Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రేమా..? పెళ్లా..? ఒకటికి వందసార్లు ఆలోచించండి అమ్మాయిలూ.,..!!

January 24, 2025 by M S R

.

– శంకర్‌రావు శెంకేసి (79898 76088)…. ‘నన్ను క్షమించండి..’ అని తల్లిదండ్రులను మౌనిక వేడుకుంటే బాగుండేదేమో…

చరిత్ర నిండా కనిపించే ప్రేమ-పెళ్లి గాథల్లో కొన్ని అజరామరమై భావోద్వేగాలను కలిగిస్తే, మరికొన్ని అర్ధాంతరంగా విషాదాంతమై గుండెల్ని మెలిపెట్టేస్తుంటాయి. ప్రేమను ఒప్పుకోని తల్లిదండ్రులు, పరువు హత్యలు, వెలివేతలు.. కాలంతో నిమిత్తం లేకుండా ఎప్పుడూ ఉండేవే.

Ads

అవి ప్రేమగాథలపై నెత్తుటి సంతకాన్ని చేసి కర్కశత్వాన్ని చాటుకుంటాయి. కానీ తనను నమ్మి, తన వెంట నడిచిన ప్రియురాలిని ప్రియుడే మోసం చేస్తే, ఆ మోసాన్ని తట్టుకోలేక ఆమె బలవన్మరణానికి పాల్పడితే.. అది కర్కశత్వాన్ని మించిన క్రూరత్వం అవుతుంది.

ప్రేమ-పెళ్లి గాథల్లో చోటుచేసుకునే విషాదాంతాల్లో మహిళలే బలిపశువులై పోతున్నారు. నేను ఎవరిని ప్రేమిస్తున్నాను..? పెళ్లాడితే భవిష్యత్తు ఏమిటి? తన తల్లిదండ్రులను ఒప్పించగలనా? సమాజ కట్టుబాట్ల మధ్యన సాఫీగా జీవించగలనా? అనే వాస్తవిక అంశాలను పట్టించుకునే మెచ్యూరిటీ లేకుండానే అమ్మాయిలు ప్రేమ-పెళ్లిళ్లకు లొంగిపోతున్నారు.

విఫల ప్రేమ గాథల్ని, మోసాల్ని మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా, సోషల్‌ మీడియా నిత్యం కళ్లకు కడుతున్నా… డిగ్రీలు, పీజీలు చదివిన అమ్మాయిలు కనీసం స్పృహ లేకుండా ఆకర్షణ, మోహంలో ప్రేమ ఊబిలో చిక్కుకుపోతున్నారు. మాయమాటలకు, మోసపు వాగ్దానాలకు లొంగిపోతున్నారు.

పెళ్లి తర్వాత తాము వేసిన తప్పుటడుగుల ఫలితాలు అనుభవంలోకి వస్తుండటంతో భరించలేక పోతున్నారు. చివరకు ప్రాణాలను బలిపెట్టుకుంటున్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురంలో చోటుచేసుకున్న ఓ సంఘటన ప్రేమమోహంలో కొట్టుకుపోయే అమ్మాయిలను తస్మాత జాగ్రత్త అని హెచ్చరిస్తోంది. మెచ్యూరిటీని, రియల్‌ థింకింగ్‌ను అలవర్చుకోమని హితవు పలుకుతోంది.

ఆమె పేరు చిలువేరు మౌనిక (31). తల్లిదండ్రులు ప్రభుత్వ అధ్యాపకులు. ఊరు హైదరాబాద్‌లోని హయాత్ నగర్‌. ఇద్దరు ఆడపిల్లల్లో పెద్దమ్మాయి మౌనిక. అల్లారుముద్దుగా, ఏలోటూ రానివ్వకుండా పెంచారు. ఎం.టెక్‌ చదివిన మౌనిక.. పోటీ పరీక్షల శిక్షణ కోసం ఆరేళ్ల క్రితం రైలులో విజయవాడ పయనమైంది.

ఇక్కడ సీన్‌ కట్‌ చేస్తే.. మధిర రైల్వే స్టేషన్‌లో షేక్‌ బాజీ రైలు కోసం వెయిట్‌ చేస్తున్నాడు. బాజీది వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులిద్దరూ కూలీలు. ఒక అమ్మాయి. ఒక అబ్బాయి. ఇంటర్‌ పూర్తిచేసిన బాజీ.. ఖమ్మంలో ఓ కాలేజీలో డిగ్రీలో జాయిన్‌ అయి ఆసక్తిలేక మధ్యలోనే వదిలేశాడు. అంటే అతడి క్వాలిఫికేషన్‌ ఇంటర్‌.

మౌనిక ప్రయాణం చేస్తున్న రైలు.. మధిరకు రాగానే, బాజీ ఎక్కాడు. అప్పటికీ ఇద్దరికీ పరిచయం లేదు. ఎదురెదురు సీట్లలో కూర్చోవడంతో మాటలు కలిశాయి. మౌనిక.. తాను ఏ పనిమీద వెళ్తున్నదో చెప్పింది.. తానూ అదే పని మీద వస్తున్నట్టు బాజీ తెలిపాడు. విజయవాడలో ఇద్దరూ ఒకే ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు.

కొన్ని నెలల్లోనే వారు స్నేహితులయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇద్దరి మతాలు వేరు.. కుటుంబాల అభిమతాలు వేరు. పెరిగిన వాతావరణం, నేపథ్యం వేరు. చదువులు వేరు.. సంప్రదాయాలు వేరు. అయినా బాజీలో ఆమె ఏం చూసిందో, లేక బాజీయే ఏం చేశాడో తెలియదు. బాజీ మాటలను పూర్తిగా నమ్మిన మౌనిక.. అతడి పెళ్లి ప్రపోజల్‌ను సులభంగా ఒప్పుకుంది.

