*ప్రతిభ, అవగాహన లేకుంటే అనుభవం అనేది అక్కరకు రాని మాట* ఒక విషయాన్ని అర్థం చేసుకుని, ఎదురయ్యే సమస్యలకు అన్వయించి… పరిష్కరించడాన్ని ప్రతిభ – వివేకం అంటారు. బట్టీయం పట్టి, ఎక్కువ మార్కులతో ముందు వరసన నిలవడం అనేది వివేకానికి కొలమానం కాదు. అలాగే, ఎదురయ్యే పరిస్థితులకు అన్వయించగల శక్తి లేనివారికి ఎంత అనుభవం ఉన్నా… దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. విద్యార్థులుగా చాలా ఎక్కువ మార్కులతో గొప్ప ప్రతిభావంతులుగా చలామణి అయిన వారిలో కొందరు, జీవితంలో పెద్దగా రాణించకపోవడం తెలిసిందే.
నా ప్రాక్టీసు మొదటి ఆరు సంవత్సరాలు (2000 – 2006) క్లినిక్ తో నడిచింది. పరిస్థితి విషమంగా ఉన్న పేషంట్లను దగ్గరలో ఉన్న నర్సింగ్ హోమ్ లో అడ్మిట్ చేసి, చూస్తుండేవాడిని. నర్సింగ్ హోమ్ ఓనర్ అయిన డాక్టర్ గోపీనాథ్ బార్డోలాయ్ గారు వయసులో బాగా పెద్దాయన. నన్ను బాగా ప్రేమించి, గౌరవించేవారు. హెచ్ఐవి – ఎయిడ్స్ లో అన్ని సూపర్ స్పెషాలిటీలకు సంబంధించిన సమస్యలూ తలెత్తుతుంటాయి. సాధారణంగా నా పేషంట్ సమస్యలు అన్నిటికీ నేనే వైద్యం ఇస్తుండేవాడిని.
2000 సంవత్సరం ప్రాంతంలో హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు అంటే మరణమే అని అందరూ నిశ్చయించుకునేవారు. తీవ్రంగా జబ్బు పడ్డ పేషంట్స్ కూడా నా వైద్యంతో కోలుకొని, మామూలు మనుషులు కావడం చూసి పేషెంట్స్, ఇతర డాక్టర్లు ఆశ్చర్యపోయేవారు. నేను క్లినికల్ ఎగ్జామినేషన్ అనే పేషంటుని పరీక్షించడాన్ని చాలా సింపుల్ గా ముగించేవాడిని. మా నర్సింగ్ హోమ్ డాక్టర్ గారు, మీరు పేషెంట్ ని సరిగ్గా చూడరు… అయినా గొప్ప వైద్యం ఇస్తారు… మీకేదో అతీత శక్తి నుంచి సూచనలు అందుతున్నాయని అంటూ ఉండేవారు. మానవవాది (హ్యూమనిస్టు)ని అయిన నేను నవ్వి ఊరుకునేవాడిని.
Ads
ఒకసారి మరీ విషమించిన స్థితిలో వున్న ఒక పేషంట్ ని… అతని బంధువులు బతిమాలడంతో అడ్మిట్ చేసాను. నర్సింగ్ హోమ్ డాక్టర్ గారు తనకు తెలిసిన ఒక సూపర్ స్పెషలిస్ట్ ని పిలుద్దాం అని చెప్పారు. ఇష్టం లేకపోయినా సరే అన్నాను. ఆ డాక్టర్ గారు రావడం రావడం తోటే, అప్పట్లో జన సామాన్యంతో పాటు డాక్టర్లలో కూడా ఉండిన అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటూ, ఎందుకండీ ఇలాంటి కేసులకి వైద్యం అన్నారు. ఆయన ఉండగానే నేను నాకు క్లినిక్ కి వచ్చేసాను.
