ఒక ఊరు… ఒక గాడిద… ఒక యజమాని… రోజూ రాత్రి దాన్ని ఆయన ఇంటెదురుగా ఉన్న ఓ చెట్టుకు కట్టేస్తూ ఉంటాడు… లేకపోతే కష్టం… వెళ్లి, ఎవరి చేలలోనో పడిందీ అంటే… సదరు రైతు తెల్లారే వచ్చేసి, తనను ఉతికేసి పోతాడు మరి…! అందుకని కట్టేయడం మాత్రం మానడు… ఆ చెట్టుపైనే ఓ దెయ్యం కాపురం ఉంటుంది… కొంచెం తీట కేరక్టర్ దానిది…
అసలే కోతి, ఆపై కల్లు తాగింది అన్నట్టుగా… అసలే కాస్త తీట కదా… దానికితోడు ఆ ఇంటి ఓనర్ ఇంట్లోని టీవీలో ఈనడుమ డిబేట్లు చూస్తోంది… కేసీయార్ జాతీయ రాజకీయాల ఎత్తుగడలు, బీజేపీ పొలిటికల్ వేషాలు, ఏపీలో కుల- బూతు పాలిటిక్స్ తీరు డిస్టర్బ్ చేస్తున్నాయి దాన్ని… మధ్యమధ్యలో మోడీ నీతి ప్రసంగాలు కూడా చూస్తోంది ఈమధ్య… ఆ చిరాకులో ఏం చేస్తున్నదో తనకే అర్థం కానట్టుగా… ఓ రాత్రి గాడిదకు కట్టిన కట్లను తెంచేసింది…
అదసలే గాడిద… స్వేచ్ఛ లభించినట్టయింది… ఓసారి గట్టిగా విరుచుకుంది… మరింత గట్టిగా ఓండ్రపెట్టి లోకంపై పడింది… ముందుగా ఆ పక్కనే ఉన్న పొలాల్లో అడుగుపెట్టింది.., ఆ చేను అంతా తొక్కి, ధ్వంసం చేసింది… తెల్లారి అది చూసి లబోదిబో మొత్తుకుంది ఆ రైతు భార్య, చిర్రెత్తింది… కట్టెలు కొట్టడానికి బాగా పదునుపెట్టిన ఓ గొడ్డలితో ఆ గాడిదను నరికేసింది…
Ads
నా గాడిదను నరికేస్తావా..? అని పంచాయితీకి వచ్చాడు గాడిద యజమాని… ఓనర్ కదా… కోపం సహజం… ఏవో జరిమానాలు, పరిహారాలతో కేసులు తేల్చుకోవాలే తప్ప హత్యల దాకా వెళ్లడం అప్రజాస్వామికం, అనాగరికం కదా… అందుకని కోపంలో తను విచక్షణ మరిచేసి, ఇంట్లోని వేటకొడవలి పట్టుకొచ్చి ఆ రైతు భార్యను నరికేశాడు…
బహిరంగంగా… అలా తన పెళ్లాన్ని ఎవడో నరికేస్తే మరి ఆ రైతుకు ఎలా ఉంటుంది..? ఎక్కడో మంట రేగింది… గుంతలు తవ్వే గునపం తెచ్చి, రైతు గుండెల్లో పొడిచాడు… వాడు వెంటనే చచ్చూరుకున్నాడు… వామ్మో వామ్మో, మీ అయ్యను చంపేశాడురోయ్ అంటూ గాడిద ఓనర్ భార్య కేకలు వేసింది… కొడుకుల్ని పిలిచింది… తనే కొంగు నడుంకు బిగించింది… వాళ్లంతా కలిసి ఆ రైతుకు ఇంటికి నిప్పుపెట్టారు…
తన ఇంటిని కాలబెడతారా అని మరింత కోపంతో ఊగిపోయాడు రైతు… చేతిలో గునపం ఉందిగా… గాడిద ఓనర్ పెళ్లాన్ని, అతని కొడుకులను వెంటాడి చంపేస్తాడు… కాసేపటికి కోపం తగ్గుతుంది… ఆవేశం అదుపులోకి వస్తుంది… గునపం పారేసి, చోద్యం చూస్తున్న ఆ దెయ్యాన్ని అడుగుతాడు… ‘‘ఎందుకు ఇంతమంది చావుకు కారణమయ్యావ్..? నీకు బుద్ధి ఉందా..? ఆ గాడిద కట్లు తెంచకపోతే ఇదంతా జరిగేదా..?’’
‘‘ఏయ్, మతిలేని మాటలు మాట్లాడకు… నన్ను అనవసరంగా నిందిస్తే ఊరుకోను… నేను స్వయంగా ఒక్కరినైనా చంపానా..? జస్ట్, చెట్టుకు కట్టేసి ఉన్న గాడిదను జాలితో విడిపించాను… అది తప్పా..? మీరే మీలో ఉన్న అసలు దెయ్యాలను స్వయంగా బయటికి తీసి, ఒకరికొకరు చంపేసుకున్నారు… ఆవేశాలు, ఆగ్రహాలు తప్ప ఒక్కరిలోనూ ఆలోచన కనిపించలేదు… దెయ్యాలకే మీరు అయ్యలు…’’ అని దెయ్యం కౌంటర్ పడేసి, చెట్టెక్కి గుర్రుపెట్టసాగింది…
(నిజానికి ఇది సోషల్ మీడియాలోనే కనిపించిన ఓ ఇంగ్లిషు పోస్టు… మీడియాలో, సోషల్ మీడియా కూడా సేమ్ దెయ్యం టైపు.., ఈ కథలోలాగే రోజుకొక గాడిద కట్టు తెంచేస్తుంటాయి… సమాజం మీదకు వదిలేస్తుంటయ్… ఇంకేముంది..? పార్టీలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తన్నుకుంటుంటారు… ట్రోలింగ్, దూషణలు, తిట్లు మీడియాలో, సోషల్ మీడియాలో… ఎక్కడో ఎవడో ఏదో మొదలు పెడతాడు, అది చివరకు ఎటెటు పోతుందో ఎవడికీ తెలియదు… సో, ఆ ఇంగ్లిషు పోస్టుకు పైన కథ నా రీమేక్ అన్నమాట… పాతదే కదా అంటారా..? భలేవారే, రోజూ కొత్తవేముంటయ్… పాతవే కొత్తగా చెప్పుకోవాలి తెలుగు సినిమా కథల్లాగా……. శ్రీనివాసరావు మంచాల)
Share this Article