Website పెట్టాలనుకుంటున్నారా? YouTube ఛానల్ స్టార్ట్ చేస్తున్నారా ?
ఎన్నికల సీజన్లో కొత్త ఛానళ్ల హడావుడి మామూలే కానీ ఈ ఎన్నికల ఫలితాల తరువాత చాలామంది వెబ్సైట్ పెడితే ఎలా ఉంటుంది? YouTube ఛానల్ పెడితే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. లక్ష్యం లేకుండా ఏ నిర్ణయం తీసుకోకుడదు. ఏ లక్ష్యంతో వెబ్సైట్ కానీ ఛానల్ కానీ పెడదామనుకుంటున్నారు?
1. వ్యక్తిగత గుర్తింపు తెచ్చుకోవటం
2. డబ్బు సంపాదించటం
3. పెద్ద లక్ష్యం ఏమి లేకుండానే నష్టం రాకుండా నడపటం
4. ఆర్ధిక నష్టం వచ్చినా పర్లేదు ఒక బ్రాండ్ ఇమేజి కోసం నడపటం
5. నిజమైన జర్నలిజం కోసం
Ads
మీరు ఎవరైనా వెబ్సైట్ లేదా ఛానల్ పెట్టాలి అనుకుంటే మీ లక్ష్యం ఏమిటో నిర్ధారించుకోండి. చివరి నుంచి మొదటికి చూస్తే ..
నిజమైన జర్నలిజం .. ఇదో బ్రహ్మపదార్ధం. వెబ్సైట్ లేదా ఛానల్ మొదలు పెట్టిన ఆరు నెలలకు కూడా దీని అర్ధం ఏమిటో మీరు నిర్వచించలేరు. మొదట మీరు అనుకున్న దానికి ఆరు నెలల తరువాత జరుగుతున్న తీరుకు పొంతన ఉండదు .. అక్కడి నుంచి శైలి మారటం మొదలవుతుంది.
లేదు మేము నికార్సుగా నడపగలం అనుకుంటే All The Best .. కానీ ఆర్ధిక నష్టానికి మాత్రం ముందే సంసిద్ధం కండి .
బ్రాండ్ ఇమేజ్ .. ఎక్కువ మందిని వెబ్సైట్ లేదా ఛానల్ పెట్టే విధంగా ప్రోత్సహిస్తుంది ఇదే. బ్రాండ్ ఇమేజ్ .. 2015/ 2016లో మొదలు పెట్టిన అనేక మందిలో ఒక రెండు మూడు వెబ్సైట్స్ & ఛానల్స్ ఈ లక్ష్యాన్ని అందుకున్నాయి, ఆర్ధికంగా కూడా బాగానే కలిసివచ్చింది. కానీ కొన్ని పదుల మంది దెబ్బతిన్నారు.
బ్రాండ్ ఇమేజి అంటే అంతా మంచే కాదు విమర్శ, తిట్లు కూడా పడాలి. Social numbness కు అలవాటు పడాలి . ఇప్పుడున్న పదుల ఛానల్స్ (మిగిలిన వేల ఛానెల్స్ ను లెక్కలోకి తీసుకోవలసిన అవసరం లేదు ) మధ్య కొత్తగా బ్రాండ్ ఇమేజి రావాలంటే పెట్టుబడే మార్గం. ఆదాయం ఆశించకుండా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి, కనీసం 18 నెలలు నడిపిన తరువాత ఫలితం ఉండొచ్చు. పెట్టుబడి లేకుండా సెన్సేషన్ జర్నలిజం చేస్తాం అంటే .. ఈ రోజుల్లో ఏది సెన్షేషన్ కాదు, ప్రతిదీ ఊహించిందే అంటారు రీడర్స్/ వ్యూయర్స్ .
పెద్ద లక్ష్యం ఏమి లేకుండానే నష్టం రాకుండా నడపటం. ఇప్పుడు బాగా సక్సెస్ అయిన ఒక వెబ్సైట్ మరో ఛానల్ (ఇవి రెండు వ్యక్తులు నడిపేవి, కంపెనీలు కాదు.. రెండిటిలో ఐదుమంది కన్నా తక్కువ మందే పనిచేస్తారు) ఇలా మొదలు అయినవే. వారి వ్యక్తిగత టాలెంట్, అనుభవంకు ఆ నాటి పరిస్థితులు కూడా కలిసి వచ్చాయి.
ఏదో టైం పాస్ కోసం , నెలకు ఒక పాతిక నుంచి ముప్పై వేలు ఖర్చుపెడదాం అనుకునే వాళ్ళు ఇది ట్రై చేయచ్చు.. ఏమి సాధించినా అది మీ లక్ష్యం కన్నా మించిందే అవుతుంది కాబట్టి అదృష్టం కలిసి వస్తే ఆర్ధిక లాభం, బ్రాండ్ ఇమేజి కూడా రావొచ్చు లేదా మనం ట్రై చేశామ్ అనే తృప్తి మిగలొచ్చు. కానీ అదృష్టం పాత్ర చాలా తక్కువ .
