నళిని… ఒకప్పుడు డీఎస్పీ… తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొని, అప్పటి ఉమ్మడి ఏపీ పోలీసు బాసుల ఆగ్రహానికి గురైంది… తరువాత కేసీయార్ ప్రభుత్వమూ పట్టించుకోలేదు… నిజానికి ఆమె ఏమైపోయిందో, ఎక్కడ ఉంటుందో, ఏం చేస్తుందో కూడా చాలామందికి తెలియదు…
కేసీయార్ ప్రభుత్వాన్ని జనం తిరస్కరించాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది… ఉద్యమ బాధితురాలిగా సానుభూతి చూపిస్తూ, ఆమె కోరుకుంటే ఆ పాత పోలీసు పోస్టే ఏదో ఓరకంగా ఇచ్చేద్దామని అనుకుంది… ఆమెను పిలిచింది… రేవంత్ రెడ్డి ఆమెను కలిశాడు… (ఇన్నేళ్ల సర్వీస్ డిస్‌కంటిన్యూ, లీగల్ ఇష్యూస్, సర్వీస్ మ్యాటర్స్ బోలెడు అడ్డంకులున్నా సరే, ఎక్కడో ఓచోట అదే స్థాయిలో అకామిడేట్ చేయాలనుకుంది ప్రభుత్వం… ఆమెకు చెప్పిందీ అదే…)
Ads
కానీ ఆమె తిరిగి పోలీస్ పోస్టు చేయలేను అని సున్నితంగానే వద్దని చెప్పింది… తను ఆల్రెడీ వేరే మార్గంలోకి మళ్లిపోయాననీ, తన దైహిక స్థితి కూడా తనను పోలీస్ కొలువు చేయనివ్వదనీ పేర్కొంది… కాకపోతే తను వ్యాప్తి చేస్తున్న వేదవిద్యకు సాయం చేయాలని కోరింది… విజ్ఞాపన లేఖల్ని ఇచ్చింది… పోలీస్ శాఖలో కొన్ని మార్పులూ సూచించినట్టు వార్తలొచ్చాయి…
ఇప్పుడు హఠాత్తుగా మళ్లీ తెర మీదకు వచ్చింది… తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఓ పోస్టు పెట్టింది… సహజంగానే ప్రభుత్వం మీద కోపంగా ఉన్న సోషల్ మీడియా సెక్షన్ దాన్ని వైరల్ చేసే ప్రయత్నం చేసింది… ఏడు నెలలైంది, ఏమైంది అనేది ఆమె ప్రశ్న… తనను పీఆర్ స్టంట్ కోసం వాడుకుని వదిలేశారని ఆరోపణ… యాచకులకు ఇచ్చే విలువ కూడా తనకు లేదని ఆక్షేపణ…
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో తన ఊసే ఎత్తలేదని ఆశ్చర్యం… నా దరఖాస్తులు ఆల్రెడీ చెత్తబుట్టలోకి వెళ్లిపోయాయేమోనని సందేహం.. సీఆర్ఓ, ఓఎస్డీకి లేఖ కూడా రాశానని సమాచారం…
ఈమె అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ అర్థం కాదు… ఆమె ఎంచుకున్న ఉపాధి మార్గం, జీవనవిధానం ఆధ్యాత్మిక సేవ… సనాతన ధర్మాన్ని అనుసరించి హోమాలు చేయిస్తుంది… అదంతా ఆమె ఇష్టం… పాత కొలువు స్థాయిలో అకామిడేట్ చేస్తానంటే వద్దన్నదీ ఆమే… వేద విద్య వ్యాప్తికి ఓ వ్యక్తి హోదాలో సాయం అడుగుతోంది… ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వాలంటే సవాలక్ష పరిమితులు, నిబంధనలు గట్రా ఉంటాయి…
మరోసారి పరిశీలించాలని అడగడం వేరు, ఆయ్, ఏడు నెలలైంది, ఏమైంది అనడగడం వేరు… అది ప్రభుత్వ వ్యవహారం… అంత తేలికగా తెమిలేవి కావు, తెగేవి కావు… పైగా ఆమె అడిగింది చేయాలనే బాధ్యతో, కమిట్మెంటో కూడా ప్రభుత్వానికి లేదు, నిష్ఠురంగా ఉన్నా నిజమిదే… యాచకులకు ఉన్న విలువ నాకు లేదనే వ్యాఖ్య తొందరపాటుతనం, ఆమె ఎంచుకున్న సనాతన ధర్మ ప్రచార పంథా ఆమెకు ఆ సంయమనం ఎందుకు నేర్పించలేదో తెలియదు…
పిలిచి, మాట్లాడి, కోరితే సర్వీసులోకి వచ్చేందుకు సాయం చేస్తామని ఆఫర్ ఇవ్వడం పీఆర్ స్టంట్ అవుతుందా..?! ఆమె కోరిన సాయం ఆగమేఘాల మీద చేసేస్తేనే ఆమెకు గౌరవం ఇచ్చినట్టా..? అది జరగకపోతే యాచకులకు ఇచ్చిన విలువ కూడా లేదని ఆక్షేపించాలా..?
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఆమె ఊసు ఎందుకు ఎత్తాలి..? ఆమెలాగే లక్షల మంది ఉద్యమ బాధితులున్నారు… నానారకాలుగా నష్టపోయినవాళ్లున్నారు… అందరి పేర్లనూ ఎవరు ప్రస్తావించాలి..? సాధ్యమేనా..? పోనీ, అందరినీ మించి ఆమె తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేకంగానో, మరీ గుర్తుండే రకంగానో చేసిందేముంది..? హేమిటో… సోషల్ పోస్టులతో ఏ పనీ సానుకూలపడదనే సత్యం కూడా తెలియడం లేదు ఆమెకు..!!
Share this Article