ఉచితప్రయాణంతో సరికొత్త అవకాశాలు….. తెలంగాణాలో ఆర్ టీ సీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం మీద సామాజిక మాధ్యమాల నిండా జోకులే జోకులు. సరదా, కాలక్షేపం కబుర్లను పక్కనపెట్టి… సామాజిక కోణంలో నిజంగా చర్చించుకోవాల్సిన విషయాలు ఇందులో చాలా ఉన్నాయి. ప్రభుత్వ నిర్వహణలో అన్నిటినీ లాభనష్టాలతో చూడ్డానికి వీల్లేదు. అలా లాభనష్టాల తాత్కాలిక ప్రయోజనాలు దాటి మహిళల పురోగతికి… దీర్ఘకాలంలో సమాజ పురోగతికి ఉపయోగపడే పథకమిది.
దేశవ్యాప్తంగా ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటకలో ఇలాంటి పథకానికి శ్రీకారం చుట్టడానికి ముందు జరిపిన శాస్త్రీయ అధ్యయనాల్లో తేలిన అంశాలివి:-
1. పట్టణాలు, నగరాల్లో చిరు ఉద్యోగాలు చేసే పురుషులు ఇంటి నుండి సగటున 15 కిలో మీటర్ల దూరం వరకు వెళ్లి వస్తుంటే…మహిళలు 5 కిలో మీటర్ల దూరం వరకే వెళ్లి వస్తున్నారు.
2. సగటున నెలకు 800 నుండి వెయ్యి రూపాయల వరకు ఉద్యోగం చేసే చోటుకు వెళ్లి రావడానికే ఖర్చవుతోంది.
3. మహిళలు ఎక్కువగా లేని బస్సుల్లో ఎక్కడానికి మహిళలు భయపడుతున్నారు.
ఈకోణంలో చూసినప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంత అవసరమో అర్థమవుతుంది. మహిళలకు దూరం ఒక భారం కాకుండా, ఒక భయం కాకుండా చేయగలిగితే వారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అంతిమంగా అది సమాజం స్థిరంగా నిలబడడానికే ఊతమవుతుంది. మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఒక సామాజిక పెట్టుబడిగా చూడాలన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణను కొందరు వ్యతిరేకిస్తూ… ఇలా ఇస్తూ పోతే… దేశం ఏమయిపోతుందని గుండెలు బాదుకుంటున్నారు.
Ads
ఉద్దేశపూర్వక ఎగవేతదారులు- విల్ఫుల్ డిఫాల్టర్లు ఎగ్గొట్టిన బ్యాంక్ రుణాలు ఒక పదేళ్లలో పాతిక లక్షల కోట్లు. ప్రభుత్వం రైట్ ఆఫ్ పేరిట నువ్వులు నీళ్లు వదులుకున్న కట్టని రుణాలు పది వేల కోట్లకు పైనే. వీటితో పోలిస్తే మహిళామణుల ఉచిత ప్రయాణానికి అయ్యే వ్యయభారం సముద్రంలో ఆవగింజంత కూడా కాకపోవచ్చు.
తరతరాలుగా వంటింటి కుందేళ్లని, అబలలని… అవమానించి కట్టి పడేశాము. విప్పండి కట్లు. తిరగనివ్వండి స్వేచ్ఛగా. వెతుక్కోనివ్వండి తగిన ఉద్యోగాలను. చేసుకోనివ్వండి ప్రయత్నాలను. నిలబడనివ్వండి వారి సొంత కాళ్లమీద. అందుకు ఈ ఉచిత ప్రయాణం ఉపయోగపడితే… అలక్ష్ములు మహాలక్ష్ములు అయితే… అంతకంటే కావాల్సిందేముంటుంది? -పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article