిరిగి మధ్యాహ్నం 3.10 కల్లా తిరిగి బ్రోకర్ కి ఇచ్చేయాలి. భారీ జూదం…
Abc అనే సంస్థ షేర్లని షార్ట్ సెల్లింగ్ చేయాలి అనుకుందాము. షార్ట్ సెల్లింగ్ చేసే వ్యక్తి లేదా కంపెనీ Abc కి చెందిన షేర్లని బ్రోకర్ నుండి అప్పుగా తీసుకోవాలి దానికి గాను హామీగా ఏదన్నా చూపాలి. Abc షేర్ ధర ఉదయం బ్రోకర్ దగ్గర తీసుకున్నప్పుడు ధర 100 రూపాయలు ఉంది అనుకుందాము. ఆ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆ షేర్ ధర 150 రూపాయలకి పెరిగితే ఎన్ని షేర్లు అప్పుగా తీసుకున్నాడో వాటిని తిరిగి బ్రోకర్ దగ్గర సరెండర్ చేసే సమయానికి ఒక్కో షేర్ ధర 150 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. దీని వల్ల షార్ట్ సెల్లింగ్ చేసే వ్యక్తికి ఒక్కో షేర్ కి 50 రూపాయల నష్టం వస్తుంది.
అదే షేర్ ధర ట్రేడింగ్ ముగిసే సమయానికి 80 రూపాయల దగ్గర ట్రేడ్ అయ్యింది అనుకుందాము. షార్ట్ సెల్లింగ్ చేసే వ్యక్తి కి ఒక్కో షేర్ మీద 20 రూపాయల లాభం వస్తుంది అన్నమాట. బ్రోకర్ దగ్గర కొన్నప్పుడు 100 రూపాయల ధర ఉంటే తిరిగి ఇచ్చేటప్పుడు 80 రూపాయల ధరకే ఇస్తాడు కాబట్టి ఒక్కో షేర్ మీద 20 రూపాయల లాభం ఉంటుంది ఇదంతా ఏ రోజుకి ఆ రోజు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్టాక్ మార్కెట్ లో బిజినెస్ చేసేవాళ్ళు షేర్ ధర పెరిగితే లాభాలు ఆర్జిస్తారు అదే షార్ట్ సెల్లింగ్ చేసేవాళ్ళకి అయితే షేర్ ధర ఎంత పడిపోతే అంత లాభం అన్నమాట.
**************************************
షార్ట్ సెల్లింగ్ పద్ధతిలో ట్రేడింగ్ చేసేవాళ్ళ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే షేర్ల ధరలు పెరుగుతూనే ఉంటాయి కానీ ఎప్పుడో ఒక సారి మాత్రమే ధరలు పడిపోతూ ఉంటాయి కాబట్టి రిస్క్ ఎక్కువ. షార్ట్ సెల్లింగ్ చేసేవాళ్ళకి షేర్ మార్కెట్ కుప్ప కూలితేనే లాభాలు వస్తాయి వాళ్ళు స్టాక్ మార్కెట్ ఎప్పుడు కుప్ప కూలుతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. 2008 లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్ధిక మాంద్యం వలన షేర్ మార్కెట్ కుప్ప కూలిపోయిన తరుణంలో షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళు వేల కోట్ల రూపాయలు సంపాదించారు కొద్ది రోజులలోనే !
2008 లో సబ్ ప్రైమ్ మార్టిగేజ్ [Subprime Mortigage] సంక్షోభం వలన వచ్చిన ఆర్ధిక మాంద్యం వలన స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. జాన్ పాల్సన్ [John Paulson ] అనే స్టాక్ ట్రేడర్ షార్ట్ సెల్లింగ్ ద్వారా $ 4 బిలియన్ డాలర్లు సంపాదించాడు ఒక్కడే ! వ్యక్తిగతంగా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి 4 బిలియన్ డాలర్ల లాభాన్ని పొందినది రికార్డ్ గా ఉంది ఇప్పటివరకు…
దానికి ముందు 2007లో Dr. మైఖేల్ బురి [Dr.Micheal Burry ] అనే ఇన్వెస్టర్ మార్టిగేజ్ బాండ్స్ మార్కెట్ నుండి షార్ట్ సెల్లింగ్స్ ద్వారా $100 మిలియన్ డాలర్లు సంపాదించడమే కాకుండా తన ఇన్వెస్టర్స్ కి $700 మిలియన్ డాలర్లు సంపాదించి పెట్టాడు. షార్ట్ సెల్లింగ్ ద్వారా సంపాదించింది చాలు అని మైఖేల్ తన హెడ్జ్ ఫండ్ సంస్థ అయిన సియాన్ [Scion] మూసివేశాడు 2008 లో!
