.
కుక్కలను నడిపిస్తూ నెలకు 5 లక్షల సంపాదన
…. ఏమిటీ నమ్మడం లేదా..?
“శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని,
తనకది హీనమని తలచుకోదు”-
శునకానికి తన జన్మ గొప్పదిగానే తోస్తుంది- తనది మరీ కుక్క బతుకు అయిపోయిందని అది అనుకోదు అని అన్నమయ్య కీర్తన. అలా మనం కూడా గొప్ప మనిషి పుట్టుక పుట్టాము అని గర్వపడతాముకానీ, నిజంగా మనిషి జన్మను సార్థకం చేసుకుంటున్నామా? అన్నది అన్నమయ్య ప్రశ్న.
Ads
ఎప్పుడో 550 ఏళ్ల కిందట కాబట్టి అన్నమయ్య అలా అన్నాడు. ఇప్పుడు కుక్క బతుకు సుఖంగానే ఉంది; మనిషి బతుకే కుక్క కంటే హీనంగా ఉంది. తెలుగు భాష నిండా కుక్కపరిభాష నిందార్థంలోనే ఉంది. దీన్ని ఆధునిక శునక సుఖజీవన ప్రమాణాల ప్రకారం పునర్నిర్వచించాల్సిన అవసరముంది.
కుక్క బతుకు;
కుక్క చావు;
కుక్కను కొట్టినట్లు కొట్టడం;
కుక్కలా పడి ఉండడం;
కుక్కకున్న విశ్వాసం కూడా లేకపోవడం;
కుక్క తోక వంకర;
కుక్కకాటుకు చెప్పు దెబ్బ- ఇలా చెప్పుకుంటూ పొతే తెలుగు భాష, సామెతల నిండా కుక్కలే కుక్కలు.
వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు అని ఇందులో ప్రధానంగా రెండు రకాలు. లాబ్రడార్, గోల్డెన్ రిట్రీవర్, జర్మన్ షెపర్డ్, బిగిల్ , హౌండ్స్ ఇంకా నానాజాతిపేర్లు వాటి బ్రీడ్ నుబట్టి, పుట్టిన దేశాలనుబట్టి వచ్చిన పేర్లు. కుక్కను పెంచుకునేవారు సాధారణంగా కుక్కను కుక్క అనరు.
దానికి నామకరణ మహోత్సవం ఎస్ వీ ఆర్ చెప్పినట్లు నేత్రోత్సవంగా చేసి ఉంటారు కాబట్టి ఆ పేరుతోనే గౌరవంగా, ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు.
“మా యజమానులు కుక్కలను చూసుకుంటున్నారు; వారి పిల్లలను మేము చూసుకుంటున్నాం;
మమ్మల్ను ఎవరూ చూసుకోరు”- అని కలవారి ఇళ్లల్లో పనిమనుషులు స్వగతంలో విసుక్కుంటూ ఉంటారని లోక అపవాదం.
వీధి కుక్కల బతుకు పోరాటం సరిగ్గా గుర్తింపు పొందలేదేమో అనిపిస్తుంది. వ్యక్తిత్వ వికాస తరగతుల్లో వీధి కుక్కల పాఠాలు స్ఫూర్తిదాయకం కాగలవు.
వీధి కుక్క అన్న మాటలోనే భౌగోళికమయిన సరిహద్దు స్పష్టంగా ఉంది. ఆ వీధి, లేదా ఆ ఏరియా దాని సరిహద్దు. ఒక వీధి కుక్క ఇంకో వీధిలోకి వెళ్లదు. ఆధార్, జి పి ఎస్ ట్యాగ్ లైన్, ప్రాపర్టీ టాక్స్ పిన్ నంబర్లలాంటివేవీ లేకపోయినా వీధికుక్కలు తమ పర్మనెంట్ అడ్రెస్ విషయంలో కన్ఫ్యూజ్ కావు.
అవతలి కుక్కలను కన్ఫ్యూజ్ చేయవు. పెంపుడు కుక్కల్లాగా యజమానులు వేళకింత పడేస్తే తిని మన్ను తిన్న పాముల్లా కనీసం తోక కూడా ఊపకుండా పడి ఉండాల్సిన అవసరం కానీ, అంతటి దీన స్థితి కానీ వీధి కుక్కలకు ఉండదు. తమతో మాట్లాడేవారితో మాట్లాడుతూ, తమను పట్టించుకోనివారిని పట్టించుకోకుండా ఉండే నిర్నిబంధమయిన స్వేచ్ఛ వీధి కుక్కలకు ఉంటుంది.
ఎప్పుడూ గొలుసులు, తాళ్లతో బందీలయిన పెంపుడు కుక్కలు వీధి కుక్కల స్వేచ్చా స్వాతంత్ర్యాలు చూసి అసూయపడతాయి. వ్యాక్సిన్లు, టీకాలు, ప్రోటీన్ ఫుడ్ అంటే ఏమిటో వీధికుక్కలకు తెలియకపోయినా, ఎప్పుడూ వాడకపోయినా వీధికుక్కలు ఆరోగ్యంగానే ఉంటాయి. ఒకవేళ రోగమొస్తే పెంపుడు కుక్కల్లా వెటర్నరీ ఆసుపత్రికి వెళ్లి క్యూలో నిలుచోవు. రెండ్రోజులు మూలన కూర్చుని రెస్ట్ తీసుకుని మందుమాకు లేకుండానే రోగాన్ని నయం చేసుకుని మళ్లీ వీధిమీద పడతాయి.
