.
సినిమా సెలబ్రిటీల్లో అధికశాతం తమకు అన్నీ తెలుసు, బాగా తెలుసు, మేమే తోపులం అనే ఫీలింగ్స్ ఎక్కువ… తెర మీద కాదు, బయట కూడా అవే ప్రదర్శిస్తుంటారు… జనం నవ్వుకున్నా సరే… మీడియా కూడా అవన్నీ రాస్తూ తనూ నవ్వుకుంటుంది…
తాజాగా దీపిక చికిలియా వార్త అలాగే ఉంది… ఈమె ఎవరు అని ఆలోచిస్తున్నారా..? అలనాటి టీవీ సీరియల్ రామాయణంలో సీత పాత్ర పోషించింది… అప్పట్లో చాలా పాపులర్ సీరియల్ అది… సరే.., రణబీర్‌కపూర్, యశ్, సాయిపల్లవి ఎట్సైెట్రా నటిస్తున్న రామాయణం ఇప్పుడు వార్తల్లో ఉంటోంది కదా… తాజాగా గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు కదా…
Ads
‘‘నాకు ఏ పాత్రకూ అడగలేదు, కనీసం నాకు ఓ కాల్ కూడా రాలేదు’’ అని బాధపడుతోందట… నిన్నామొన్నా బోలెడుమంది రాసేశారు… వాటీజ్ దిస్, ఒరిజినల్ సీత ఇగ్నోర్డ్, అన్‌ఫెయిర్, క్లాసిక్ లెగసీకి భంగపాటు అని ఏవేవో కూశారు… ఈ కొత్త రామాయణంలో ఆమె లేకపోతే ఎలా అంటున్నారు.., ఫ్యాన్స్ అలా ఫీలవుతున్నారు అని కవరింగు దానికి…
- అమ్మా, దీపికా… ఇది దీపిక పడుకోన్ కాలం, దీపిక చికిలియా కాలం కాదు… ఇంకా చెప్పాలంటే తెలుగు టీవీల్లో దీపిక పిల్లి, దీపిక రంగరాజుల కాలం… అంతే, ఐనా ఈ వయస్సులో ఏ పాత్రకు తీసుకోవాలి నిన్ను..? త్రిజట పాత్రా..? మంథర పాత్రా..? అసలు ఈ ఒరిజినల్ సీత అనే ముద్ర ఏమిటి, అది ఓ లెగసీ ఏమిటి..? ఏదో యాభైలు, అరవైల నాటి టీవీ ప్రేక్షకులకు తెలుసు ఆమె… తరువాత రెండు తరాలకూ ఆమె పేరే తెలియదు కదా…
పైగా ఆమెను కొత్త రామాయణంలో తీసుకోకపోతే ఆ క్లాసిక్ లెగసీకి భంగపాటు అట… పిచ్చి కూతలు, రాతలు… ఇదే దీపిక ఆదిపురుష్ సినిమా సమయంలో మేం తీసింది, చేసిందే రామాయణం, ఇప్పుడు ఎవరూ రామాయణం తీయకపోతేనే బెటర్ అని కూసింది… వీళ్లకేవో పేటెంట్ రైట్స్ దఖలుపడినట్టు..?!
‘‘రామ్ తేరీ గంగా మైలీ’’ అనే సినిమాలో మందాకిని బదులు ముందుగా ఈమెనే అనుకున్నారట… ఆ చిచోరా పాత్ర చేయకపోవడమే మంచిదైంది, లేకపోతే నన్ను సీతగా ప్రేక్షకులు అంగీకరించేవాళ్లు కాదు అని ఆమధ్య ఏదో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది… ఉత్త నాన్సెన్స్ మాట… పైగా ఆమే ఇప్పుడు రామాయణం టీం నుంచి నాకు కాల్ రాలేదు అని బాధపడుతోంది…
అంతకుముందు పిచ్చి పిచ్చి వేషాలు వేసిన నయనతారను బాపు శ్రీరామరాజ్యం సినిమాలో సీతగా తీర్చిదిద్దలేదా..? బాగా చేసింది, జనం యాక్సెప్ట్ చేశారు కదా… అదే టీవీ రామాయణంలో లక్ష్మణుడి పాత్ర వేసిన సునీల్ లాహ్రి కూడా ఇలాగే అభిప్రాయపడ్డాడు… యానిమల్ పాత్ర చేశాక రణబీర్‌కపూర్‌ను రాముడిగా చూస్తారా జనం అంటున్నాడు…
ఎందుకు చూడరు..? ముందే ఈ ముద్రలు దేనికి..? అంతెందుకు..? ఇదే సునీల్ లాహ్రి లక్ష్మణుడి పాత్రకు నప్పకపోయినా జనం చూడలేదా..,? పైగా సాయిపల్లవి సీత పాత్రకు సూట్ కాదు అన్నాడు… ఆమె రోల్స్ నేను ఏమీ చూడలేదు అంటూనే, సీత పాత్రకు కరెక్టు కాదని ఎలా అంటాడు..? అసలు టీవీ సీత పాత్రకు ముందు ఇదే దీపిక చికిలియా చిన్న చిన్న వేషాలు వేసుకునేది, సీతగా జనం యాక్సెప్ట్ చేయలేదా…?
ఆ ఆదిపురుష్ అనే పెద్ద రాడ్ భరించిన ప్రేక్షకులు ఈ కొత్త రామాయణాన్ని భరించలేరా..? నడుమ ఈ పిచ్చి కూతలు, రాతలు దేనికి..? ‘‘జస్ట్, కొందరు నటులు, కొన్ని పాత్రలు’’… అంతే..! టీవీ రామాయణం కాలం వేరు, రాముడి వేషం వేసిన అరుణ్ గోవిల్, సీత పాత్ర చేసిన దీపిక ఎక్కడ కనిపించినా జనం మొక్కేవాళ్లు అట… వాళ్లు మొక్కేది ఆ నటులను కాదు, వారు పోషించిన ఆ పాత్రలను…! అదీ తేడా..!!
Share this Article