“గాడిద వార్తలు” అన్న సమాసానికి-
గాడిదలకు సంబంధించిన వార్తలు అన్న అర్థం ఒక్కటే కాకుండా ఇతరేతర అర్థాలు కూడా మనుగడలో ఉండడం వల్ల అలాంటి సమాసాన్ని వాడవద్దని ఇతరులను గౌరవించే సదుద్దేశంతో పండిత గార్దభాలు ముందే విన్నవించుకున్నాయి.
ప్రార్థన అని యాంకర్ గాడిద మైక్ లో అనౌన్స్ చేయగానే ఒక్కసారిగా సభ గార్దభ తీవ్ర శ్రుతి ఓండ్రతో దద్దరిల్లింది. అధ్యక్ష గార్దభం నేరుగా మైక్ అందుకుని దిక్కులు పిక్కటిల్లేలా మాట్లాడుతోంది. బ్రీత్ లెస్ శైలిలో సాగిన గాడిద గంట ఉపన్యాసం యథాతథంగా ఇవ్వడం కుదరక మీడియా సారాన్ని మాత్రమే రిపోర్ట్ చేసింది. మీడియాలో వచ్చిన గాడిద సంఘాల సమైక్య సమాఖ్య వార్తల సారమిది.
Ads
“కృత, త్రేతా, ద్వాపర- మూడు యుగాలు ముగిసి…కలియుగం మొదటి పాదంలో ఉన్నా…ఇన్ని యుగాల్లో గాడిదలకు సముచిత స్థానం కల్పించాలని అడిగినవారు, గాడిదల మనోభావాలను గుర్తించినవారు లేరు. తొలిసారి ఇందిరాగాంధీ కోడలు, పర్యావరణ ప్రేమికురాలు, రాజకీయ నాయకురాలు మేనకా గాంధీ గాడిదలకు అత్యున్నత స్థానం కల్పించారు. అందుకు మా జాతి ఈ భూమ్మీద ఉన్నంతవరకు ఆమెకు రుణపడి ఉంటాము.
ఆనాటి క్లియో పాత్రా రోజూ పాత్రల కొద్దీ మా పాలతో రుద్దుకోవడం…స్నానం చేయడం వల్లే అందగించిందన్న చారిత్రక సత్యాన్ని మేనకా గాంధీ గారు బహిరంగ సభలో బహిరంగంగా మైకు గుద్ది చెప్పడం మాకొక నోబెల్ బహుమతి లాంటిది.
భారత దేశంలో గాడిద పాలు తాగడం వల్ల ఆరోగ్య పరిరక్షణ, గాడిద పాలతో తయారు చేసిన సబ్బుతో రుద్దుకుంటే నిగనిగలాడే చర్మ సౌందర్యం గురించి ఆమె చెబుతుంటే గాడిదలమయిన మాకే బుగ్గల్లో సిగ్గుల మొగ్గలు మొగ్గ తొడిగాయి.
అనాదిగా నిర్లక్ష్యానికి, అవహేళనకు, అవమానాలకు గురయిన మా గార్దభ ఆత్మ సౌందర్య గౌరవాన్ని మేనక గారు తట్టి లేపారు.
బొగ్గుపాల కడుగ పోవునా మలినంబు?
అని వేమన ఆనాడే ప్రశ్నించాడు.
ఇప్పుడు ఆ వేమనే ఉండి ఉంటే
“గాడిదపాల కడుగ పోవును మలినంబు…వచ్చును అందంబు…”
అని ఖచ్చితంగా కొత్త ఆటవెలది రాసి…పాడేవాడు.
సందర్భం వచ్చింది కాబట్టి…
సామెతల విషయం కూడా ఒక మాటనుకోవాలి. తెలుగు సామెతలు, నుడికారాలు, జాతీయాలు, వాడుక మాటలు మా మనోభావాలను బాగా దెబ్బ తీస్తున్నాయి.
“వసుదేవుడంతటివాడు గాడిద కాళ్ళు పట్టుకొన్నాడట”
“కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందట”
“గాడిద గుడ్డు కాదూ..!”
“అడ్డ గాడిదలా పెరిగావు…ఎందుకూ కొరగావు”
“గాడిదలా బరువులు మోయడం”
“గాడిద చాకిరీ”
“గుర్రం గుర్రమే- గాడిద గాడిదే”
“పిల్ల గాడిద ముద్దు- పెద్ద గాడిద మొద్దు”
భగవంతుడు సృష్టిలో అన్ని ప్రాణులు సమానంగా బతకడానికి హక్కు ఇచ్చాడు. అలాగే మా ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే హక్కు కూడా మాకు ఉంటుందని సవినయంగా తెలియజేసుకుంటున్నాం.
విన్నారా సరి!
లేకపోతే…చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్లే…మా వెనుక కాళ్లు వాటి పని అవి చేసుకుపోతాయి!
కాబట్టి ఈ సభ ముక్త కంఠంతో-
“గాడిదలకేమి తెలుసు గంధపు చెక్కల వాసన?”
అన్న నానుడిని నిరాకరిస్తూ…
“గాడిదలకే తెలుసు గంధపు చెక్కల వాసన”
“గాడిదలకే తెలుసు అందపు చెక్కిళ్ల నునుపు”
“గాడిదలు చెక్కిన శిల్పం”
“గార్దభ క్షీర సౌందర్య న్యాయం”
లాంటి కొత్త పాజిటివ్ మాటలనే వాడాలని తోటి ప్రాణి కోటిని డిమాండు చేస్తోంది!
సభ ఒక్కసారిగా గాడిదల ఓండ్ర హర్ష ధ్వానాలతో మారుమోగింది!
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article