.
మీకు గుర్తున్నాయా..? కేసీయార్ కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు బయటపడిన ఈఎస్ఐ బిల్డింగ్, సహారా పీఎఫ్ స్కామ్‌లు… ఇప్పుడు హఠాత్తుగా అవెందుకు గుర్తుకొస్తున్నాయీ అంటే..? నిన్న సహారా స్కామ్ మీద ఈడీ చార్జి షీట్ దాఖలు చేసింది… 1.74 లక్షల కోట్ల కుంభకోణం అది…
ఆ ఈడీ చార్జిషీటు వార్తలు చదువుతూ ఉంటే… కేసీయార్ మీద అప్పట్లో వచ్చిన ఆరోపణలు, రాజకీయ విమర్శలు గట్రా గుర్తొచ్చాయి… ఎలాగూ కాళేశ్వరం అక్రమాల కేసును సీబీఐకి ఇస్తున్నారు కదా… ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ చేతకాదు, ఫోన్ ట్యాపింగ్ వంటి కేసులు కూడా సీబీఐకి అప్పగిస్తే, కేసీయార్ అవినీతి యవ్వారాలన్నీ బయటపెట్టి శిక్షిస్తామని కదా కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు…
Ads
సో, కాళేశ్వరం సీబీఐ కేసు నేపథ్యంలో ఆ పాత కేసులూ ఇప్పుడు ప్రస్తావనార్హమే… రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీయార్ పాల్పడిన అక్రమాల కథల్ని కాసేపు పక్కన పెడితే… గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పాల్పడిన అక్రమాల కథలు అప్పట్లో బాగా చర్చనీయాంశాలు… గుర్తుందా..? అప్పట్లో వెలుగుబంటి సూర్యనారాయణ స్కామ్స్…
చాలా చిన్న ఫిషరీస్ శాఖలో ఓ ఇంజినీర్… ఆ శాఖకు వందల కోట్ల కంట్రాక్టు పనులు అలవోకగా వచ్చేవి.,. నాయకులు ఇచ్చేవారు కంట్రాక్టులు… వైఎస్ ప్రభుత్వ హయాంలో బయటపడ్డ భారీ కమీషన్ల స్కామ్ అది… యూపీఏ-1 హయాంలో (2004-09) కార్మిక మంత్రి కదా కేసీయార్… తను కూడా ఈఎస్ఐ బిల్డింగ్ వంటివి ఇదే వెలుగుబంటికి ఇచ్చాడనేది అప్పట్లో వార్తాంశం… (ఇప్పుడు ఆ వెలుగుబంటి ఏమయ్యాడో ఎవరికీ తెలియదు)…
తరువాత వినిపించిన మరో ప్రధాన ఆరోపణ ఏమిటంటే… నిన్న 1.74 లక్షల కోట్ల కుంభకోణంపై ఈడీ చార్జి షీటు దాఖలు చేయబడిన సంస్థ సహారాకు కేసీయార్ చేసిన PF సాయం… ఇదీ అప్పట్లో సెన్సేషనల్… సహారా గ్రూపుకి సంబంధించిన ఐదు కంపెనీల ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలను తామే స్వయంగా నిర్వహించుకుంటామని సహారా గ్రూపు దరఖాస్తు చేసుకుంది..,
వెంటనే EPFO అభ్యంతరాలను కూడా పక్కనపడేసి అప్పటి కేంద్ర కార్మిక మంత్రి కేసీఆర్ సహారా గ్రూపు కంపెనీలకు ‘‘అడిగిన మినహాయింపు’’లను ఇచ్చాడు… అది కొన్ని వేల కోట్ల అక్రమం అని అప్పట్లో వార్తల సారాంశం… ఆ తరువాత కార్మిక శాఖ మంత్రిగా వచ్చిన ఆస్కార్ ఫెర్నాండేజ్ కేసీఆర్ హయంలో అవినీతి జరిగిందని ఒప్పుకుని విచారణకు కూడా ఆదేశించాడు… ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు… అంతా మిస్టరీగా మిగిలింది…
(అప్పట్లో కేసీయార్‌కు ఓఎస్డీగా ఉన్న రాజశేఖర్ రెడ్డి తరువాత కేసీయార్ సీఎం అయ్యాక సీఎం కార్యాలయ కార్యదర్శిగా చేరాడు…)
- (ఇది అప్పట్లో ఆంధ్రజ్యోతి వార్త క్లిప్పింగ్… అప్పటి కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్‌తో కేసీయార్ ఏకాంతంగా భేటీ అయ్యాడనే వార్త కూడా ఉంది ఇందులోనే…)
సహారా చీఫ్ సుబ్రతారాయ్ 2023 నవంబర్ 14న మరణించాడు… తన కుటుంబీకులు ఇప్పుడు ఆ కేసు ఎదుర్కొంటున్నారు. కొన్ని ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసింది…. ఇన్నాళ్లకు ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది… (అందుకే కాళేశ్వరం వంటి భారీ అక్రమాల కేసులను సీబీఐ గానీ, గొర్ల స్కాం వంటి కేసుల్ని ఈడీ గానీ ఎంత వేగంగా పరిష్కరిస్తాయనేది అందరిలోనూ సందేహం…)
రాష్ట్ర మంత్రి, ఒకప్పటి పీసీసీ అధ్యక్షుడు 2018లో ఓ ప్రెస్ మీట్ పెట్టాడు పీపుల్స్ ఫ్రంట్ పేరిట… ఈఎస్ఐ బిల్డింగ్, సహారా పీఎఫ్ స్కాంల చార్జిషీట్ల నుంచి సీబీఐ కేసీయార్ పేరు డ్రాప్ చేసిందనీ… మోడీకి, కేసీయార్‌కు నడుమ అక్రమ బంధానికీ ఇదే సాక్ష్యమనీ… ఈ కేసులున్నాయి గనుకే పదే పదే ఢిల్లీకి వెళ్లి, మోడీని ప్రసన్నం చేసుకుని కేసీయార్ బయటపడ్డాడనీ చెప్పుకొచ్చాడు…
2021 లో… ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఓ మీడియా చిట్‌చాట్‌లో (అప్పుడు తను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు) మాట్లాడుతూ ఈఎస్ఐ బిల్డింగ్, సహారా పీఎఫ్ స్కాంలపై పునఃదర్యాప్తు జరిపిస్తామనీ, కేసీయార్ జైలుకు వెళ్లకతప్పదనీ చెప్పుకొచ్చాడు… ఇదే ఉత్తమకుమార్ రెడ్డి, ఇదే బండి సంజయ్ ఇప్పుడేమంటారో..!!
- (ఈ ప్రకటనలు చేస్తున్న సమయాల్లో ఇద్దరూ రెండు జాతీయ పార్టీలకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు)…
- కాళేశ్వరం కేసు సీబీఐకి ఇస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాక సత్వరం స్పందించిన బీజేపీ నాయకుడు కూడా బండి సంజయుడే…!!
- (సో, కేసీయార్‌కు సీబీఐ కొత్తేమీ కాదు).,.
- నువ్వు గోకూ గోకకపో, నే గోకుతూనే ఉంటా… అని ఆమధ్య మోడీని కేసీయార్ హెచ్చరించిన తీరూ గుర్తొస్తోంది…
- కవితక్కకు కూడా గుర్తుండే ఉంటుంది…
Share this Article