హమ్మయ్య… క్లారిటీ వచ్చేసినట్టే ఇక…! కేసీయార్ ఎందుకిలా చేస్తున్నాడో నిజానికి కేసీయార్‌కు క్లారిటీ ఉందో లేదో తెలియదు గానీ… ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పూనుకుని.., ‘‘‘తమ్ముడూ కేసీయారూ… నువ్వు ఎందుకిలా చేస్తున్నావో తెలుసా..? ఇదుగో నేను చెబుతాను విను, క్లారిటీ తెచ్చుకో, అసలే నీ తత్వం నీకు తెలియదు...’’’ అన్నంత ఇదిగా రాసిపారేశాడు… సారు గారు ఢిల్లీకి వెళ్లొచ్చాక, మోడీ మీద పోరాటానికి పదునుపెట్టించిన కత్తులన్నీ స్టోర్‌రూంలో పారేసి, రాష్ట్రంలో ఉన్నది కాషాయ ప్రభుత్వమా అన్నట్టుగా బోలెడు యూటర్న్లు, కేంద్ర పథకాలకు మద్దతులు ఎడాపెడా ప్రకటించేస్తున్న సంగతి తెలుసు కదా… నాలుగు రోజులయ్యాక మళ్లీ వెనక్కి తిరిగి చూసుకుంటే, అర్రె, అర్రెర్రె, ఈ నిర్ణయాలు నేనే తీసుకున్నానా అని కేసీయారే బోలెడంత హాశ్చర్యపోతాడేమో…
మరి దీనికి కారణంబెద్ది..? అసలు ఏమైంది కేసీయార్‌కు..? ఈ ప్రశ్నలు తెలంగాణ సమాజాన్ని వేధిస్తున్నాయి కదా… రాధాకృష్ణ ఏమంటాడంటే… ‘‘టీఆర్ఎస్ వాళ్లు, కాంగ్రెస్ వాళ్లు పెద్ద ఎత్తున బీజేపీలోకి చేరకుండా ఉండాలంటే అనుమానాల్ని రేకెత్తించాలి.., టీఆర్ఎస్-బీజేపీ కలిసి పనిచేయబోతున్నాయేమో అనే వాతావరణాన్ని సృష్టించాలి… ఆ దెబ్బకు ఎవరి పార్టీలో వాళ్లు ఉండిపోతారు… రెండేళ్ల క్రితం కేసీయార్ అదే పనిచేశాడు… ఇప్పుడూ అదే చేస్తున్నాడు…’’
Ads
సరే గానీ ఆర్కే సార్… ఒకటీరెండు చొప్పదంటు ప్రశ్నలు…
- బీజేపీలోకి చేరికలు లేకుండా కేసీయార్ పెద్ద ప్లానే వేశాడు సరే… కానీ ఈమాత్రం తెలుసుకునే సోయి ఢిల్లీ బీజేపీకి లేదంటావా..? మీరు కొట్లాడండి అని రాష్ట్ర పార్టీకి క్లారిటీ ఇచ్చి ఉండదా..?
- పర్ సపోజ్, అనుమానాస్పద వాతావరణం ఏర్పడటమే కేసీయార్‌కు మంచిది అనుకుందాం… అది ఇప్పుడే ఎందుకు అవసరం..? నాలుగు లోకసభ స్థానాలు బీజేపీ గెలుచుకున్నప్పుడు అవసరపడలేదా..?
- బీజేపీలో అంత భారీ చేరికలు ఉండేదుంటే అప్పుడే జరిగేవి కదా… ఈ దుబ్బాక, ఈ గ్రేటర్ అయ్యాక కూడా వచ్చి చేరినోడు ఎవరు..? బీజేపీ వైపు చూస్తున్నది ఎవరు..? అంతకుముందు చేరినవాళ్లనే పనిచేయకుండా చేసి, పార్టీ నుంచి పారిపోయేట్టు చేసిన కథలు టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి బయటపడాలనుకునే నేతలకు తెలియవా..?
నా ఇష్టం వచ్చింది నేను రాస్తాను, నీ ఇష్టముంటే చదువు, లేకపోతే మూసుకో అనే తమరి వైఖరి అప్పుడప్పుడూ విస్తుపరుస్తుంది…
ఎట్టెట్టా… మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఏదో చికిత్స కోసం తన భార్యను తీసుకుని హైదరాబాద్ వచ్చాడు… హోటల్లో బసచేశాడు… పూర్తిగా ప్రైవేటు వ్యవహారం… ఐనా సరే, ఒక సీఎం మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు… ఇద్దరూ కలవడం అనేది ఓ ఆనవాయితీ… చౌహాన్ భార్య అనారోగ్యం బాపతు విచారంలో ఉన్నాడు కాబట్టి… కేసీయార్ తనే వెళ్లి, పరామర్శించాడు… అది మర్యాద… ఇద్దరు సీఎంలు కలిసినప్పుడు కచ్చితంగా రాజకీయాలు, ప్రస్తుత పరిస్థితుల మీద చర్చ రాకుండా ఎలా ఉంటుంది..? వచ్చే ఉంటుంది..?
ఏం..? వివాాదాలు ఉంటే తప్ప సీఎంలు కలవకూడదా..? కంటికి కనిపించే ప్రయోజనాలు ఉంటే తప్ప కలవకూడదా..? బీజేపీతో తాను కలిసి పనిచేయబోతున్నాను అని చెప్పడానికి కేసీయార్ చాలా తెలివిగా చౌహాన్‌ను కలిశాడా..? వారెవ్వా… ఏం రాశావు సారూ..? కేసీయార్ ఉద్దేశం అదే అనుకుందాం… ఏకంగా మోడీని, అమిత్ షాను కలిసి వచ్చిన సంకేతాలకు మించి బలంగా ఉంటాయా చౌహాన్‌ను కలిసిన సంకేతాలు..? కేంద్ర బీజేపీ విధానాల్ని చౌహాన్ నిర్దేశించే స్థితిలో ఏమీ లేడుగా…
చౌహాన్ మాత్రమే కాదు… పళనిస్వామి, నవీన్ పట్నాయక్, ఉద్దవ్ ఠాక్రే హైదరాబాద్ వచ్చినా సరే కేసీయార్ కలుస్తాడు… లేదా వాళ్లే సీఎంతో భేటీ అవుతారు… సో వాట్..? ఎహె, లేదు, లేదు… కేసీయార్- చౌహాన్ కలయిక వెనుక భారీ మైండ్ గేమ్ ఉంది, మీలాంటి మట్టిబుర్రలకు అర్థం కాదు, అసలు కేసీయార్ ఒక పొరుగు సీఎంను కలవడం అంటే మజాక్ కాదు అంటావా..? సరే.., కేసీయార్ ఈ ప్రపంచంలో ఎవరికైనా సరిగ్గా అర్థం అవుతాడూ అంటే… అది కేవలం రాధాకృష్ణ ఒక్కడికే… కేసీయార్ అడుగులు కేసీయార్‌కు కూడా అంతుపట్టవు ఆర్కేకు తెలిసినంతగా…!!
Share this Article