షార్ట్ సెల్లింగ్ పద్ధతిలో ట్రేడింగ్ చేయడం చాలా కష్టం కానీ పైన చెప్పుకున్న సమయాలలో అంటే 2007-08 లలో సబ్ ప్రైమ్ సంక్షోభం వలన దాదాపుగా అన్ని బ్లూ చిప్ షేర్ల ధరలు దారుణంగా పడిపోవడం వలన షార్ట్ సెల్లింగ్ ట్రేడింగ్ చేసిన వాళ్ళు బాగా లాభపడ్డారు.
ఇలా అప్పుడప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ మొత్తంలో షేర్ల ధరలు పడిపోయినప్పుడు ఆ సమయంలో ఎవరయితే షార్ట్ సెల్లింగ్ ట్రేడింగ్ చేసినవాళ్ళు ఉన్నారో వాళ్ళకి భారీగా లాభాలు వచ్చాయి. అయితే నిత్యం ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలని జాగ్రత్తగా పరిశీలుస్తూ ఎవరయితే స్టాక్ ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళకి స్టాక్ మార్కెట్లు కుప్ప కూలిపోతాయి అని ముందే గ్రహించి షార్ట్ సెల్లింగ్ లో భారీగా పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించగలుగుతున్నారు.
ఆఫ్ కోర్స్ రోజువారీ జరిగే షార్ట్ సెల్లింగ్ ట్రేడింగ్ లో నష్టాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఏదో ఒకరోజు పోయిన వాటికంటే వేల రేట్లు ఎక్కువ సంపాదిస్తారు ఒక్క రోజులోనో లేదా రెండు రోజులలోనో !
*********************************
అయితే 2007-08 సబ్ ప్రైమ్ సంక్షోభం వలన ఏర్పడ్డ స్టాక్ మార్కెట్ పతనం వలన కొంతమంది స్టాక్ బ్రోకర్లు డీఫాల్ట్ అయ్యారు. ఎందుకంటే షేర్ల ధరలు విపరీతంగా పడిపోవడం వలన షార్ట్ సెల్లింగ్ చేసినవారికి చెల్లింపులు చేయలేకపోయారు.
దాంతో కొన్ని దేశాలు అంటే బెల్జియం, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలు షార్ట్ సెల్లింగ్ ట్రేడింగ్ మీద నిషేధం విధించాయి 2011 లో! అమెరికా మాత్రం షార్ట్ సెల్లింగ్ విషయంలో ఉదారంగా చట్టాలని సవరించి స్వేచ్ఛగా ట్రేడింగ్ చేసుకోమని వదిలేసింది. భారత దేశం కూడా 2011 లో షార్ట్ సెల్లింగ్ మీద నిషేధం విధిస్తుంది అని అందరూ భావించారు కానీ నిషేదం విధించలేదు. ఇప్పటికీ భారతీయ షేర్ల మీద షార్ట్ ట్రేడింగ్ చేయడం మీద ఎలాంటి నిషేధం లేదు.
అమెరికాలోని న్యూయార్క్ నగరం లో రిజిస్టర్ అయిన హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ ప్రధాన వ్యాపారం షార్ట్ సెల్లింగ్ పద్ధతిలో ట్రేడింగ్ చేయడం ! అంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు కుప్పకూలుతుందా తాము పెట్టుబడి పెట్టిన షేర్ల ధరలు ఎప్పుడెప్పుడు పడిపోతాయా అని నిత్యం ఎదురుచూస్తూ ఉంటుంది హిండెన్బర్గ్ !
Share this Article