డబ్బు సంపాదించటం… ఎక్కువ విశ్లేషణ అవసరం లేదు. వెబ్సైట్ లేదా ఛానల్ ద్వారా డబ్బు సంపాదించవచ్చని మీకు అనిపిస్తునందంటే, మీరు పెద్ద అవసరంలో ఉన్నట్లు లేదా వెబ్సైట్ లేదా ఛానల్ ఫైనాన్సియల్స్ తెలియదు అని . మిగిలిన వారితో పోల్చుకుంటే ఎక్కువ నష్టం “డబ్బు సంపాదించొచ్చు” అనుకున్న వారికే కలుగుతుంది. ఒకటికి పదిసార్లు ఆలోచించండి, నిర్ణయం తీసుకునే ముందు మీ మిత్రులతో కాకుండా మీరు ఇప్పటి వరకు కలిసి పనిచేయని కొత్తవారితో (అంటే ఈ లైన్లో ఉన్నవారితో) మాట్లాడండి. నాతో మాట్లాడవలసిన అవసరం లేదు, ఎందుకంటే నా సలహా వెబ్సైట్ లేదా ఛానల్ పెట్టొద్దనే.
ఇంకా మిగిలింది వ్యక్తిగత గుర్తింపు తెచ్చుకోవటం. ఇది చాలా తాత్వికమైన అంశం. గుర్తింపు అంటే? వందమందిలోనా? వెయ్యా? లక్షమందిలోనా? మనిషిని నడిపేదే ఐడెంటిటీ. ఈ ఆలోచన మంచిదే కానీ ఎలాంటి గుర్తింపు కావాలి? ఆ గుర్తింపుతో ఏమి చేయాలనే క్లారిటీ ఉండాలి. వీరికి డబ్బు అనేది by product అవుతుంది.
గుర్తింపు పొందేక్రమం చాలా కఠినమైనది. మానసిక సంఘర్షణ తీవ్రంగా ఉంటుంది. 99 మంచి విషయాలు రాసి ఒక్కదాంట్లో పొరపాటు జరిగితే రెప్యుటేషన్ దెబ్బతింటుంది. పర్ఫెక్షన్ కోసం చేసే ప్రయత్నంలో మనల్ని మనం కోల్పోతాం .. నిద్ర పట్టదు.. మెలకువ కూడా అదే ఆలోచనలతో వస్తుంది.
ఇవి కాకుండా రాజకీయ, న్యాయపరమైన ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మనకు నచ్చింది మాత్రమే రాస్తే సరిపోదు. ప్రతి సంఘటన, ముఖ్యమైన అంశాల మీద రాయాలి. అన్నీ రాసినా “ఇవన్నీ ఒకే ” కానీ అదెందుకు రాయలేదు అనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రాస్తున్నావ్, అప్పుడేమి పీకావ్ (అప్పటికి మీరు వెబ్సైట్ లేదా ఛానల్ పెట్టకపోయినా) అనేవాళ్ళు బాగా తగులుతారు.
కానీ వెబ్సైట్ లేదా ఛానల్ పెట్టి గుర్తింపు తెచ్చుకున్న వారికంటే ఫేస్ బుక్ లో రాస్తూ గుర్తింపు పొందినవాళ్లే ఎక్కువ. ఏదయినా సాధించేవరకే .. ఒక్కసారి మీకు తృప్తి కలిగిందా.. దీని కోసమా నేను ఇంత కష్టపడ్డాను, వ్యక్తిగత జీవితంలో ఇన్నీ త్యాగాలు చేసాను అనిపిస్తది. అభినవ్ బింద్రా ఇలాంటి అభిప్రాయాన్నే, అంటే ఒక్క మెడల్ కోసమా ఇంత జీవితాన్ని వదులుకుంది అని అన్నారు.
సరే, మీరు ఎవరైనా వెబ్సైట్ లేదా ఛానల్ పెట్టాలి అనుకుంటే మీ లక్ష్యాన్ని నిర్ధారించుకొని దిగండి, ప్రతి మూడు నెలలకు రివ్యూ చేసుకోండి. మీరు అనుకున్నట్లు జరిగితే ముందుకుపోండి అలా జరగటం లేదా, ధైర్యంగా ఆపేయండి. ఎవరు ఏమనుకుంటారో అనే భయం వద్దు.
ఇదంతా వ్యక్తులు గురించి రాసింది. ఏదైనా పెద్ద కంపెనీలు కొత్త ఛానల్ పెట్టాలి అనుకుంటే వారి లక్ష్యాలు వేరే ఉంటాయి. అలాంటి సంస్థలు కనీసం 18 నుంచి 24 నెలల ఖర్చులను ముందుగానే పెట్టుబడిగా పెడతాయి. రెండు లేదా మూడేళ్లు ఎలాంటి రిటర్న్ లేకుండా నడపటానికి ప్లాన్ చేసుకుంటాయి. వారికి ఛానల్ ప్రధాన వనరు కాదు. బ్రాండ్ ఇమేజి అనేది బాగా వర్తిస్తుంది.
ఇది ఎవరిని నిరుత్సాహపర్చటానికి రాయలేదు. నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించుకొని లక్ష్యాన్ని నిర్ధారించుకోండి అని చెప్పటానికే రాశాను. అన్ని ఆలోచించుకొని వెబ్సైట్ లేదా ఛానల్ పెట్టాలి అనుకునేవారికి All the very best….. [ By శివ రాచర్ల ]
Share this Article