.
Mohammed Rafee….. కష్టాలన్నీ ఈయనకే వస్తాయేమో వెతుక్కుని మరీ! ప్రభుత్వం ఇచ్చిన జాగాలో ఇల్లు కట్టుకుంటే దాంట్లో కొంత జాగా ఒకరెవరో కబ్జా చేస్తే, దాంట్లోంచి బయట పడటానికి నానా కష్టాలు పడ్డాడు! ఇప్పుడేమో తన పెయింటింగ్ కాపాడుకునే ప్రయత్నం ఆయనే చేసుకుంటున్నాడు!
విషయం ఏమిటంటే… గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ వారు నగర సుందరీకరణలో భాగంగా మెట్రో పిల్లర్లకు, ఫ్లై ఓవర్ గోడలకు అందంగా పెయింటింగ్స్ వేయించారు. దీంతో చాలా మంది యువ చిత్ర కళాకారులకు ఉపాధి మార్గం కూడా లభించింది.
Ads
తెలంగాణకు చెందిన పలువురు కళాకారుల చిత్రాలు కూడా గీసి అందంగా పెయింటింగ్ చేసి ముస్తాబు చేశారు. నగర మేయర్ విజయలక్ష్మిని అభినందించాల్సిన విషయమే.
కానీ, ఈ భాగ్యనగరం మహా కార్పొరేట్ మయం! హార్డింగ్స్, పోస్టర్స్ ద్వారా పలు వ్యాపారాలు భారీ ఎత్తున జరుగుతుంటాయి! ఫ్లెక్సీలు కూడా ఎప్పటికప్పుడు వచ్చి చేరుతుంటాయి. వీటిలో అనుమతి తీసుకున్నవి కొన్ని అయితే, అనుమతి లేకుండా అర్ధరాత్రి వచ్చి గోడలకు అంటించి పోయే ఉచిత పోస్టర్లు అధికంగా ఉంటాయి…
అప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కు చెందిన సంబంధిత సిబ్బంది అనధికార హార్డింగ్స్ ను తొలగిస్తుంటారు. పోస్టర్లను చించేస్తుంటారు. ఫ్లెక్సీలు తొలగిస్తూనే ఉంటారు! అయినా అన్నిటిని తొలగించే స్థితి ఉండదు!
పద్మశ్రీ అవార్డు గ్రహీత 12 మెట్ల కిన్నెర కళాకారుడు మొగిలయ్య తన పెయింటింగ్ ను పిల్లర్ గోడ మీద చూసుకుని మురిసిపోయాడు! అప్పుడప్పుడు పని గట్టుకుని వచ్చి తన బొమ్మ చూసుకుని ఆనందపడుతుండే వారు!
నాలుగు రోజుల క్రితం అలాగే వచ్చి చూస్తే, ఆయన మనసును కలచివేసింది పాపం! తన పెయింటింగ్ పై ఏవో కమర్షియల్ పోస్టర్లు అంటించేసారు ఎవరో మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేనివాళ్లు! మొగిలయ్యకు బాధ అనిపించింది.
కార్పొరేషన్ సంబంధిత సిబ్బంది తొలగిస్తారు అని ఎవరో నచ్చచెప్పి పంపించారు. మళ్ళీ ఇవాళ వచ్చి చూసుకుంటే ఆ అడ్డమైన పోస్టర్లు ఎవ్వరూ తొలగించలేదు! ఇక లాభం లేదని తనే రంగంలోకి దిగాడు! వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు చల్లి పోస్టర్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నప్పుడు క్లిక్ మనిపించిన ఫోటోలు చూడండి!

జానపద కళాకారుడి పెయింటింగ్ కనిపించడమే చాలా అరుదు! ఆ ఆనందాన్ని కూడా మొగిలయ్య లాంటి వారికి దూరం చేయడం ఏం సమంజసం? పోస్టర్లు అంటించే వాళ్ళు కాస్త బుర్ర పెట్టండి!
ఆ పని అప్పగించే బడా బాబులు కూడా తమ వ్యాపార ప్రచారాలే కాకుండా కాస్త నగర సౌందర్యాన్ని కూడా కాపాడండి! కళాకారులను గౌరవించండి! మొగిలయ్యా బాధపడొద్దయ్యా! ఈ సమాజం ఇంతేనయ్యా! – డా. మహ్మద్ రఫీ
Share this Article