Nancharaiah Merugumala………. అమెరికా సిటీ సియాటల్ లో చరిత్ర సృష్టించిన తమిళ బ్రాహ్మణ పోరాటయోధురాలు క్షమా సావంత్… పుణెలోని సొంత ఇంట్లో 44 ఏళ్ల నాటి కుల వివక్షను మరవని గొప్ప మహిళ! … ఈ వాయువ్య అమెరికా నగరంలో ఇక ముందు ప్రకటిత కులద్వేషం నేరమే!
…………………………………………………………………
కుల వివక్షకు, కులతత్వానికి పేరుమోసిన తమిళ బ్రాహ్మణ సమాజంలోని ఓ కుటుంబంలో పుట్టిన క్షమా సావంత్ నేడు అమెరికాలో సాంఘిక విప్లవానికి నిలువెత్తు స్తంభంగా నిలబడింది. వాయువ్య అమెరికా రాష్ట్రం వాషింగ్టన్‌లోని అతి పెద్ద నగరం సియాటల్ లో ఇక ముందు కులం పేరుతో దూషణలకు, వివక్షకు పాల్పడడాన్ని నిరోధించే ఆర్డినెన్స్‌ను మంగళవారం ఈ నగర సిటీ కౌన్సిల్ 6–1 మెజారిటీతో ఆమోదించింది. ఇలాంటి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న మొదటి నగరంగా సియాటల్ చరిత్రకెక్కింది.
Ads
అయితే, ఈ తీర్మానం ఆమోదం పొంది, చట్టమైతే ఇండియా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన హిందువుల్లోని ఒక సామాజికవర్గం (బ్రాహ్మణులు) అమెరికాలో హిందూ వ్యతిరేకులకు టార్గెట్ అవుతుందని అనేక మంది హిందువులు క్షమా సావంత్‌తో వాదించారు. కాని, ఆమె లక్ష్యాన్ని, పట్టుదలను ఎవరూ మార్చలేకపోయారు. క్షమా ఈ ఆర్డినెన్స్‌ను రూపొందించి కౌన్సిల్ లో ప్రవేశపెట్టారు.
క్షమా ఆరేళ్ల వయసులోనే పుణెలోని సొంత ఇంట్లో కుల వివక్ష అంటే ఏమిటో రుచి చూసింది. తన తాత గారు ఆ ఇంట్లో పనిచేసే కింది కులానికి చెందిన పనిమనిషిని పేరుతో కాకుండా కులం పేరుతో– అదీ కించపరిచే రీతిలో పిలవడం క్షమాను బాధపెట్టింది. అందుకే ఆమె, ‘మీరెందుకు ఆమె పేరుకు బదులు తిట్టు పదంతో ఆమెను పిలుస్తారు?’ అని తన తాతను ప్రశ్నించింది. దానికి ఆయన ‘నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు,’ అని కసురుకున్నారు.
మామూలుగా అయితే తన తాత ఎంతో ప్రేమించదగ్గ వ్యక్తి అని క్షమా గుర్తుచేసుకుంటుంది. చిన్నప్పటి ఈ అనుభవమే ప్రపంచంలో అత్యంత గొప్ప ప్రజాస్వామ్య దేశం, ధనిక దేశం అయిన అమెరికా వచ్చాక కూడా మరో రూపంలో ఆమెకు కనిపించింది. ఇండియాలో మాదిరిగానే కుల వివక్షను, కులదూషణను శిక్షార్హ నేరంగా చేయాలన్న ఆమె పట్టుదల ఎట్టకేలకు 2023 ఫిబ్రవరి 21న సియాటల్ నగరంలో కార్యరూపం దాల్చింది.
ఎందుకంటే, అమెరికాలో భారతీయులు అదే– హిందువులు ఎక్కువ మంది పనిచేసే ఐటీ– సాఫ్ట్ వేర్ రంగాల్లో అగ్రవర్ణాలకు చెందిన భారతీయులు దళితులు, వెనుకబడిన వర్గాలకు చెందిన ఉద్యోగులను కులం పేరుతో వేధించడం, వివక్ష చూపడం పెరిగింది. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఇలాంటి కేసులు అనేక నగరాల్లో రిపోర్టయ్యాయి. అమెరికా చట్టాల ప్రకారం కులం అనేది సామాజిక వివక్ష పాటించడానికి వీలైన అంశాల్లో ఒకటి కాదు. జాతి వివక్షను గుర్తించిన స్థానిక చట్టాలు- భారత సంతతి జనం చాలా వరకు పాటించే కుల వివక్షను గుర్తించలేదు.
దీంతో భారత హిందువుల్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు చెందిన బ్రాహ్మణ ఐటీ ఉద్యోగలు తమ కంపెనీల్లో పనిచేసే దళితులు, బీసీలు అయిన ఉద్యోగుల కులాల వివరాలు చట్టవిరుద్ధంగా బయటపెడుతూ వారిని ఎగతాళి చేస్తున్నారు. అంతేకాదు, వారికి సకాలంలో ప్రమోషన్లు రాకుండా అడ్డుకున్నారు. ఇలాంటి కేసులు గత ఐదేళ్లలో ఐటీ రంగం కేంద్రీకృతమైన కాలిఫోర్నియా, వాషింగ్టన్ రాష్ట్రాల్లో పెరిగాయి. ఇలాంటి వార్తలు భారత పత్రికలు, మీడియాలో కూడా ఇదివరకే వచ్చాయి.
ఎవరీ క్షమా సావంత్?
…………….
2014లో మొదటిసారి సియాటల్ నగర కౌన్సిల్‌కి ఎన్నికైన మహిళ క్షమా సావంత్. ఆమె పుణెలో స్థిరపడిన తమిళ బ్రాహ్మణ కుటుంబంలో 50 ఏళ్ల క్రితం జన్మించారు. ఎచ్.టీ, వసుంధరా రామానుజం అనే మధ్యతరగతి తమిళ బ్రాహ్మణుల ఇంట ఆమె పుట్టినా, మరాఠీ అయిన వివేక్ సావంత్‌ను పెళ్లాడి, అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. భారతదేశంలోని పేదరికం, అమెరికాలోని ఆర్థిక అసమానతలు క్షమాను సోషలిస్టుగా మార్చాయి. ఆమె అమెరికాలోని డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీల్లో చేరకుండా సోషలిస్టు ఆల్టర్నేటివ్ అభ్యర్థిగానే మూడుసార్లు సియాటల్ సిటీ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు.
2013 ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను తన భర్త వివేక్ నుంచి విడిగా జీవిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. 2016లో వివేక్ నుంచి విడాకులు తీసుకుని, స్థానిక అమెరికన్ కాల్విన్ ప్రీస్ట్ ను పెళ్లాడారు. 2012 ఎన్నికల్లో వాషింగ్టన్ స్టేట్ ప్రతినిధుల సభకు పోటీచేసి ఓడిపోయినా క్షమా రాజకీయాల నుంచి విరమించుకోకుండా, 2014 నుంచీ విజయపథంలో పయనించారు. 2023 చివరిలో ప్రస్తుత పదవి (సిటీ కౌన్సిల్ సభ్యత్వం) నుంచి కూడా వైదొలుగుతానని గతంలోనే క్షమా ప్రకటించారు. భారత బ్రాహ్మణ మహిళలకు క్షమా ఆదర్శం అవుతుందనడంలో సందేహం లేదు…
Share this Article