Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎన్టీయార్, దిలీప్‌కుమార్‌కన్నా శివాజీ గణేశనే ఆ పాత్ర అదరగొట్టాడు…

October 12, 2023 by M S R

Bharadwaja Rangavajhala….    తంగ‌ప‌త‌కం …. ఇది కొడుకును చంపిన తండ్రి క‌థ‌గా మాత్ర‌మే చూడ‌ద్దు … ఓ ప్ర‌భుత్వోద్యోగిలో ఉండాల్సిన నిబ‌ద్ద‌త‌ను బ‌లంగా చెప్పిన క‌థ‌గా చూడండి అని శివాజీగ‌ణేశ‌న్ త‌ర‌చు చెప్పేవారు.

త‌మిళ‌నాట సినిమా నాట‌కాన్ని మింగేయ‌లేదు. సినిమా న‌టులు ఆ మాట‌కొస్తే సినిమాల్లో సూప‌రు స్టార్లుగా వెలుగుతున్న వారు సైతం స్టేజ్ మీద‌కు రావ‌డానికి వెనుకాడేవారు కాదు. అక్కినేని గురించి ఆత్రేయ రాసిన వ్యాసంలో ఇదే విష‌యాన్ని గుచ్చి మ‌రీ చెప్తారు.

నాగేశ్వ‌ర్రావు న‌ట సామ్రాట్ అవ‌డం వెనుక కొద్ది మేర అయినా నాట‌క ప్ర‌మేయం ఉంది. నాట‌కాన్ని సీరియ‌స్ గా తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల నాగేశ్వ‌ర్రావు ఎదుగుద‌ల ఆగిపోయింది. నాట‌కాన్ని చంపేయ‌డం వ‌ల్ల మ‌రో నాగేశ్వ‌ర్రావు రావ‌డానికి ఆస్కారం లేకుండా పోయింది అని రాస్తారు ఆత్రేయ‌.

Ads

శివాజీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో వ‌చ్చిన తంగ‌ప‌త‌కం సినిమా స్టేజ్ మీద పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న క‌థే. త‌మిళ రాజ‌కీయాల్లోనూ, నాట‌కాల్లోనూ, సినిమాల్లోనూ క్రియాశీల‌కంగా ఉన్న న‌టుడు సెందామ‌రై రెగ్యుల‌ర్ గా వేస్తున్న తంగ‌ప‌త‌కం నాట‌కాన్ని శివాజీ మిత్రుడొక‌రు చూసి బాగుంద‌ని మెచ్చుకున్నారు.

దీంతో శివాజీకి ఇంట్ర‌స్టు పుట్టి స్వ‌యంగా వెళ్లి ఆ నాట‌కం చూసి థ్రిల్ల‌య్యారు. ఆ నాట‌క ర‌చ‌యిత జె.మ‌హేంద్ర‌న్. త‌ర్వాత రోజుల్లో అద్భుత‌మైన సినిమాలు తీసి త‌మిళ నాట కొత్త త‌ర‌హా సినిమాలు తీసిన ద‌ర్శ‌కుల్లో ఒక‌రు అనిపించుకున్నారాయ‌న‌. మ‌హేంద్ర‌న్ అంటే తెలుగులో సుహాసినీ మోహ‌న్ ల‌తో మౌన‌గీతం అనే డ‌బ్బింగు సినిమా వ‌చ్చి హిట్టైపోయింది చూడండీ … ప‌రువ‌మా చిలిపి ప‌రుగు తీయ‌కూ అనే పాటుంటుందీ… ఆ సినిమా డైర‌క్ట‌ర‌న్న‌మాట‌.

అలాగే బాపుగారి సీత‌మ్మ‌పెళ్లి సినిమా ఒరిజిన‌ల్లు ముల్లు మ‌ల‌రుం సినిమా కూడా ఆయ‌నే తీశారు. ర‌జ‌నీకాంత్ న‌టించిన ఆ సినిమా కూడా తెలుగులో ముల్లు పువ్వు పేరుతో డ‌బ్బై విడుద‌ల‌య్యింది. మ‌హేంద్ర‌న్ తోనూ సెందామ‌రైతోనూ మాట్లాడి తంగ‌ప‌త‌కం నాట‌కం హ‌క్కులు తీసుకుని త‌ను కూడా ప్ర‌ద‌ర్శించారు శివాజీగ‌ణేశ‌న్ . త‌ర్వాత దాన్నే మాధ‌వ‌న్ డైర‌క్ష‌న్ లో సినిమాగానూ తీశారు.

ఈ రెండు ప్రాజెక్టుల్లోనూ సెందామ‌రైను కూడా భాగ‌స్వామిని చేశారు. స్టేజ్ మీదే కాదు … వెండితెర మీదా తంగ‌ప‌త‌కం అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించింది. ఇదే సినిమాను ఆధారం చేసుకుని హిందీలో అమితాబ్ , దిలీప్ కుమారుల‌తో శ‌క్తి తీశారు. తెలుగులో ఎన్టీఆర్ , మోహ‌న్ బాబుల‌తో కొండ‌వీటి సింహం తీశారు.

తెలుగు ప్రేక్ష‌కులు గొప్ప‌వారు. అల్లు అర‌వింద్ త‌మిళ తంగ‌ప‌త‌కం సినిమా హ‌క్కులు కొని తెలుగులో బంగారుప‌త‌కం అని డ‌బ్ చేసి విడుద‌ల చేస్తే చాలా సెంట‌ర్ల‌లో వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. బెజ‌వాడ జైహిందు టాకీసులో చూశాన్నేనా సినిమా. అదే సినిమాను క్లైమాక్సులో కొడుకును చంపేయ‌డం మిన‌హా య‌ధాత‌ధంగా తీసిన కొండ‌వీటి సింహాన్ని అంత‌కు మించి విజ‌య‌వంతం చేశారు.

ఇక ఇదే సినిమా క్లైమాక్సును ఆధారం చేసుకుని అవినీతి చుట్టూ క‌థ తిప్పి శంక‌ర్ తీసిన భార‌తీయుడునీ మెచ్చి నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు సెకండు పార్టునూ చూసేయ‌డానికి ర‌డీ అయిపోతున్నారు. నా అభిప్రాయంలో ఎన్టీఆర్‌, దిలీప్ కుమారుల‌క‌న్నా శివాజీయే ఆ పాత్ర‌కు ఎక్కువ న్యాయం చేశారు. అందుకే దాన్ని శివాజీ తంగ‌ప‌త‌కం అనే అనాలి. … ఇందాక కొండవీటి సింహం గురించిన విశేషాలు సదువుతాఉంటే ఇది గుర్తొచ్చింది… లేపోతే నాకెందుకు?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions