ఎవరో అడిగారు… ఆర్ఆర్ఆర్ నిర్మాత ఎవరు..? చటుక్కున గుర్తురాలేదు… దిల్ రాజు, దగ్గుబాటి సురేష్ వంటి నిర్మాతలైతే గుర్తొచ్చేదేమో… సినిమా ప్రమోషన్లలో, వసూళ్ల సక్సెస్ మీట్లలో, ఆడియో రిలీజుల్లో, ప్రిరిలీజ్ ఫంక్షన్లలో, పోస్టర్ విడుదల సమయంలో, టీజర్ల వేళో ఎప్పుడైనా నిర్మాతగా హడావుడి చేసి ఉంటే మన మైండ్లలో ఇంప్రెషన్ పడి ఉండేది… కానీ…
ఆర్ఆర్ఆర్ అంటే జస్ట్, రాజమౌళి… తరువాత రాంచరణ్, జూనియర్… ఈమధ్య గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చాక నాటు కీరవాణి… అంతే, ఇక ఎవరి పేరూ లేదు, ఎవరి ఊసూ లేదు… ఒక కోణంలో దర్శకుడికి ఇంత విలువ పెరగడం, నిర్మాతను జస్ట్, ఓ ఫైనాన్షియర్‌గా చూడటం మంచిదే, ఎక్కడా వేలు పెట్టకుండా రాజమౌళి భలే మేనేజ్ చేస్తున్నాడు కదా అనిపిస్తుంది… కానీ రిస్క్ తీసుకునేది, అక్కడా ఇక్కడా డబ్బు తెచ్చి, ఫైనాన్స్ కోసం నానా పాట్లు పడేది నిర్మాత… పైగా భారీ, అత్యంత భారీ బడ్జెట్… తేడా కొడితే సప్త సముద్రాల్లో మునిగిపోవడమే…
బడ్జెట్ స్థాయిలోనే భారీ పారితోషికాలు తీసుకున్న హీరోలు, దర్శకుడు, సంగీత దర్శకుడు అందరూ బాగానే ఉంటారు… కానీ నిర్మాత..? ఇంతకీ నిర్మాత పేరు చెప్పనే లేదు కదూ… దానయ్య… దాసరి వీర వెంకట దానయ్య… వెరసి డీవీవీ దానయ్య… పశ్చిమగోదావరి కాపు… సో, మరీ దారినబోయే దానయ్య ఏమీ కాదు… కాస్త పేరున్న నిర్మాతే… కానీ రాజమౌళి పూర్తిగా డామినేట్ చేసి, ఆ మొహం, ఆ పేరు కనిపించకుండా చేసేశాడు… ః
Ads
నాటు నాటు పాటకు అవార్డు వస్తే జస్ట్, కీరవాణి, రాజమౌళి కనిపిస్తారు… వాళ్లే మాట్లాడతారు… మీడియా వాళ్లనే హైలైట్ చేస్తుంది… పాడిన రాహుల్ సిప్లిగంజ్, రాసిన చంద్రబోస్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ జాడ కనిపించదు… మరి దీన్ని బలంగా ఓన్ చేసుకోవల్సిన వ్యక్తుల్లో పాపం నిర్మాత కూడా ఉండాలిగా… ఎక్కడా జాడ లేడు… ఏ వేదిక మీద కూడా కనిపించలేదు…
అసలు ఆర్ఆర్ఆర్ జపాన్ ప్రమోషన్లలో గానీ, శాన్ ఫ్రాన్సిస్‌కో అవార్డుల పైరవీల వేళ గానీ దానయ్య పత్తాజాడ లేదు… నిర్మాత మరీ అంత చీప్ అయిపోయిండా అని గుర్రుమనకండి… హేమో, ఏ పరిస్థితిలో అలా తెరవెనుకే ఉండిపోయాడో మనకేం తెలుసు… పోనీ, బయటికి వచ్చి వేదికల మీద కనిపించడం లేదు సరే, కనీసం వీళ్లయినా అప్పుడప్పుడైనా ఆయన పేరు ప్రస్తావించాలి కదా అంటారా..? అది నిజమే… హేమో, దానికీ ఏమైనా కిరికిరి అడ్డం వస్తుందేమో… రాజమౌళికే తెలియాలి… దిల్ రాజు డబ్బులు పెట్టి ఉంటే ఇలాగే ఉండేదా రాజమౌళీ సాబ్… అలా ఉండదు కాబట్టి ఆయన్ని లైట్ తీసుకున్నారా..?!
Share this Article