Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జాక్ మా గుర్తున్నాడా..? చివరకు చైనాను వదిలేసి ప్రవాసం వెళ్లిపోయాడు..!

December 2, 2022 by M S R

చైనా దిగ్గజ పారిశ్రామికవేత్త, అలీబాబా వ్యవస్థాపకుడు, చైనాలో అత్యంత ధనికుడు జాక్ మా గుర్తున్నాడా ఎవరికైనా..? లేదు, కనిపించడం లేదు… ఎక్కడా ఆయన వార్తలేమీ వినిపించడం లేదు… అసలు ఆయన ఉనికే చాలామంది తెలియకుండా పోయింది… చైనాలో అంతే… అక్కడి ప్రభుత్వం ఉక్కుచట్రంలో తనను బిగించడం ప్రారంభమయ్యాక తన లక్షల కోట్ల వ్యాపారం ఘోరంగా దెబ్బతినిపోయింది… ఓ ఉధృత వ్యాపార కెరటం విరిగిపడింది… గుర్తున్నాయా..?

గత ఏప్రిల్‌లో వచ్చిన వార్తలు… స్టాన్ఫోర్డ్ లాంటి బిజినెస్ మేనేజ్మెంట్ ఆంతర్జాతీయ అత్యున్నత కాలేజి అరుగుల మీద జాక్ వ్యాపారం మెళకువలు చెబుతుంటే, ప్రపంచమంతా చెవి ఒగ్గి, ఆరాధనగా, తాదాత్మ్యంతో విన్నది. ఆయన అలీబాబా ఆన్ లైన్ మార్కెటింగ్ విద్య ఏదో ఒకనాడు పద్నాలుగు భువన భాండాలు ఆక్రమిస్తుందని అంచనాలు వేశారు. ఏమీ లేని చోటు నుండి లక్షల కోట్ల ఆన్ లైన్ వ్యాపార సామ్రాజ్యం నిర్మించి, ఆపై అనేక రంగాలకు విస్తరించి, ప్రపంచమంతా పెట్టుబడులు పెట్టిన జాక్ విజయగాథ ఎవరికయినా స్ఫూర్తిదాయకమే. అతని దూరదృష్టి, వ్యాపారాల నిర్వహణా దక్షత నిజంగా బిజినెస్ మేనేజ్మెంట్ కు పాఠమే…

jack

Ads

ఎటొచ్చి- ఏదో ఒక రంగంలో కీర్తి ప్రతిష్ఠలు, పేరు ప్రఖ్యాతులు, డబ్బు, హోదా రాగానే- వారు ప్రపంచానికి తమ అనుభవాలను చెప్పాలనుకుంటారు. తమ అభిప్రాయాలు ప్రపంచానికి అవసరమనుకుంటారు. అన్ని విషయాలకు స్పందించాలనుకుంటారు. ప్రపంచంలో జరిగే మంచి చెడుల మీద కనీసం చిట్టి పొట్టి మాటలతో ట్విట్టాలనుకుంటారు. అలా జాక్ కూడా మాట్లాడ్డం మొదలు పెట్టాడు.

అది ఇండియా కాదు కదా… ఇక్కడయితే రాష్ట్రపతి, ప్రధాని భార్య- పిల్లల వ్యక్తిగత విషయాలు కూడా ఇక్కడ డిబేటబుల్. అది చైనా. పేరుకే వామపక్ష పాలన. జెండా రంగులో ఎరుపు తప్ప- ఆ వామపక్ష వర్ణం ఇక్కడి మన వర్ణంలా ఉండదు. నియంతలకే చుక్కలు చూపే ఎరుపు రంగు పాలన అది. చైనా ప్రభుత్వ విధానాల మీద జాక్ అసహనం వ్యక్తం చేస్తూ మాట్లాడ్డం మొదలు పెట్టాడో లేదో అతని మీద, అతని వ్యాపారాల మీద చైనా ప్రభుత్వం అధికారికంగా నిఘా పెట్టింది. అంతే- దెబ్బకు ఆరు నెలలు జాక్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.

ఫేస్ బుక్ ఉలుకు లేదు. ట్విట్టర్ పలుకు లేదు. జాక్ కంపెనీల అంతర్జాతీయ పెట్టుబడుల చిట్టాలన్నీ చైనా పెట్టుబడుల చట్టం పరిధిలోనే ఉన్నాయా? లేవా? అని తవ్వకాలు మొదలయ్యాయి. భవిష్యత్తులో జాక్ అంత ఎత్తుకు ఎదగడానికి అవకాశమున్న మరో ముప్పయ్ అతిపెద్ద చైనా కంపెనీలను కూడా పనిలో పనిగా జల్లెడ పడుతున్నారు.

