ఖాళీగా ఉండటం కూడా ఓ పనే…! విచిత్రంగా ఉందా..? వెర్రి వ్యాఖ్యలాగా ఉందా..? కానీ నిజమే… అనేకానేక పనుల నడుమ… ఖాళీతనం కూడా ఓ పనే… నిజానికి అది కూడా ఓ అవసరమైన పని… జస్ట్, పనిలేకుండా ఉండటం..! అయితే అది పనుల నడుమ మనం కావాలని క్రియేట్ చేసుకునే ఖాళీ… అంతే తప్ప పూర్తిగా ఖాళీగా ఉండటం కాదు…!! ‘‘ఖాళీగా ఉంటే మెదడు చచ్చుబడిపోతుంది, ఆలోచనలు ఆగిపోతయ్, ఏదో ఒక పనిలో బుర్ర, దేహం యాక్టివ్‌గా ఉండాలి…’’ వంటి మాటలు సరికావు అంటున్నాడు జెఫ్ బెజోస్… ఆయనెవరూ అనడగకండి… అమెజాన్ సీఈవో… ప్రపంచ కుబేరుడు… ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద రిటెయిలర్…
అంత పెద్ద మనిషి చెప్పిండు కాబట్టి అది పెద్ద నీతిసత్యం అని కాదు… కాకపోతే తన వాదనలో లాజిక్ ఉంది… నిజానికి పెద్ద పెద్ద వ్యాపారులు, ధనికులు, పారిశ్రామికవేత్తలు, లీడర్లు, సెలబ్రిటీలు గట్రా ఫుల్ బిజీగా ఉంటారు… తెల్లారిలేస్తే చాలు మీటింగులు, షూటింగులు, ప్రోగ్రాములు, కొత్త ప్రాజెక్టులు, ప్రణాళికలు, సమీక్షలు, నిర్ణయాలు, చర్చలు ఎట్సెట్రా… అంటే ప్రతి నిమిషమూ అత్యంత విలువైంది… కానీ..? వాటన్నింటి నడుమ… జస్ట్, కాళ్లు ఇలా బారజాపుకుని, మైండ్ ఖాళీగా ఉంచేసుకుని, ఏ డిస్టర్బెన్స్ లేకుండా… అలా… అలా… పాజ్ మోడ్‌లోకి వెళ్లిపోవడం మంచిది అంటున్నాడు బెజోస్… ఇదేకాదు…
Ads
తనకు రోజువారీ షెడ్యూళ్లు ఉంటాయి కదా… అందులో ‘బ్లాంక్’ టైం కూడా ఉంటుంది… అదే ఒక షెడ్యూల్… ఆ టైంలో తను ఏ పనీ చేయడు… రిలాక్స్… నో ఫోన్ కాల్స్, నో మీటింగ్స్… Invent & Wander: The Collected Writings of Jeff Bezos అనే పుస్తకంలో తనే రాసుకున్నాడు ఇది… అంతేకాదు, బాగా పనులున్నయ్ కదాని తన దినచర్యను ఫుల్ బిజినెస్ వ్యవహారాలతో నింపేసుకోడు…
‘‘పొద్దున్నే లేస్తాను… ఎర్లీగా పడుకుంటాను… నాకు పొద్దున్నే న్యూస్ పేపర్ మొత్తం చదవడం ఇష్టం… అప్పుడే కాఫీ తాగుతాను… నా పిల్లలతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయాలి… ఇవన్నీ అయ్యాక, తాపీగా పది గంటలకు నా బిజినెస్ స్టార్టవుతుంది… ప్రపంచ కుబేరుడు ఉదయం పది గంటలకు గానీ తన వ్యవహారాల్ని స్టార్ట్ చేయడా అనే ఆశ్చర్యం కలగొచ్చు… కానీ అదే నిజం… చాలామంది అనుకుంటారు… ఎంత ఎక్కువ సమయం కష్టపడితే అంత ఫలితం సంపాదించవచ్చు అని… కానీ అది నిజం కాదు… మధ్యమధ్య ఖాళీగా ఉండటం నేర్చుకొండి, మరింత మంచి ఫలితాలు వస్తాయి’’ అంటాడు జెఫ్…
‘‘ఇది emotional intelligence అనే పదానికే గొప్ప ఉదాహరణ…’’ అంటాడు తను… అంటే, ఉద్వేగ మేధ అనాలేమో…! ఇప్పుడు ప్రపంచం అంతా వర్క్ ఫ్రం హోం నడుస్తోంది… ఇది ఇక ఆగిపోదు… కొనసాగనుంది… సో, 24 గంటలూ పని, పనిలో నిమగ్నం గాకుండా… ఏయే అవసరాలకు ఏయే సమయాలు… మధ్యలో ఖాళీతనం… అదీ ఆలోచించుకోవాలేమో… లేకపోతే బుర్రలు పేలిపోతాయి… నడుమ నడుమ ఖాళీతనం వల్ల ఆలోచనల్లో, నిర్ణయాల్లో నాణ్యత పెరుగుతుంది అని చాలామంది చెప్పేదే… కానీ ప్రపంచ కుబేరుడు చెబితే దాని విలువ వేరు కదా… ‘రోజూ బొచ్చెడు నిర్ణయాలు కూడా అవసరం లేదు, నేను మహా అయితే రోజుకు రెండో మూడో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటాను, అంతే…’ అంటాడు తను…
చివరగా తను చెప్పేది ఏమిటంటే..? నిద్ర..! ‘‘నా అతి ముఖ్యమైన పనుల్లో నిద్ర ఒకటి… పలు దేశాలు తిరుగుతుంటే, వేర్వేరు టైం జోన్ల నడుమ ఎనిమిది గంటల నిద్ర కొన్నిసార్లు ఉండకపోవచ్చుగాక… కానీ రోజుకు తప్పనిసరిగా నాకు ఎనిమిది గంటల నిద్ర ఉండాల్సిందే… అంతసేపు నిద్రపోతేనే నాకు ఎనర్జీ, నా మూడ్ బాగుంటుంది… నిద్రను కూడా త్యాగం చేసి, రేయింబవళ్లూ కష్టపడేవాళ్లు ఒక భ్రమలో ఉంటారు, ఎంత ఎక్కువసేపు పనిచేస్తే అంత రిజల్ట్ ఉంటుందని… కానీ అది నిజం కాదు… నిద్రను గౌరవించాలి…’’ అంటాడాయన… తన భావాల్నీ గౌరవిద్దాం…
Share this Article