Bharadwaja Rangavajhala…. ఈ ఫొటోలో అబ్బాయి పేరు నటరాజు కె.వెంకటేశ్వరరావు.
పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు ఆయన ఊరనుకుంటాను.
ఆయన బెజవాడ రైల్వేలో ఉద్యోగం చేసేవారు.
Ads
రైల్వే ఉద్యోగులతోనే రసన సమాఖ్య పేరుతో ఓ నాటక సంస్ధ నిర్వహించేవారు.
అలా కొంత కాలం విజయవాడలో ఉద్యోగం చేశారు. ఆ సమయంలో డి.వి.నరసరాజు రాసిన నాటకం లో రామానుజం పాత్ర లో నటించారు ,
నిజానికి అప్పటికే ఆయన నటుడుగా తనేంటో నిరూపించుకున్నారు.
కీర్తిశేషులు, కన్యాశుల్కం తదితర నాటకాలతో పాపులర్ అయ్యాడు కూడా.
నటన మీదా నాటకం మీదా విపరీతమైన ఆరాధన ఉన్న నటుడు ఆయన.
సినిమాల్లోకీ ప్రవేశించారు.
ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఒకటి రెండు సినిమాల్లో అలా వచ్చి ఇలా వెళ్లిపోయే పాత్రలూ చేశారు.
అయితే ప్రేక్షకులకు గుర్తుండిపోయిన సినిమా పాత్ర మాత్రం కన్నెవయసులో రోజారమణి తాగుబోతు తండ్రి పాత్ర.
ఆ సినిమా తయారై ఇంకా విడుదల కాకముందే వెంకటేశ్వరరావు కన్నుమూశారనుకోండి.
ఆ సనిమా టైటిల్స్ లోనే కీర్తిశేషులు నటరాజు కె. వెంకటేశ్వరరావు అని పడుతుంది.
నటన మీదున్న మమకారంతోనే రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసి ఢిల్లీలోని డ్రామా స్కూల్ లో ట్రైనింగ్ తీసుకోడానికి వెళ్లారు వెంకటేశ్వరరావు.
ఆయనతో పాటు పొట్టి ప్రసాద్ కూడా వెళ్లాడు.
తర్వాత విశాఖపట్నం ఆంధ్రా విశ్వవిద్యాలయంలో రిజిష్టార్ గా కె.వి.గోపాలస్వామి నియమితులయ్యారు.
ఆయన కె.వెంకటేశ్వరరావును డిపార్ట్ మెంట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ కు స్టేజ్ డైరక్టర్ గా తీసుకున్నారు.
వెంకటేశ్వరరావు నటుడుగానే కాదు …
తోటి నటుల్ని తీర్చిదిద్దడంలోనూ ఘనుడు.
ఆయన తర్ఫీదులోనే పొట్టి ప్రసాదు నటుడుగా రాటుదేలాడు.
దేవదాసు కనకాల, సాక్షి రంగారావు, మిశ్రో, కృష్ణ చైతన్య, వంకాయల సత్యనారాయణ తదితరులు కె.వెంకటేశ్వరరావుగారి దగ్గర శిష్యరికం చేసినవారే .
వీళ్లల్లో…
మిశ్రో, కృష్ణ చైతన్యలు బాలచందర్ , జంధ్యాల, విశ్వనాథ్ తదితర దర్శకుల చిత్రాల్లో మంచి పాత్రలే కాదు …
గుర్తుండిపోయే పాత్రలే చేశారు.
ఆ మధ్య కన్నుమూసిన చాట్ల శ్రీరాములు కూడా కె.వెంకటేశ్వర్రావుగారితో పాటు రైల్వేలో పనిచేసేవారు.
వీరిద్దరూ సన్నిహితులే కాదు … కలసి నాటకాలు ఆడిన వాళ్లు కూడా.
ఆకాశవాణిలో వచ్చి చాలా పాపులర్ అయిన కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్ర కె.వెంకటేశ్వరరావుగారే చేశారు.
అవి ప్రస్తుతం ఆకాశవాణి వారిదగ్గరే సీడీ రూపంలో కొనుక్కోవచ్చు.
కె.వెంకటేశ్వరరావు రచయిత నటుడు గణేశ్ పాత్రో కి మామగారు.
పాత్రో రాసిన పావలా తదితర నాటకాలను కూడా వెంకటేశ్వరరావుగారు రంరగస్థలం మీద ప్రదర్శించారు.
పావలా నాటకమే ఆ తర్వాత రోజుల్లో నాకూ స్వతంత్రం వచ్చింది పేరుతో సినిమాగా వచ్చింది.
ఈ దారుణానికి ఒడిగట్టింది నటుడు కథకుడు దర్శకుడు అయిన ప్రభాకరరెడ్డే.
ఆ విషయం పక్కన పెడితే …
పావలా మీద రావిశాస్త్రిగారి కామెంట్ …
ఈ సినిమావాళ్లు వచ్చి … పాపం గణేశ్ పాత్రోని పావలా వైపు నిలబడకుండా చేశారు … అని …
Share this Article