.
కార్మిక సంఘమా..? పెదరాయుడు కోర్టా..? సినీ పరిశ్రమకు సుప్రీంకోర్టా..? రణ్‌వీర్- డాన్ 3 వివాదం లేవనెత్తిన పెద్ద ప్రశ్న… బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, డాన్-3 నిర్మాతల మధ్య వివాదం ఇప్పుడు కేవలం ఒక సినిమా సమస్యగా మిగలలేదు. ఈ వ్యవహారం భారత సినీ పరిశ్రమలో కార్మిక సంఘాల పాత్ర, వాటి అధికారాల పరిమితి, కాంట్రాక్టు వివాదాల్లో జోక్యం చేసుకునే హద్దుల గురించి పెద్ద చర్చకు దారితీసింది.
వివాదం నేపథ్యం చూస్తే, ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన డాన్-3లో రణ్‌వీర్ సింగ్ హీరోగా ఎంపికయ్యాడు. అయితే దురంధర్ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత, డాన్-3 స్క్రిప్ట్, బడ్జెట్, ప్రాజెక్ట్ స్కేల్ విషయంలో తనకు సంతృప్తి లేదన్న కారణాలతో ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.
Ads
ఇక్కడ ఒక సహజమైన ప్రశ్న వస్తుంది. ఒక నటుడు తన కెరీర్‌లో అత్యంత కీలక దశలో ఉన్నప్పుడు, ముఖ్యంగా దురంధర్ లాంటి భారీ విజయానంతరం, తన తదుపరి సినిమా కూడా అదే స్థాయి లేదా అంతకంటే ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకోవడం తప్పేనా? ఒక హీరోగా, తన మార్కెట్ విలువను, తన కెరీర్ దిశను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకునే హక్కు అతనికి లేదా?
అవును, నిర్మాతలు నష్టపోయి ఉండొచ్చు. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్‌పై భారీగా ఖర్చు పెట్టి ఉండొచ్చు. ఆ నష్టానికి పరిహారం కోరడం కూడా వారి హక్కే. కానీ ఆ వివాదాన్ని పరిష్కరించే పద్ధతి ఏమిటన్నదే అసలు అంశం.
వార్తల ప్రకారం… నిర్మాతలు సుమారు రూ.45 కోట్ల నష్టపరిహారం కోరగా, రణ్‌వీర్ సింగ్ దాదాపు రూ.10 కోట్లు చెల్లించేందుకు కూడా సిద్ధపడ్డాడని తెలుస్తోంది. అంటే పూర్తిగా బాధ్యత నుంచి తప్పించుకోవాలని ఆయన ప్రయత్నించలేదు. ఇరు పక్షాల మధ్య చర్చలు జరిగాయి. రాజీ ప్రయత్నాలు కూడా జరిగాయి. అయినా పరిష్కారం రాలేదు.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో అకస్మాత్తుగా రంగంలోకి వచ్చిన సంస్థ FWICE (Federation of Western India Cine Employees). ఇది ప్రధానంగా సినీ కార్మికుల సమాఖ్య. లైట్‌మెన్‌లు, మేకప్ ఆర్టిస్టులు, స్పాట్ బాయ్స్, టెక్నీషియన్లు, జూనియర్ ఆర్టిస్టులు వంటి అనేక విభాగాల కార్మిక సంఘాలు దీనిలో సభ్యులుగా ఉంటాయి.
మరోవైపు IMPPA (Indian Motion Picture Producers’ Association) నిర్మాతల సంఘం. అలాగే CINTAA (Cine and TV Artistes’ Association) నటీనటుల సంఘం. సాధారణంగా ఇలాంటి వివాదాల్లో నిర్మాతల తరఫున IMPPA, నటుల తరఫున CINTAA, అవసరమైతే ఇతర పరిశ్రమ సంస్థలు మధ్యవర్తిత్వం చేస్తుంటాయి.
కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఒక హీరో- నిర్మాత మధ్య ఉన్న కాంట్రాక్టు వివాదంలో కార్మిక సంఘమైన FWICE ఎందుకు నేరుగా జోక్యం చేసుకుంది?
ఒకవేళ రణ్‌వీర్ సింగ్ షూటింగ్ సమయంలో కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఉంటే, లేదా కార్మికుల హక్కులను ఉల్లంఘించి ఉంటే FWICE జోక్యం చేసుకోవడం పూర్తిగా సమంజసం. అది వారి బాధ్యత కూడా. కానీ ఒక ప్రైవేట్ కాంట్రాక్టు వివాదంలో ఒక పక్షానికి వ్యతిరేకంగా నాన్-కోఆపరేషన్ ఆదేశాలు జారీ చేయడం కార్మిక సంఘం పరిధిలోకి వస్తుందా?
ఈ రోజు ఒక హీరోపై నాన్- కోఆపరేషన్. రేపు ఒక నిర్మాతపై. ఎల్లుండి ఒక దర్శకుడిపై. అలా అయితే పరిశ్రమలో జరిగే ప్రతి ఒప్పంద వివాదానికి చివరి తీర్పు చెప్పేది కోర్టులా? నిర్మాతల సంఘాలా? లేక కార్మిక సంఘమా?
ఇదే ఇప్పుడు చాలామందిని కలవరపెడుతున్న ప్రశ్న. కోర్టులు ఉన్నాయి. ఆర్బిట్రేషన్ వ్యవస్థ ఉంది. నిర్మాతల సంఘాలు ఉన్నాయి. నటుల సంఘాలు ఉన్నాయి. కాంట్రాక్టుల అమలు కోసం చట్టపరమైన మార్గాలు ఉన్నాయి. వాటిని పక్కనబెట్టి, ఒక సంఘం తన సభ్యుల బలాన్ని ఉపయోగించి ఒక వ్యక్తిపై ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సమంజసం?
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తాజాగా IMPPA, CINTAA వంటి సంస్థల విజ్ఞప్తి మేరకు FWICE చివరకు తన నాన్-కోఆపరేషన్ ఆదేశాలను ఉపసంహరించుకుంది. అంటే వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించింది. అంటే ఒకరకంగా ఇండస్ట్రీని తనే శాసించగలననే ధోరణికి వెళ్లిపోయింది… దీనికి బ్రేక్ వేయడానికే రణవీర్ లీగల్ నోటీసులు జారీ చేసి, పోరాటానికి రెడీ అయిపోయాడు…
మధ్యవర్తిత్వం చేయడం, ఇరు పక్షాలను చర్చల బల్లపైకి తీసుకురావడం, రాజీ మార్గం చూపడం ఒక విషయం. కానీ నేరుగా పరిశ్రమ మొత్తానికి ఆదేశాలు జారీ చేయడం మరో విషయం. రణ్‌వీర్ సింగ్ తప్పు చేశాడా? నిర్మాతలు నష్టపోయారా? అనే ప్రశ్నలకు కోర్టులు లేదా ఒప్పంద నిబంధనలు సమాధానం చెబుతాయి.
కానీ ఈ వివాదం లేవనెత్తిన అసలు ప్రశ్న మాత్రం వేరేది… కార్మిక సంఘాలు కార్మికుల హక్కులను కాపాడటానికే పరిమితం కావాలా? లేక నిర్మాతలు, నటులు, స్టూడియోల మధ్య కాంట్రాక్టు వివాదాల్లో కూడా తుది తీర్పులు చెప్పే స్థాయికి ఎదగాలా? డాన్-3 వివాదం ముగిసిపోయినా, ఈ ప్రశ్న మాత్రం భారత సినీ పరిశ్రమ ముందు చాలా కాలం నిలిచే అవకాశం ఉంది.
Share this Article