.
‘చస్తే మీరు చావండి… మీ పిల్లల్ని కూడా చంపేసి పోతున్నారేమిట్రా’…. ఈమధ్య ఈ ప్రశ్న బలంగా వినిపిస్తోంది… మానసిక వైకల్యంతోనో, దౌర్బల్యంతోనో, వేధించే అనేకానేక సమస్యలతోనే ఆత్మహత్యలు చేసుకోవడం ఈరోజు కొత్తదేమీ కాదు… ఏనాటి నుంచో ఉన్నదే…
కానీ… పిల్లల్ని కూడా చంపేస్తున్నారు… వాళ్లను కన్నందుకు వాళ్లను చంపేసే హక్కు కూడా ఉన్నట్టు… మేమే చనిపోతే ఇక మా పిల్లలకు దిక్కెవరు..? అనే భావనే కావచ్చుగాక… కానీ ఏమో, ఆ పిల్లల్లో సొసైటీకి ఉపయోగపడే ఆణిముత్యాలు ఉండవచ్చు కదా… వాళ్ల భవిష్యత్తుకు వాళ్లను వదిలేయాలి కదా…
Ads
మిత్రుడు Shankar G రాసిన ఒక పోస్టు ఆసక్తికరంగా ఉంది… అనాథలు జీవితంలో బాగా ఎదగలేరనే భావనే తప్పు… అలాగే అపురూపంగా పెంచబడిన వాళ్లు విరిగిపడకూడదనీ లేదు…
‘‘ఎందుకీ సమాజం ఇలా తగలడుతుంది. ఇలాంటి వారి కోసం సినిమాలు తీసేవాళ్లే లేరా.. మీరు సినిమాలు తీయాల్సింది టీనేజ్ తిమ్మిరిలో పెట్టించుకునే ఫోక్సో చట్టాల మీద కాదు. ఇలాంటి మానసిక దుర్భలుల మీద… జీవించి ఉండటమే గొప్ప అదృష్టంగా భావించటం మీద…
అదే కాకినాడ… ఇద్దరు పిల్లల్ని నీళ్ల బకెట్లలో తలలు ముంచి చంపేసిన క్రూరత్వం చదివాం కదా… అదే కాకినాడ… ఓ మారుమూల ప్రాంతంలో కూలి పని చేసుకునే కుటుంబం… 11 మంది సంతానం… 7, 8 ఏళ్ల కుర్రాడు ఆకలి బాధ భరించలేక కనపడిన ఏదో ట్రైన్ ఎక్కి కలకత్తా చేరాడు.
ఒక సినిమా స్టూడియో ముందు వంటి మీద చొక్కా కూడా లేకుండా నిలబడ్డ ఆ కుర్రాన్ని వాచ్‌మన్ దగ్గరికి పిలిచి తినటానికి అన్నం పెట్టి పని చేస్తావా అని అడిగాడు. చేస్తాను అన్నాడు. ఈస్టిండియా కంపనీ వారు తీస్తున్న సినిమాకు స్టూడియోలో ట్రాలీ బాయ్ గా చేరాడు. అప్పట్లో ట్రాలీ విపరీతమైన బరువు ఉండేవి. వాటిని తోయాలంటే 10,12 మంది కావలసి వచ్చేది.
ఆ విధంగా మూడేళ్లు అక్కడే ట్రాలీ బాయ్ గా పనిచేస్తూ, తర్వాత మద్రాసు చేరి, మోతీలాల్ చాబ్రియా , కస్తూరి శివరావ్ , రఘుపతి వెంకయ్య వద్ద ఆఫీస్ బాయ్ గా పని చేశాడు. స్టంట్ మాస్టర్ గా పని చేశాడు. పాతాళభైరవి , రాజుపేదలో యన్టీఆర్ కు డూప్ గా చేశాడు.
ఒక ఇంగ్షీషు మూవీ కోసం ఎక్కువ భాషలు తెలిసిన ప్రొడక్షన్ మేనేజర్ కోసం వెదుకుతున్న ఆ సినిమా యూనిట్ ఇతన్ని ఎంచుకున్నారు. ఈ సినిమా కోసం రోమ్ కూడా వెళ్ళాడు. పారితోషకం కింద 20 వేల డాలర్లు సంపాదించాడు. తాను పోగు చేసుకున్న డబ్బుతో సినిమా తీయాలి అని అక్కినేని నాగేశ్వరరావ్ ని కలిశాడు.
నీవు నాతో సినిమాలు తీసేంత వాడివా .. అని అక్కినేని ఇతన్ని ఈసడించుకుని, ఇతన్ని వరండా నుండి గేటు బయటికి పంపించాడు. కానీ తన పట్టు వదల్లేదు. కొంతమంది మిత్రులతో కలిసి కృష్ణ హీరోగా జగత్ కిలాడీలు నిర్మించాడు…
తర్వాత వరుసగా జగత్ జంత్రీలు , జగత్ జెట్టీలు సినిమాలు నిర్మించాడు . ఈ సినిమాలకు డైలాగులు రాస్తున్న ఒక యువకుడికి నీకు దర్శకుడిగా అవకాశం ఇస్తానోయ్ అనేవాడు. అన్నమాట ప్రకారం ఆ రచయితకు దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చాడు . ఆ సినిమా తాతా మనవడు, ఆ దర్శకుడు దాసరి నారాయణరావు . ఆ నిర్మాత కె . రాఘవ.
తన తల్లిదండ్రులు సోదరులు ఎక్కడ ఉన్నారో గుర్తుపట్టలేను అంటాడు. ఇంటిపేరు కూడా తాను తగిలించుకున్నదే అని చెప్పాడు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో.. తూర్పు పడమర సినిమా విషయంలో దాసరికి తనకు విభేధాలు రావటంతో ఆ తర్వాత మళ్లీ దాసరితో సినిమాలు తీయలేదు.
కానీ అతని శిష్యుడైన కోడి రామకృష్ణకు దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ద్వారా . చిరంజీవికి ఇదే మొదటి సిల్వర్ జూబ్లీ మూవీ. ఈ సినిమాతో చిరంజీవి ప్రామిసింగ్ హీరోగా మారిపోయాడు.
తర్వాత ఇదే దర్శకుడితో నిర్మించిన తరంగిణి సినిమా ద్వారా సుమన్ , భానుచందర్ పాపులర్ అయ్యారు. తరవాత కూడా కొన్ని సినిమాలు నిర్మించి కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చాడు. ఆ విధంగా 16 చిత్రాలు నిర్మించాడు. రఘుపతి వెంకయ్య ఆవార్డు పొందాడు . 104 సంవత్సరాల వయసులో మరణించాడు… సో. కాలం అందరికీ చాన్స్ ఇస్తుంది. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు… పిల్లల్ని చంపేయకండి…
Share this Article