కుక్క మనకు కాపలా అని మన నమ్మకం. నమ్మకాలెపుడూ డిబేటబుల్. కుక్కకు మనమే కాపలానా? లేక మనకు కుక్క కాపలానా? అనేది కుక్కలను పెంచుకునేవారినడిగితే కరవకుండా చెబుతారు.
వీధికుక్కలు- పెంపుడు కుక్కలకే తలవాచిపోతే ఇక అడవికుక్కల గురించి వింటే అడవులపాలయిపోతాం. అడవికుక్క సింహంతో సమానం. అది ఊళ్లోకి రావడంవల్ల గ్రామసింహం అయ్యింది.
అపార్టుమెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో మనుషుల పేర్లు వాడ్డం మానేసి లాబ్రడార్ వాళ్ల ఇల్లు, బొచ్చుకుక్క వాళ్ల ఇల్లు, రెండుకుక్కల వాళ్ల ఇల్లు అని కుక్కగుర్తుగా పనిమనుషులు, సెక్యూరిటీవారు చెప్పుకుంటూ ఉంటారు.
“కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!”
బంగారపు సింహాసనం మీద కుక్కను కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినా…కుక్క కుక్కే అని సుమతీ శతకకారుడు తేల్చి పారేశాడు.
“చెప్పు తీపెరుగు కుక్క చెరకు తీపెరుగునా”
అన్న సామెత మీద అఖిలభారత శునక సమాఖ్య అనాదిగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా…సామెత మనుగడలోనే ఉంది.
కుక్క తనను తాను ప్రేమించుకుంటుందో లేదో కానీ తన యజమానిని మాత్రం అమితంగా ప్రేమిస్తూ ఉంటుందని కుక్కల సారీ… వెటర్నరీ డాక్టర్లు చెబుతూ ఉంటారు.
పెంపుడు కుక్కలను ఇంట్లో కుటుంబసభ్యులతో సమానంగా చూడడం సహజం. జపాన్ లో ఒక వ్యక్తి కుక్కల మీద అమిత ప్రేమతో కుక్కగా మారిపోయాడు. భయపడకండి. కుక్కలాంటి తొడుగులోకి పరకాయ ప్రవేశం చేశాడు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కుక్కను పోలిన చర్మం డ్రస్ కుట్టించుకుని అందులోకి దూరిపోయి…అచ్చు బొచ్చు కుక్కలా తోక ఊపుకుంటూ…నాలుగు కాళ్లతో నడుస్తున్నాడు. ఎన్నో వ్యయప్రయాసలతో ఈయన కుక్క అవతారమెత్తి…జన్మ చరితార్థమైనట్లు…భౌ భౌ అంటూ శేష జీవితాన్ని గడిపేస్తున్నాడు.
సందర్భం:- బాంబేలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఇద్దరబ్బాయిలు. ఒకబ్బాయి కష్టపడి ఎం బి ఏ పూర్తిచేసి…ఇంకా కష్టపడి తగిన ఉద్యోగం తెచ్చుకున్నాడు. నెలకు డెబ్బయ్ వేలు సంపాదిస్తూ స్థిరపడ్డాడు. మరో సోదరుడు సాధారణ డిగ్రీ పూర్తిచేసి చిన్నా చితక ఉద్యోగాలు చేస్తూ స్థిరపడలేకపోయాడు.
అలాంటివేళ అతడికి రకరకాల ఐడియాలు వచ్చాయి. అందులోనుండి పుట్టింది “శునక సంరక్షణోద్యోగం (డాగ్స్ కేర్ టేకర్)”. అంటే కలవారి కుక్కలను పొద్దునా, సాయంత్రం ఓ గంట చొప్పున వాకింగ్ కు తీసుకెళ్ళడం. ఇలా రోజూ 38 సంపన్న కుక్కలను వాకింగ్ కు తీసుకెళ్ళడం ద్వారా ఇతను నెలకు నాలుగున్నర నుండి అయిదు లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఈ సంగతి ఆనోటా ఈనోటా పడి… సోషల్ మీడియాకు ఎక్కి ఇప్పుడు దేశమంతా వైరల్ అవుతోంది.
భారత్ లో శునక సంరక్షణ వ్యాపారం విలువ ఏటా ఏడున్నర వేల కోట్ల రూపాయలకు పైగా ఉందని మార్కెట్ అంచనా. కలవారు సాధారణంగా వారి పిల్లలను చూసుకోవడమే కష్టమై ఆయాలకు అప్పగిస్తారు. అలాంటిది కుక్కలను చూసుకోవడం అయ్యేపని కాదు. అవ్వాలని అనుకోవడం కూడా మర్యాద కాదు. అలాంటి నేపథ్యంలో ఇలాంటి అధిక రాబడి శునకోద్యోగాన్ని సృష్టించుకున్న ఈ యువకుడిని అభినందించి తీరాలి. …… – పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article