ప్రేమ గుడ్డిది కదా. కనీసం జీవితంలో స్థిరపడకముందే పెళ్లి ఎందుకన్న ప్రశ్న కూడా ఆమెలో ఉత్పన్నం కాలేదు. ఈ క్రమంలోనే ఓ రోజు ఆమెను బాజీ తన ఊరు నిదానపురం తీసుకువచ్చాడు. ఆమె పేరును ప్రేజాగా మార్చాడు. పెళ్లికి రంగం సిద్ధం చేశాడు. ఇది తెలుసుకున్న మౌనిక తల్లిదండ్రులు.. నిదానపురం వచ్చి కూతురుకు ఎంతో నచ్చచెప్పారు.

పెళ్లి నిర్ణయం సరికాదని బతిమలాడారు. ఆర్థిక భద్రత లేదని, బతకలేవని చెప్పారు. అయినా మౌనిక తమ మాట వినకపోవడంతో ఖమ్మం వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పిలిపిస్తే.. తాను మేజర్‌నని, ఇష్టప్రకారమే బాజీని పెళ్లి చేసుకుంటున్నానని తెలిపింది. దీంతో పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించి వేశారు.

ముస్లిం సంప్రదాయ పద్ధతిలో నిఖా జరిగింది. ఇద్దరూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. పుట్టింటితో తెగదెంపులు చేసుకొని మరీ తనను నమ్మి వచ్చిన మౌనికను అపురూపంగా చూసుకోవాల్సిన బాజీ.. దారితప్పాడు.

బాధ్యత భుజాన వేసుకోకుండా బలాదూర్‌గా తిరగడం మొదలు పెట్టాడు. కొన్నేళ్లు ఖమ్మంలో కాపురం పెట్టాడు. తర్వాత నిదానపురం మకాం మార్చాడు. ఇద్దరు అమ్మాయిలు మెహక్‌ (5), మెనురూల్‌ (4) పుట్టినా పద్ధతి మార్చుకోలేదు. స్థిరత్వం లేకుండా ఏవేవో పనులు చేసుకుంటూ.. చోరీలకు అలవాటు పడ్డాడు.

బైక్‌లు, సెల్‌ఫోన్లు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడటం ద్వారా డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు. ఇవన్నీ మౌనికకు తెలియవు. తన భర్త ఏదో ఉద్యోగం చేస్తున్నాడని భావించింది. కానీ పోలీసులు ఇంటికి వచ్చి సోదాలు చేసి, బాజీని అదుపులోకి తీసుకోవడంతో మౌనికకు అంతా అర్థమైపోయింది.

ఆరేళ్లుగా అనేక ఇబ్బందులను భరించుకుంటూ జీవనం సాగిస్తున్న మౌనిక.. తన భర్త దొంగ అని తేలడంతో భరించలేకపోయింది. అత్తామామలు కూలి పనులకు వెళ్లిన తర్వాత, ఇద్దరు పిల్లలకు ఉరి వేసి, తానూ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎవరికీ ముఖం చూపించలేక తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంది.

mounika

ఆరేళ్ల క్రితం వరకు తల్లిదండ్రుల నీడన ఆనందంగా వున్న మౌనిక.. యవ్వనమోహంలో, అపరిపక్వతతో అడుగులు వేసి జీవితాన్ని బలిపెట్టుకుంది. మోసగాడి మాయమాటలు నమ్మి, పుట్టింటితో తెగదెంపులు చేసుకొని ఊబిలో కూరుకుపోయింది.

జీవనగమనంలో తన తప్పుటడుగుల ఫలితాలు తెలిసివచ్చినా ‘మమ్మీ..డాడీ.. నన్ను క్షమించండి..’ అని శరణువేడి జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేకపోయింది. అర్ధరహిత ఆత్మాభిమానం ఆమెను ఒంటరి చేసింది.

చివరకు తన కడుపున పుట్టిన చిన్నారులను చంపి, తనను చంపుకొని హంతకిగా మిగిలిపోయింది. తల్లిదండ్రుల మాట విన్న మౌనిక చెల్లెలు లండన్‌లో స్థిరపడగా, మౌనిక దిక్కులేని శవంగా నిదానపురంలో మిగిలిపోయింది. విధి ఎంత విచిత్రమైనది!

mounika

‘‘ఆడపిల్లలెవరూ మోసగాళ్ల వలలో పడవద్దు.. తల్లిదండ్రుల, పెద్దల మాట వినాలి.. ప్రేమలో పడి పెళ్లి చేసుకునే ముందు అన్ని రకాలుగా ఆలోచించుకోవాలి.. మా బిడ్డను బాజీ మాయమాటలు చెప్పి ట్రాప్‌లోకి దించాడు.. ఆమె జీవితాన్ని నాశనం చేశాడు..

పెళ్లి చేసుకోవద్దని ఆనాడే మేము వారించాం.. మా మాట విని వుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు.. ఆడబిడ్డలారా.. తొందరపాటుతో జీవితాలను పాడుచేసుకోకండి..’ అని మౌనిక తల్లిదండ్రులు రోదిస్తూ చెప్పిన మాటలు ఎంత విలువైనవి!

కలిచివేసే ఈ ఫోటో కూడా పెడుతున్నందుకు పాఠకులు క్షమించాలి…

mounika

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘ఎ’ తెలుగు…’యాన్’ టెల్గూ…’ది’ తెగులు… ‘థి’క్కుమాలిన యాడ్…
  • నడిరాతిరి వేళా నీ పిలుపు… ఇలాంటి ఓ హిందీ పాటే ఓ ఉత్సవం…
  • ఈ తూరుపు, ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ…!
  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions