Bharadwaja Rangavajhala…….. అగ్రహారంలో గాడిద అని ఓ తమిళ సినిమా ఉంది … జాన్ అబ్రహాం తీశాడు … మనుషుల బతుకులు చితుకులు చేసి మండించేది కాదు మతం అనంటారు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ … కానీ మతం ఆ పని మాత్రమే చేస్తోంది అని చెప్పడమే లక్ష్యంగా ఓ సినిమా వచ్చింది… ఆ రోజుల్లో … దాని పేరే అగ్రహారంలో గాడిద…
అనగనగా ఓ కాలేజీ ప్రొఫెసర్… ఆయనకు ఓ గాడిద పిల్ల దొరుకుతుంది. వాకబు చేయగా దాని తల్లిని కొందరు కొట్టి చంపేశారని తెలుస్తుంది … దీంతో అనాధగా ఉన్న పిల్లగాడిద మీద జాలేసి తనతో తెచ్చుకుంటాడు … అందరూ కుక్కల్ని మాత్రమే పెంచుకుంటున్నారు … మనం వెరైటీగా గాడిదను పెంచుకుంటే తప్పేంటనేదే ఆలోచన చేస్తాడు …
అనుకున్నదే తడవుగా ఆ గాడిదను తెచ్చి పెంచుకుంటూంటాడు … దాన్ని అన్ని పెంపుడు జంతువుల్లాగే బైటికి తీసుకెళ్తూంటాడు … స్నానం చేయిస్తూంటాడు … దీన్ని అడ్వంటేజ్ గా తీసుకున్న కొందరు కాలేజీ కుర్రాళ్లు ఆయన్ని ఆటపట్టిస్తూంటారు … ప్రొఫెసర్ గారి గాడిద గురించి వాల్ రైటింగులూ పోస్టర్లూ కూడా నడుస్తాయి.
అది కొంత గొడవకు దారి తీస్తూంటుంది … ఫైనల్ గా కాలేజీ యాజమాన్యం పిల్చి … మీరు ఆ గాడిదను వదిలేస్తారా? లేక ఉద్యోగం వదిలేస్తారా చెప్పండి అన్నారు.. ఇక లాభం లేదనుకున్న లెక్చరర్ గాడిదను తీసుకెళ్లి తన స్వగ్రామంలో ఉంచుతాడు. సిటీ నుంచీ ఆ గాడిదను జాగ్రత్తగా ప్యాక్ చేసి బస్సులో తీసుకెళ్డం ఓ ఫార్సు …
ఆయన స్వగ్రామం … అది ఒక అగ్రహారం . అలా అగ్రహారపు గాడిద అయ్యింది… అక్కడా ఇదే పరిస్తితి. ఒక బ్రాహ్మణ అగ్రహారంలో గాడిదను పెంచడమా అని పెద్దలు గొడవకు దిగుతారు … అగ్రహారంలో తిరుగుతున్న గాడిద వల్ల నానా ఇబ్బందులూ పడుతూంటారనుకోండి …
నా ఇష్టం నా ఇంట్లో నేనేమైనా చేసుకుంటా అని లెక్చరర్ గారు అడ్డం తిరుగుతారు … అయితే అగ్రహారపు పెద్దలు మాత్రం సీరియస్ గా గాడిదను అగ్రహారం నుంచీ తోలేయాలని తీర్మానించుకుంటారు … ఈ గొడవ సాగుతుండగానే … ప్రొఫెసర్ గారి ఇంట్లో మూగ పనిమనిషిని ఒకడు మోసం చేసి గర్భవతిని చేస్తాడు … అయితే ఆ గర్భం నిలవదు … చనిపోయిన బిడ్డ పుడుతుంది…
ఆ గాడిదను తీసుకురావడం వల్లే ఆ అమ్మాయిని వాడెవడో మోసం చేయడం, చనిపోయిన బిడ్డ పుట్టడం లాంటి అనర్ధాలన్నీ జరిగాయని అగ్రహారపు పెద్దలు తీర్మానిస్తారు… ఇంకా మరిన్ని దారుణాలు జరిగే అవకాశాలున్నాయని … గాడిద అగ్రహారంలోకి రావడం వల్ల ధర్మభ్రష్టత సంప్రాప్తించిందని ఇలా పలు విధాలుగా రెచ్చిపోతారు.
ఇలా రెచ్చిపోతున్న పరిస్థితుల్లో … ఆ అమ్మాయి తల్లి తన కూతురుని మోసం చేసిన వాడిని శిక్షించే ఆలోచన చేయకుండా గాడిద చుట్టూ విషయం తిప్పుతున్నారని తన నిరసన తెలియచేస్తూ చనిపోయిన బిడ్డను తెచ్చి గుడి దగ్గర పెడుతుంది. నిజంగానే … గుడి దగ్గర మృత శిశువును పెట్టింది గాడిదే అనుకుంటారు అగ్రహారపు జనం. అనుకోవడమే తడవుగా గాడిదను తీసుకొచ్చి కొండమీదకు తీసుకెళ్లి కొట్టి చంపేస్తారు …
గాడిద చనిపోయిన తర్వాత ఆ బిడ్డను గుడి దగ్గరకు తెచ్చింది గాడిద కాదనే విషయం తెలుస్తుంది… అప్పుడు గాడిద గురించిన పాజిటివ్ అంశాలు ఒక్కటొక్కటిగా చెప్పుకుంటారు … అందరూ గాడిదను చంపినందుకు బాధ పడతారు … ఇలా పడుతుండగా ఓ అగ్రహారపు పెద్ద మనిషి … గాడిదను చంపినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే ఊరు సర్వనాశనం అవుతుందంటాడు.
ఏం చేయాలి అంటే … గాడిదకు గుడి కట్టించడమే మనం చేయగలది అని వివరిస్తాడు … గుడి కట్టాలని నిర్ణయించిన తర్వాత ముందు గాడిదకు దహన సంస్కారాలు చేద్దామనుకుంటారు. గాడిదను తగలెట్టిన మంట అనుకోకుండా అగ్రహారానికి అంటుకుని మొత్తం అందరూ చచ్చిపోతారు…
ప్రొఫెసర్ గారూ, ఆయన పనిపిల్లా మాత్రం తప్పించుకుంటారు… ఇదీ కథ …
జాన్ అబ్రహామ్ తీసిన ఈ సినిమాను అప్పట్లో తమిళనాడు ప్రభుత్వం నిషేదించింది. తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణ ఆధిపత్యం మూఢ నమ్మకాల మీద సెటైరికల్ గా తీసిన ఈ సినిమాలో హీరో పాత్రలో సంగీత దర్శకుడు ఎమ్బీ శ్రీనివాసన్ నటించడం విశేషం. సినిమాలో రెండు మూడు జీవాలంటాయి. అందులో ఒకటి గాడిద , రెండు మూగ పనిమనిషి. ఈ రెండు జీవాలూ అన్యాయంగా దౌర్జన్యానికి గురై దెబ్బతింటాయి. గాడిద అయితే చనిపోతుంది కూడా … దీన్ని రాతంటారా? కర్మంటారా? ఏదేమైనా మతం వారి ఉద్దరణకు కాకుండా నాశనానికే దోహదపడిందనేది దర్శకుడు చెప్పదల్చుకున్నదనిపిస్తుంది.
Share this Article
Ads