.
Jyothi Valaboju ……… టాయిలెట్ బాక్స్ / బొట్టుపెట్టె
టాయిలెట్ అన్న పదం మాట్లాడడానికి కూడా ఇష్టపడరు చాలామంది.. నాజూగ్గా వాష్ రూమ్ అంటున్నారు.. అమెరికాలో టాయిలెట్ అనే బోర్డు ఉంటుంది… నా చిన్నప్పుడు అంటే ఓ యాభై ఏళ్ల క్రితం బాత్ రూమ్, టాయిలెట్ అనే మాటలు సర్వసాధారణం. తెలంగాణా యాసలో అంటే ఒంటికి, దొడ్డికి లేదా బయలుకు అంటాము. ఇప్పుడు కాస్త మారారులెండి..
Ads
ఇక విషయానికొస్తే… ఇప్పుడు కాదు కానీ, అప్పుడు అంటే నేను పెరిగిన సమయంలో మధ్యతరగతి ఆడపిల్లలకు మేకప్ లేదా తయారవ్వడం అంటే మొహానికి పసుపు రాసుకోవడం లేదా ఫెయిర్ అంఢ్ లవ్లీ, వీకో టర్మరిక్ పసుపు క్రీమ్ మాత్రమే ఉండేది…
నాకు ఇవన్నీ అలవాటు లేదు. ఎంగేజ్మెంట్ కి మాత్రం వీకో టర్మరిక్ పూసుకున్నా కొంచెం… ఫోటోస్ లో సరిగా రావాలని నాన్న చెప్తేనూ… తలనిండుగా పువ్వులు లేదా పూలజడ.. ఇక సగటు ఆడపిల్లలకు అవసరమైనవి టిక్లీలు, గాజులు, క్లిప్పులు, పిన్నులు..
పౌడర్ డబ్బా, పఫ్, కాంపాక్ట్ వాడేవారు కొందరు.. రిబ్బన్లు కూడానండోయ్.. వీటన్నింటినీ ఏదో ఒక డబ్బాలో పెట్టుకునేవాళ్లం. లేదా టేబుల్ సొరుగులో… నాకైతే ఎప్పుడూ సరిగ్గా సర్దుకున్న గుర్తు లేదు. ఎక్కడబడితే అక్కడ క్లిప్పులు, గాజులు… అమ్మ తిట్టినా బుద్ధి రాదు కదా…
కానీ పెళ్లి అనగానే అమ్మాయికి స్పెషల్ స్టేటస్ వస్తుంది. తనకోసం సామాన్లు, డ్రెస్సింగ్ టేబుల్, ఫర్నీచర్ తో పాటుగా పెళ్లిలో ఇచ్చే మరో వస్తువు టాయిలెట్ బాక్స్ లేదా బొట్టుపెట్టె. మామూలుగా అయితే చెక్కతో చేసింది ఇస్తారు.
కాస్త ఉన్నవాళ్లు అయితే రెడీమేడ్ గా దొరికే టాయిలెట్ బాక్స్ ఇచ్చేవారు. అది చిన్న సూట్కేసులా ఉండేది. దానికి తాళం, హ్యాండిల్ కూడా. సూట్కేసులు చేసి కంపెనీవాళ్లవే ఈ టాయిలెట్ బాక్సులు కూడా తయారుచేసేవారు. చాలా ఏళ్లు మన్నుతుంది.
పెళ్లికూతురు అత్తారింటికి వెళ్లేటప్పుడు ఈ బాక్సులో తన వస్తువులు పెట్టుకుని వెళ్తుంది. బొట్టు, కాటుక, గాజులు, క్లిప్పులు, కర్చీఫులు, వాళ్లు వీళ్లూ ఇచ్చిన డబ్బులు కూడా అందులోనే దాచుకునేది. అది తనకు మాత్రమే సొంతమైన చిన్న బీరువా అన్నమాట…
చెక్కతో చేసినదానికంటే కాస్త చవకైనది ఇనుప బొట్టుపెట్టె. ఇది చాలా పెళ్లిల్లో పెళ్లికూతురుకు ఇచ్చే సామాన్లలో చూసాను నేను. తర్వాత చెక్కతో చేసింది. తర్వాత వచ్చింది ఖరీదైన ప్లాస్టిక్ సూట్కేసు లాంటిది. కొన్నింటిలో మూత తీయగానే మ్యూజిక్ వచ్చేది…
ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయో లేదో తెలీదు. ఇస్తున్నారో లేదో తెలీదు. కాలం మారింది, మనుషులు మారారు, పద్ధతులు మారాయి కదా… అచ్చతెలుగులో చెప్తే బొట్టుపెట్టె… నాజూగ్గా చెప్తే టాయిలెట్ బాక్స్.. మీకు తెలుసా, వాడారా ఇది…
Share this Article