తర్వాత, ‘హౌ డు యు నో దిస్ ఫెలో ( ఇతగాడు మీకు ఎలా తెలుసు)?’ అని నా గురించి ప్రశ్నించేసరికి… మా నర్సింగ్ హోమ్ డాక్టర్ గారు, ‘సార్ ఆయన చాలా గొప్ప వైద్యం ఇచ్చి, విషమ పరిస్థితిలో ఉన్న పేషెంట్స్ అనేక మందిని ఇప్పటికే బతికించారు అని చెప్పారు. తర్వాత పేషెంట్ చనిపోయారు. ఆ పేషెంట్ బాధపడుతున్న క్లిష్టమైన పరిస్థితి నుండి ఆరోగ్యం సంతరించుకునే అవకాశం లేదు అనేది వైద్యశాస్త్రపు అప్పటి అవగాహన . ఆ తదుపరి కాలంలో ఆయనను పిలిచింది లేదు. కాగా, హెచ్ఐవిలో తలెత్తే ఆ జటిలమైన సమస్యను నేను లోతుగా అధ్యయనం చేశాను. నా 23 ఏళ్ల ప్రాక్టీస్ లో ఇప్పటికి ఇద్దరు పేషంట్స్ ని ఆ జబ్బు నుండి స్వస్థ పరచగలిగాను. అయితే నిపుణులు ఇప్పటికీ ఆ క్లిష్ట సమస్యకు వైద్యం లేదనే భావిస్తున్నారు.
ఇదిగో, చిత్రంలో నాతో పాటు ఉన్న ఆయనకి, హెచ్ఐవి లేదు. బీపీ, షుగర్ తో పాటు పెద్ద అనారోగ్య సమస్య తలెత్తింది. కొత్తగా తలెత్తిన జబ్బు ఉపశమనం కోసం ముగ్గురు డాక్టర్లను కలిసారు. ముందు చెప్పుకున్న సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ కి సంబంధించిన సమస్య ఇది. ఆయన దగ్గరకు కూడా రెండు సార్లు వెళ్ళొచ్చారు. మందుల ప్రిస్క్రిప్షన్స్ అన్నీ చూసిన తర్వాత నేను చేయగలిగేది ఏమీ లేదు అని చెప్పాను. ఏదో ఒకటి మీరే చేయాలంటూ పట్టుపట్టారు.
దాంతో, వాళ్లని బయట కూర్చోమని గంటకు పైగా హోంవర్క్ చేసుకొని… ఆయన వాడే మందులలో రెండింటి వల్ల సమస్య తలెత్తుతున్నదని గ్రహించాను. నిజానికి చాలా సురక్షితమైనవిగా భావించే మందులు అవి. ఇటీవల కాలంలోనే ఆ విషయాలు వైద్య ప్రపంచం నమోదు చేసి ఉంటుంది. ఇబ్బందికరమైన మందులను ఆపి, సమస్య ఉపశమనానికి ఔషధాలను ఇచ్చాను. వారం రోజుల్లోనే పేషెంట్ కోలుకున్నారు.
కొన్ని సందర్భాలలో… పరిష్కారాలు మన ఎదురుగానే ఉంటాయి… వాటి కోసం వెతకాలి. అలాంటి ప్రయత్నానికి మనుషుల పట్ల ఎంతో ప్రేమ… మరి ఎంతో వివేకం కావాలి. విద్యార్థిగా నేర్చుకున్న జ్ఞానంతో పాటు, నిరంతరం సంచితమవుతున్న జ్ఞానాన్ని కూడా వంట పట్టించుకోవాలి. అప్పుడే, ప్రజలకు మేలు చేయగలము. పేషంట్స్ యొక్క జీవితాలలో సంతోషం నింపవచ్చు. ఎనలేని సంతృప్తి మన పరమవుతుంది.డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండి, సాంక్రమిక వ్యాధుల నిపుణులు, కాకినాడ, 14 జూన్ 2023
Share this Article