జాక్ అలీబాబా కంపెనీకి సెగ మొదలయ్యింది. పొమ్మనలేక పెట్టిన పొగ చుట్టుకుంటోంది. ఉంటే చైనాలో నోరు మూసుకుని ఉండు. పొతే చిప్ప చేతికిస్తాం- బయటెక్కడయినా అడుక్కు తిని బతుకు- అని చైనా స్పష్టంగా తన చేతలతో చెప్పింది. ఇప్పటికే కంపెనీల మార్కెట్ విలువ సగానికి సగం పడిపోయి జాక్ మాకు దిక్కు తోచడం లేదు. జాక్ కంపెనీల్లో చైనా అధికారిక డేటా మీద అనుమానాలను రేకెత్తించారు… ఆ జాక్ మా తరువాత ఏమయ్యాడు..? ఇప్పుడెక్కడున్నాడు..? ఏం చేస్తున్నాడు..?

alibaba

బ్రిటన్ ఫైనాన్షియల్ టైమ్స్ ఓ వార్త ప్రచురించింది… దాని ప్రకారం… ఆయన జపాన్ రాజధాని టోక్యోకు వెళ్లిపోయాడు… ఆరు నెలలైంది.,. అక్కడే ఉంటున్నాడు… తరచూ అమెరికా, ఇజ్రాయిల్‌లో పర్యటిస్తున్నాడు… వ్యక్తిగత వంటమనిషి, భద్రత సిబ్బంది మాత్రమే తనతో ఉంటున్నారు… టోక్యోలో ఎలాంటి హడావుడి లేకుండా చాలా సాధారణ జీవితం గడుపుతున్నాడు… వీలైనంతవరకూ మీడియా ఫోకస్‌లోకి రాకుండా, జనజీవన స్రవంతికి దూరంగా ఉంటున్నాడు…

టోక్యో నడిబొడ్డున ఉన్న క్లబ్బులో ఎక్కువగా సేదదీరుతున్న జాక్ మా ఈమధ్య ఆధునిక కళారూపాల సేకరణ మీద ఆసక్తి చూపిస్తున్నాడు… కాలక్షేపం కోసం వాటర్ కలర్స్‌తో పెయింటింగ్స్ వేస్తున్నాడు స్వయంగా… రెండు ప్రధాన కంపెనీల కీలక బాధ్యతల్ని కొత్తతరానికి అప్పగించాడు… జపాన్ నుంచే తన వ్యాపారాన్ని కొత్త రంగాలకు విస్తరించే ప్రణాళికల్లో ఉన్నాడు… కరోనా కాలంలో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా మాస్కులు పంపిణీ చేసి, వెలుగులోకి వచ్చిన జాక్ మా ఫౌండేషన్ తన కార్యక్రమాల్ని బాగా తగ్గించేసింది… ఒకప్పటి స్టాల్‌వార్ట్ జాక్‌మా ఉరుకులు పరుగుల జీవనశైలిని, ప్రస్తుత ప్రశాంత ప్రవాస జీవనాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏడీ..? ఏమైపోయాడు నేను ప్రేమించిన ఆ నా మణిరత్నం..?!
  • భారీ డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్… హిందీవాడు అడ్డంగా ఛీకొట్టేశాడు…
  • అమెరికా అధ్యక్షుడు… ఆ టేబుల్‌కు ఆ రెండు ఇంపార్టెంట్ బటన్లు…
  • తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాక..! అసలు దోషి ఎవరు..?!
  • మహేష్ బాబును త్వరగా పంపించేయండి, నిద్రకు ఆగలేడు… కెవ్వు కేక..!!
  • మిలమిల మెరిసిన తార… వెన్నెల పైటేసిన కిన్నెరసాని…
  • అల్లరి నవ్వుల అల్లు రామలింగయ్య … మనెవ్వరికీ తెలియని ఓ ఫ్లాష్ బ్యాక్ …
  • సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…
  • పార్లె జీ బిస్కట్స్… ఈసారి విషాద వార్తల్లోకి… అంతర్జాతీయ ఖ్యాతితో…
  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions